ఐ పి ఎల్ వలనే క్రికెట్ కు గ్రహణం;- సి.హెచ్.ప్రతాప్

 ఐ పి ఎల్ వలనే భారత దేశం లో క్రికెట్ ఆటకు గ్రహణం పట్టిందని ఇటీవల ప్రపంచ కప్ లో భారత జట్టు పరాజయం తర్వాత పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేయడం సమంజసంగా వుంది.  వినోదం కోసం నిర్దేశించబడిన ఈ క్రికెట్ క్రీడలో  వున్న ఆదరణను అడ్డం పెట్టుకొని క్రమంగా కార్పొరేట్ సంస్థలు ప్రవేశించి ఒక వ్యాపారంగా మార్చివేసాయి. ఐ పి ఎల్  క్రీడలో  కార్పొరేట్లు  వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తుతున్నారు. పలువురు దేశీయ,విదేశీ ఆటగాళ్ళను సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నాయి. అన్ని వేల కోట్ల నిధులు ఈ కార్పొరేట్ సంస్థలకు ఎలా వచ్చాయన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు ప్రభుత్వం, నియంత్రణా సంస్థలు చేపట్టకపోవడం దురదృష్టకరం.పోటీ సమయంలో  అసభ్యకర నృత్యాలతో దేశ సంస్కృతి , పరువు ప్రతిష్టలను బజారు కీడుస్తున్నారు. బెట్టింగ్ ల పేరుతో వందల కోట్లు చేతులు మారుతున్నా నియంత్రణా సంస్థలు చోద్యం చూస్తున్నాయి. క్రికెట్ కు సంబంధం లేనివారంతా  బి సి సి ఐ లో ప్రవేశించి కోట్లు వెనకెసుకుంటున్నారు. బి సి సి ఐ ను ప్రభుత్వం పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకోవాలని పలువురు క్రికెటర్లు, మేధావులు చేస్తున్న విజ్ఞప్తులు బుట్టదాఖలు అవుతున్నాయి. ఐ పి ఎల్ లో ఆడి కోట్లు, కీర్తి ప్రతిష్టలు గడిస్తున్న ఆటగాళ్ళు దేశం కోసం ఆడే స్పూర్తిని, పోరాట స్పూర్తిని కోల్పోతున్నారన్నది నిర్వివాదాంశం. ఐ పి ఎల్ వలనే తమ జట్టు ముఖ్య క్రీడాకారులు పేలవమైన ప్రదర్శన కనబరిచారని దక్షిణాఫ్రికా జట్టు సెలెక్టర్లు పేర్కొనడం గమనార్హం.అందుకే ఇకపై ఐ పి ఎల్ లేదా  దేశీయ జట్టు కట్టు లలో ఏదో ఒకదానిలో మాత్రమే ఆడేవిధంగా ప్రభుత్వం నియమ నిబంధనలు రూపొందించాలి. ఐ పి ఎల్ ద్వారా వేల కోట్లలో జరుగుతున్న లావాదేవీలతో పాటు గతం లో జరిగిన పలు అక్రమాలపై ఒక సిట్టింగ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి చేత నిష్పాక్షికంగా విచారణ జరిపించాలి. ఇప్పటికే కార్పొరేట్ సంస్థల కన్ను గ్రామీణ క్రీడగా ఎంతో ఆదరణ పొందుతున్న కబడ్దీ పై కూడా పడింది. ఆటను ప్రాచుర్యం చేయడం కంటే కాసులు వెనకెసుకోవడం లోనే ఈ కార్పొరేట్ సంస్థలు దృష్టి సారిస్తాయన్నది జగమెరిగిన సత్యం. ఈ ప్రహసనానికి అడ్డుకట్ట వేయకపోతే ఇక అన్ని ఆటలలోకి ఈ వైరస్ పాకడం తధ్యం.
కామెంట్‌లు