తపస్విని...;- ప్రమోద్ ఆవంచ- 7013272452

 కళలకు నిలయం నల్లగొండ జిల్లా కేంద్రం.అక్కడ రంగస్థల
నటులు ఉన్నారు, చాలా అద్భుతమైన నాటకాలు ప్రదర్శించేవారు.మధురంగా పాడే గాయకులు ఉన్నారు, హృదయానికి హత్తుకునేలా,పాటలు రాసిన రచయితలు ఉన్నారు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అద్భుతంగా వాయించే,నేర్పించే గొప్ప మ్యుజీషియన్స్ ఉన్నారు, చిత్రలేఖనంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప ఆర్టిస్టులు
ఉన్నారు, వివిధ రంగాల్లో జాతీయ పురస్కారాలు పొందిన మహానుభావులు ఉన్నారు.ఇటీవలే గురువు గారు పురుషోత్తమా చార్యులు కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా పొందారు.రాజకీయాల్లో పరిణితి చెందిన గొప్ప నాయకులు ఉన్నారు.కమ్యూనిస్ట్ ఖిల్లాగా పేరొందిన నల్గొండ జిల్లాలో నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు నాయకులు, వాళ్ళు ప్రజా సమస్యలపై పోరాడిన చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యాయంలో లిఖించబడి ఉంది.
రాయడం, చదవడం, పాడడం,సంగీతం,సంగీత వాయిద్యాలు, చిత్రలేఖనం, సాంప్రదాయ నృత్యం ... ఇత్యాది విషయాలపై ప్రావీణ్యం ,అవగాహన, ఆసక్తి ఉన్న ఒక గ్రూపు నల్గొండ టౌనులో గత యాభై ఏళ్ల క్రితంలోనే ఉండేదనీ వాళ్ళల్లో శ్రీరామచంద్రమూర్తి, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత పురుషోత్తమా చార్యులు, కనకాచారి గార్లతో సహా ఇంకొంతమంది ఉండేవారనీ అప్పట్లో అందరూ అనుకుంటుంటే వినేవాడిని..
శ్రీరామచంంద్రమూర్తి గారు గీతా విజ్ఞాన సమితికి ఫౌండర్ చైర్మన్ గానే కాకుండా, పిల్లలకు చిత్రలేఖనం, మ్యూజిక్, సంగీతం, గాత్రం, మొదలైన అంశాలు నేర్పించాలనే ఉద్దేశంతో పందొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో బాలభవన్ ను ప్రారంభించారు....నా లాంటి వేల మంది విద్యార్థులకు వారి వారి ఆసక్తుల ప్రకారం వివిధ కళలను నేర్పించారు.నేను‍ పందొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం నుంచి ఎనభై అయిదు వరకు బాలభవన్ లో చిత్రలేఖనం, గురువు గారు రామ్మూర్తి , వాయులిన్ గురువు గారు సూరి  దగ్గర నేర్చుకున్నాను.రామ్మూర్తి  లేని సమయంలో గురువు గారు కనకాచారి  చిత్రలేఖనంలో ఓనమాలు నేర్పించేవారు....కట్ చేస్తే...
                     ఎనభైవ దశకంలో సినిమా చూడడం అంటే
కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం.అప్పట్లో నల్గొండ టౌనులో వెంకటేశ్వర, లక్ష్మీ, భాస్కర్,న్యూ ప్రేమ్,
నటరాజ్ థియేటర్లు ఉండేవి.వెంకటేశ్వర,న్యూ ప్రేమ్ టాకీసులు కొత్తవి.అప్పట్లో ఒక సినిమా రిలీజ్ అయ్యిందంటే దాదాపు నెల రోజుల పాటు ఒక థియేటర్ లో ఆడేది.హింది సినిమాలు మాత్రం ఒక వారం రోజులు
నడిచేవి.వెంకటేశ్వర థియేటర్ లో అమితాబ్ మిస్టర్ నట్వర్ లాల్ సినిమా చూసిన జ్ఞాపకం నా మస్తిష్కంలో ఇంకా కదలాడూతే ఉంది.నటరాజ్ టాకీస్ లో భక్త కన్నప్ప సినిమా రిలీజ్ అయినప్పుడు శివుని విగ్రహం పెట్టి, కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేసేవారు.ఏదైనా అమ్మవారి సినిమా వస్తే మహిళలకు కుంకుమ ,తాంబూలం ఇచ్చేవారు.అప్పట్లో సినిమాను అంతగా ఆదరించేవారు.సినిమా అంటే అప్పట్లో అందరి వ్యక్తిగత జీవితాలతో అన్వయించుకునే ఒక మాధ్యమంగా, ఉండేది.ఆ పిచ్చి ఎంత వరకు ముదిరిపోయిందంటే సినిమా మైకంలో పడి ఆ దశకంలో ప్రేమ వివాహాలు,కులాంతర వివాహాలు అనేకం జరిగాయి.
అభ్యంతరకర సన్నివేశాలు ఉన్న సినిమాలను చిన్న పిల్లలను చూడనిచ్చేవారు కాదు.అప్పట్లో భర్త తనను సినిమాకు తీసుకువెళితే ఆ భార్య సంతోషానికి అవధులు ఉండేవి కావు.ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో సినిమా ఏదో రకంగా ప్రభావాన్ని చూపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.సినిమాలు డబ్బులు పెట్టి చూడలేని వాళ్ళు డబ్బున్న వాళ్ళ ఇండ్లల్లోనీ టీవీల్లో శుక్రవారం  చిత్రలహరి చూసి తృప్తి పడేవారు.ప్రతి ఆదివారం మధ్యాహ్నం రేడియోలో సినిమా వచ్చేది,అదీ కేవలం  ఆడియో మాత్రమే.రాత్రి బినాకా మన్ చాహే గీత్ మాల, ఉదయం రారండోయ్...రారండొయ్ అంటూ బాలానందం పిల్లల కార్యక్రమం రేడియో అన్నయ్య, అక్కయ్య నిర్వహించేవారు.ఇవేవీ లేకుంటే చెస్, క్యారమ్స్, అష్టాచమ్మా,పరమపదసోపానం, దొంగాపోలీసు
కోతి కొమ్మచ్చి ఆటలు.. వీక్లీ మాగజైన్స్, మధుబాబు షాడో డిటెక్టివ్ నవలలు, యండమూరి, యద్దనపూడి, మన్నెం శారద, మల్లాది నవలలు ఇవీ అప్పట్లో మన ఎంటర్టైన్మెంట్స్.... కట్ చేస్తే....
                రాజరత్నం... డెబ్భై,ఎనభైవ దశకంలో నల్గొండ జిల్లాలో ఒక సెలబ్రిటీ.రెండు సార్లు నల్గొండ మున్సిపల్ చైర్మన్, ఒకసారి ఎంఎల్ఏ, ఒకసారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు.ఈయనలో మరొక కోణం గొప్ప రంగస్థల నటులు,కథా,పాటల రచయిత, దర్శకుడు,
నిర్మాత.నల్గొండ టౌనుహాల్ వేదికగా అనేక నాటకాలు
ప్రదర్శించారు.అప్పట్లో సినిమా పరిశ్రమ మద్రాస్ లోనే
ఉండేది.హైదరాబాద్ లో చిత్ర నిర్మాణం అడపాదడపాగా
జరుగుతుండేది.ఈ పరిస్థితుల్లో భువనగిరికి చెందిన
ముగ్గురు వ్యక్తులు దూరదర్శన్ కోసం ఒక షార్ట్ ఫిల్మ్
తీసారు.దాంట్లో గెస్ట్ అప్పియరెన్స్ గా చిన్న పాత్రలో శిల్ప
అనే అమ్మాయి నటించింది.అది టెలికాస్ట్ అయ్యిందా లేదా అన్నది తెలియదు కానీ,ఆ ముగ్గురు రాజరత్నం గారిని సినిమా తీయాలని వత్తిడి చేసారు.ఏదో కథ ఎందుకు మీ జీవిత కథనే సినిమాగా తీద్దాం అని ఆయనను ఒప్పించారు.అలా మొదలైంది, నలభై ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ స్టోరీ వీడియో ఫిల్మ్.నల్గొండ మ్యుజీషియన్స్,సింగర్స్, లొకేషన్స్... నల్గొండ జిల్లాను దాటి బయటకు వెళ్ళలేదు. నాగార్జునసాగర్ లో హీరో హీరోయిన్ ల మధ్య డ్యూయెట్ సాంగ్, క్లైమాక్స్ ముందు సీన్లు యాదగిరి గుట్టలో, క్లైమాక్స్ సన్నివేశాలు వాడపల్లిలో చిత్రీకరించారు.హీరో రాజరత్నం, హీరోయిన్ శిల్ప ఆమెది నల్గొండ కాదు.మిగితా టెక్నీషియన్స్ అందరూ నల్గొండ జిల్లా వాళ్ళే.మ్యూజిక్ డైరెక్టర్ కనకాచారి ,ఆయనతో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వ అవార్డు పొందిన పురుషోత్తమా చార్యులు  ఈ సినిమాకు పనిచేసారు.ఆయన సంగీతంలో, కీబోర్డ్ లో,ప్రావీణ్యులు.
ఇంతకీ ఆ సినిమా పేరు చెప్పలేదు కదూ..తపస్విని...
ఈ సినిమా రాజరత్నం గారి బయోపిక్.
ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్మించిన మొదటి ఫుల్ లెంగ్త్ స్టోరీ వీడియో ఫిల్మ్.సినిమాలో హీరో రాజరత్నం, హీరోయిన్ అప్పట్లో టెలివిజన్ సీరియల్స్ లో నటించిన శిల్ప.ఈవిడ
ఫుల్ లెంగ్త్ ఫిలింలో నటించడం అదే మొదటిసారి.ఆ తరువాత రోజుల్లో అనగనగా ఒక శోభ అనే టీవీ సీరియల్ లో నటించి ఫేమస్ అయ్యింది.టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన శిల్ప ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది.
               మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో సంగీత దర్శకులు
కనకాచారి , దేవరకొండలో కండక్టర్ గా పనిచేసే సుగుణ్ తబలా, పురుషోత్తమాచారి,ఎస్టీఓ ఆఫీసులో పనిచేసే బెంజమిన్ లు కీబోర్డు, కనకాచారి హార్మోనియం,
రూపస్ ఫ్లూట్ వాయిద్యాలు వాయించారు.ఇందులో బెంజమిన్,రూపస్ లకు కనకాచారి తబలా నేర్పించారు. సినిమాలో రెండు పాటలు, ఆ రెండు పాటలను రాజారత్నం రాసారు.అందులో ఒకటి డ్యూయెట్ సాంగ్.
ఈ సాంగ్ లో పాడిన మేల్ సింగర్ యూసుఫ్,ఈయన
నల్గొండ జూనియర్ కళాశాలలో ఎల్డీసీగా పనిచేసేవారు.కాగా, ఫిమేల్ సింగర్ వ్యాకరణం సునంద, ఈమె కాంచనపల్లి పెద వెంకటరామారావు కుమార్తె, అందరూ గొడ్డలి ప్రభాకర్ అని పిలుచుకునే వ్యాకరణం ప్రభాకర్ సతీమణి.ఆమె మంచి సింగర్.వ్యాకరణం ప్రభాకర్ నాకు గురుతుల్యులు, జర్నలిజంలో నాకు ఓనమాలు దిద్దించిన ముగ్గురిలో ఒకరు.మిగితా ఇద్దరు వేదాంత సూరి,కాసుల ప్రతాపరెడ్డి గార్లు.ఆ తరువాత రోజుల్లో రాజరత్నం పుణ్యభూమి అనే సినిమా తీయాలనే ఆలోచనతో నాలుగు పాటలను ముందుగానే రికార్డు చేసి ఉంచారు. అందులో బతుకు పాతర అనే పాటను కనకాచారి రాయగా మిగితా  మూడు పాటలను రాజరత్నం రాసారు.ఆ పాటలను యూసుఫ్, ప్రముఖ చిత్రకారులు సుదర్శన్ లు పాడారు.లిరిక్స్ ట్యూన్ చేయడం, మాటలు,పాటల రికార్డింగ్, రీరికార్డింగ్, కంపోజింగ్, ఎడిటింగ్, డబ్బింగ్, సింగర్స్ తో పాడించడం అన్నీ గురువు గారు కనకాచారి పర్యవేక్షణలో, రాజరత్నం గారింట్లో జరిగాయి.అయితే తపస్విని ఫిల్మ్ కి స్టోరి, పాటలు, సంగీతం,గాయనీ గాయకులు, నటీనటులు అన్నీ కుదిరాయి,ఇక షూటింగ్ కి కెమేరా కావాలి.అప్పట్లో వీడియో కెమెరాల స్థాయికి నల్గొండ ఎదగలేదు.నల్గొండలో రెండే రెండు ఫోటో స్టూడియోలు ఒకటి రామగిరిలో ప్రసాద్ ఫోటో స్టూడియో, రెండవది ప్రకాశం బజార్ కూరగాయల బేస్తవారం అంగడిలో రవి ఫోటో స్టూడియో.పెండ్లిళ్ళు,ఇతర శుభకార్యాలకు కేవలం ఫోటోలతోనే సరిపెట్టుకున్న కాలం.నల్గొండ జిల్లాలో మొదటి వీడియో గ్రాఫర్ కట్టంగూరుకు చెందిన బ్రహ్మచారి.ఆయననే ఈ ఫిల్మ్ కి కెమేరామెన్.
