సుప్రభాత కవిత ; -బృంద
మదిని వదలని
మధురమైన కలలలాగా
పాదాలను తాకే అలలు
కాలికింది ఇసుకలాగా
జారిపోయే క్షణాలు

మార్పు కోరుకునే మనసుతో
మనుగడలో ముందడుగుకై
తూర్పు తలుపు ముంగిట
ఓర్పుగా వేచిన కనులు

గగన మైదానంలో నిలిచి
దీక్షగ చూపులు నిలిపి
కదిలివచ్చు వేకువకై 
ఎదురుచూస్తున్నమబ్బుల్లా

తలచిన క్షణాలకై 
నిలచి చూచు తొందరతో
దోసిట మరుమల్లెలతో
తలవాకిట పడిగాపులు

జీవితం చిరం కాదు
కాలం స్థిరం కాదు
తెలియని నిజం కాదు
మాయ వీడిపోదు.

నడి సంద్రపు పడవలా
సుడిగుండపు పాలవకుండా
గాలివాటు బ్రతుకులను
దరి చేర్చే దయ కలిగిన

దినకరుడికి  

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు