వైద్య రంగానికి అత్యవసర చికిత్స- సి.హెచ్.ప్రతాప్

 ప్రపంచ ఐక్యరాజ్య సమితి  తన తాజా అధ్యయన నివేదికలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం లో భారత దేశం గత అయిదేళ్ళలో రెండు స్థానాలు మెరుగుపరచుకొని 103 వ  ర్యాంకుకు ఎగబాకడం శుభపరిణామం. 2014 లో అధికారం చేపట్టిన నాటినుండీ చిత్తశుద్ధితో, అంకిత భావంతో పని చేసి ముఖ్యంగా ప్రభుత్వ వైద్యానికి జవసత్వాలు కలిపించడం వలనే ఈ మాత్రం అభివృద్ధి అయినా సాధ్యపడింది. , గత యు పి ఏ ప్రభుత్వం  ఒక దశాబ్దం పాటు ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్లక్ష్యం తో అనాధగా వదిలివేయడం వలనే ఈ దుర్గతి ప్రాప్తించిందనేది విస్పష్టం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్ళు వున్నాయి. భారతీయ వైద్య రంగం లో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వైద్యశాలలలో మౌలిక సదుపాయాల లేమి వంటి అనేక సమస్యలు హిమాలయాల వలె తిష్ట వేసుకొని వున్నాయి.ఏటా కొత్త కళాశాలలు ఆవర్భవిస్తున్నా ఇప్పటికీ దేశం లో 60 కోట్ల మందికి వైద్య సౌకర్యాలు అరకొరగా అందుతున్నాయని సదరు నివేదిక తేల్చి చెప్పింది.తాజా గణాంకాల ప్రకారం ప్రతీ 1500 మందికి ఒక వైద్యుడు అందుబాటులో వుండగా ఐక్య రాజ్య సమితి నిర్దేశాల ప్రకారం ప్రతీ 400 మందికి ఒక వైద్యుడు వుండాల్సి వుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికపై వైద్యకళాశాలలు ఏర్పాటు చేయాల్సి వుంటుంది.అంంతేకాకుండా అధికశాతం వైద్యులు పట్టణాలకే పరిమితం అవుతున్నందున గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అతి దయనీయంగా మారింది.దానికి తోడు అర్హులైన అధ్యాపకులు దొరకక భారతీయ వైద్యమండలి వైద్య విద్యాప్రమాణాలను సడలించి, కొత్తగా పట్టభద్రులైన వారికి ఆదరాబాదరాగా శిక్షణ పూర్తి చేయించి ఆసుపత్రులలో నియమిస్తుండడం వలన ప్రజలకు మేలైన వైద్యం లభించడం లేదు. 2018 లో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా  ప్రారంభించిన ఆయుష్మాన్ భవ పధకం పురిటిలోనే అనేక బాలారిష్టాలు ఎదుర్కొంటూ కేవలం కార్పొరేట్ ఆసుపత్రులకు కాసులు కురిపించే పధకం గా మారుతుండడం పై వైద్య నిపుణులు ఆర్ధిక మేధావులు అసంతృప్తి వ్యక్తం చెస్తున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం తక్షణం వైద్య రంగానికి అత్యవసర చికిత్స చేయడానికి సంకల్పించాలి. గ్రామీణ స్థాయి ప్రజలకు మెరుగైన వైద్యం అంద క, ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడేవారికి సహాయం అందించేందుకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలి.అసోసియేషన్‌ సభ్యులు కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని ప్రజలకు వైద్య పరీక్షలు అందిస్తూ, ఏమైనా ఆపరేషన్‌లు అవసరం ఉంటే ఇతర ఆసుపత్రుల వైద్యులకు రిఫర్‌ చేసి ఖర్చు ఎక్కువ కాకుండా మాట్లాడి వారి బాగో గులు చూడడం ముఖ్య ఉద్దేశ్యం కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలలో ప్రధానంగా నాణ్యమైన వైద్యం, సలహాలు, సూచనలు, ఆరోగ్యం కాపాడుకోవడానికి గల జాగ్రత్తలను వివరించాలి. 
కామెంట్‌లు