                   సరే అన్నీ బాగున్నాయి కానీ ఆర్టిస్టులకు,
మ్యుజీషియన్స్, కెమేరామెన్ లకు రెమ్యునరేషన్ ఇవ్వాలి కదా.హీరోయిన్ శిల్పది డెబ్యూ ఫిల్మ్ కాబట్టి తను రెమ్యునరేషన్ తీసుకోలేదని నేను ఫోన్ చేసినప్పుడు
చెప్పింది.కాస్ట్యూమ్స్ బాగుండాలి కదా అందుకే కొత్త చీరలు, డ్రెస్సెస్ ఇప్పించారని తెలిపారు.ఈ సినిమాలో
రాజరత్నం గారి అమ్మాయి సంహితా రాణి, అబ్బాయి
రాజు ఇద్దరూ నటించారు.ప్రస్తుతం ఇద్దరూ హైదరాబాద్లో
సెటిల్ అయ్యారు.వాళ్ళను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాను, కానీ వీలు పడలేదు.అప్పట్లో వాళ్ళ ఇల్లు నల్గొండ ఆర్పీ రోడ్డులో ఉండేది.మ్యుజీషియన్స్
కి ఒక్కొక్కరికి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు.సింగర్స్ కి నో రెమ్యునరేషన్, వాళ్ళు ఫ్రీగా
పాడారు.ఇక్కడ సంఘటన గురించి చెప్పాలి.సినిమా
తీయడానికి ప్రేరేపించిన ఆ భువనగిరి వ్యక్తులతో మొదట్లో కలిసి రాజరత్నం పనిచేసారు.రెండు 
నెలల్లో ఆ వ్యక్తులతో, ఆయనకు అభిప్రాయ భేదాలు వచ్చాయి.దాంతో విసిగిపోయిన రాజరత్నం సినిమా
ఆపేద్దామనీ,అనుకున్నారు.అప్పుడు కనకాచారి  రంగంలోకి దిగి అన్ని బరువు భాద్యతలను భుజం మీద వేసుకుని అన్ని క్రాఫ్ట్ లకు సంభందించిన వ్యక్తుల సహాయసహకారాలతో ఆ వీడియో ఫిల్మ్ ని పూర్తి చేసారు.ఆ తరువాత ఈ స్టోరీ తోనే సూపర్ స్టార్ కృష్ణను హీరోగా పెట్టి సినిమా తీయాలనీ రాజరత్నం  అనుకున్నారు.ఆ లోపలనే ఆయన కన్ను మూశారు. ఆయన ఇంకా కొంత కాలం బతికి ఉంటే కృష్ణతో సినిమా తీసేవారు, నేను మద్రాసు వెళ్ళిపోయేవాడిని 
ప్రమోద్ అంటూ గురువు గారు కనకాచారి నాతో మాట్లాడుతూ చెప్పారు.షూటింగ్ అయిపోయింది, వీడియో క్యాసెట్ వచ్చేసింది.అప్పట్లో 
నల్గొండలో ప్రివ్యూ థియేటర్ అయినా,ముక్కా ఫిల్మ్ లను
ప్రదర్శించాలన్నా, సభలు, సమావేశాలకు, నాటకాల
ప్రదర్శనలకు ఒకే ఒక్క వేదిక టౌనుహాల్.అది ప్రస్తుతం
శిధిలావస్థలో ఉంది.కార్యక్రమాలు నిర్వహించేందుకు 
అవకాశం లేకుండా పోయింది.కొత్త హాలుకు పునాది
వేసిన పాత ప్రభుత్వం ప్రస్తుతం లేదు.కొత్త ప్రభుత్వం
కొత్త శాసన సభ్యులు, మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకుని సాధ్యమయినంత తొందరలో
టౌన్ హాల్ నిర్మాణం చేయాలని కవులు, కళాకారులు, రచయితల విజ్ఞప్తి....
