సుప్రభాత కవిత ; -బృంద
భాషకు అందని భావన
అర్థమయేలా చెప్పే ఏకాంతం
మాటకు అందని మౌనమే
భావంగా తెలిపే ఒంటరితనం

అలల లాగే పుట్టుకొచ్చే
వేల వేల ఊహలు
అంతరంగాన్ని తాకి
విరిగిపోవు మరి మరీ

చేరుకోని తీరాల ఊసులు
అందుకోని ఆనందాలు
నిదురలేని నిశీధులు
ఎదురుచూచు నిరీక్షణలు

అన్నీ కలిసి అలజడులు
ఎంతకూ దొరకని నిలకడలు
ఏవో తెలియని భయాలు
అవే అన్నీ అని మోహాలు

వింతవింత మనసు పోకడలకు
విస్తుపోతూ చూస్తుంటే
కునుకు కరవై తెరచి వుంచిన
కనుల ముంగిట వెలుగులు

రెండు కొండల వింటి మధ్య
సారించిన మయూఖ శరపరంపరల
మెరుపులు తెచ్చే సందేశం
నిన్న కన్నా నేడు మిన్న యని

కారుమబ్బులు అడ్డంకులు
కమ్ముకొచ్చినా ఆగకుండా
నీలి నింగిని వెలుగు పువ్వులు 
చిమ్ముతూ ఏతెంచిన కాంతిపుంజం

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు