సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -396
ఆశా మోదక తృప్త న్యాయము
******
ఆశ అనగా అపేక్ష, దిక్కు,ఆస, కోరిక అనే అర్థాలు ఉన్నాయి.మోదకం అనగా కుడుము, లడ్డు. తృప్త అనగా సంతోషించిన,తృప్తిగల అనే అర్థాలు ఉన్నాయి.
ఆశ అనే లడ్డూలతో తృప్తి పొందిన వాని వలె.
ఆశామోదక యుతులకు,ఉపార్జిత/ సంపాదింపబడిన మోదకవంతులకు గల భేదము తద్వారా కలిగిన తృప్తి యందును గలదు.
 "ఆశ చేత మనుజులాయువు గలనాళ్ళు/తిరుగుచుందురు భ్రమ తిప్పుదాక/ మురికి భాండమందు ముసురు నీగల భంగి/ విశ్వదాభిరామ వినురవేమ "
మురికి కుండలపైన ఈగలు ముసురునట్లు మనిషి భౌతిక సుఖాల చుట్టూ జీవితాంతం తిరుగుతూనే వుంటాడు.అలా ఎన్నాళ్ళు తిరుగుతాడు? ఎన్నాళ్ళంటే భ్రమ తొలిగేదాక.మరి భ్రమ తొలుగుతుందా? ఆశ చచ్చిపోతుందా?  అంటే లేదని అర్థం. ఆశ, భ్రమ ఇవి మనిషిని తొందరగా వదిలిపెట్టవు.
ఆశ అనేది ఊరించే లడ్డూ లాంటిది.తెలియని సుఖం అన్నమాట.అది దొరికేంతవరకు అనగా బతికి ఉన్నంత కాలం మనసు దాని చుట్టే తిరుగుతుంది.
 
ఈ విధంగా"ఆశా మోదక తృప్త న్యాయము"లో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఆశ అనేది బతికించే శ్వాస కూడా.ఆశ లేనివాడు జీవశ్చవంతో  సమానం. అందుకే ఆశను తీయని లడ్డూతో పోల్చడం జరిగింది.
ఆశకు సంబంధించి ఓ శ్లోకాన్ని కూడా చూద్దామా.
"ఆశాయాఃయే దాసాః,,తే దాసాః సర్వ లోకస్య/ఆశా యేషాం దాసీ, తేషాం దాశాయతే లోకః!!"
ఆశకు ఎవరైతే దాసులో వారు సమస్త లోకానికి దాసులు.ఆశ ఎవరికైతే దాసియో అటువంటి వారికి  సమస్త లోకమూ దాసియే.
అనగా ఆశ మనిషికి ఉండటం సహజం.అవసరం కూడా.ఆశ సృష్టిని నడిపించే ఇంధనం.ఆశ లేని జీవితం గింజ కట్టని పొల్లు వెన్ను లాంటిది.అలాగే ప్రమిదలోని వత్తి వంటిది కూడా అంటారు.దానికి సరిపడా నూనె పోసి వెలిగిస్తే చక్కగా వెలుగుతుంది.వత్తి కూడా మునిగేంత వరకు నూనె పోస్తే వత్తి వెలగదు.
ఇలా ఆశను ప్రమిదలోని వత్తితోనూ,లడ్డూతోనూ , శ్వాసతోనూ, సృష్టిని నడిపించే ఇంధనంతోనూ పోల్చడం జరిగింది.
ఈ విధంగా ప్రతి  మనిషికి ఆశ అనేది వుంటుంది.ఉండాలి కూడా.ఐతే ఆశ అత్యాశ కాకుండా చూసుకోవాలి.స్వార్థరహిత ఆశ ఎప్పుడూ సమాజ హితమే.అప్పుడే సఫలమైన ఆశ లడ్డూ వలె తీయని అనుభూతిని, తృప్తిని ఇస్తుంది.
గురజాడ గారు చెప్పినట్టు స్వంతలాభం కొంత మానుకు/ పొరుగు వారికి తోడుపడవోయ్" అన్న మాటలను గమనంలో‌ పెట్టుకొని ఆశకు ఆశయాల తీపిదనం అద్దుదాం.తృప్తికరమైన జీవితాన్ని గడుపుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏



కామెంట్‌లు