                కవులు కళాకారులను తీర్చిదిద్దిన ఆ కళా వేదిక టౌను హాలులో ఈ వీడియోను ప్రదర్శించారు.హాలు
ముందు ఆరుబయట అయిదు మానిటర్స్  అమర్చారు.
వాటిని అమర్చడానికి సిగ్నల్ బూస్టర్ అవసరమైంది.
నల్గొండ టౌనులో అప్పట్లో సిగ్నల్ బూస్టర్ సెయింట్ ఆంథోనీ నర్సింహారావు దగ్గరే ఉంది.డాక్టర్ చకిలం అనూషా శ్రీనివాస్ వాళ్ళ నాన్ననే ఈ నర్సింహారావు.
ఆయన కరోనా సమయంలో మరణించారు.ఆయన దగ్గర తెచ్చిన సిగ్నల్ బూస్టర్ ని ఆ మానిటర్స్ కి అటాచ్ చేసి
ఆ వీడియో క్యాసెట్ ను ప్రజల కోసం ప్రదర్శించారు.
చూసిన వాళ్ళ ప్రసంశలు విన్నాక గురువు గారు కనకాచారి, అన్ని రోజులు పడ్డ కష్టమంతా కన్నీటి రూపం దాల్చి ఆనంద భాష్పమై మెరిసింది....
               నిజంగా ఎంత అద్భుతమైన జ్ఞాపకం.నలభై ఏళ్ల క్రితం జరిగిన షూటింగ్ అనుభవాలను హీరోయిన్ శిల్ప, కనకాచారి, వ్యాకరణం సునంద...వాళ్ళ మాటల్లో చెపుతుంటే కంఠాల్లో ఆనందం తొణికిసలాడింది.మాటల్లో చెప్పలేని అనుభూతి, ఇష్టంగా చేసే పనిలో ఎన్ని సాదక బాధలు ఉన్నా వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగుతూ, కుప్పలుగా పేరుకుపోయిన అనుభవాలను తలచుకొని ఒకసారి హాయిగా నవ్వుకుంటూ, మరొకసారి అందరిమీదా కోప్పడుతూ, కొన్ని సార్లు విసుక్కుంటూ,శ్రమలో ఉన్న పరిమళాన్ని ఆస్వాదిస్తూ, అందరితో కలిసి భోజనం చేస్తూ,వాళ్ళ ఆలోచనలను, స్వీకరిస్తూ, అభిప్రాయాలను గౌరవిస్తూ,పని చేసినట్లు వారు చెప్పారు.ఫొటో కెమేరాలే లేని రోజుల్లో ఒక వీడియో కెమెరాతో ఒక ఫుల్ లెంగ్త్ స్టోరీ ఫిల్మ్ తీయడం అప్పట్లో సహాసం అనే చెప్పొచ్చు.
తక్కువ రిసోర్సెస్ తో ఒక మంచి అవుట్ పుట్ ఇవ్వగల
గొప్ప వ్యక్తులు మన నల్గొండలో ఉన్నారంటే నల్గొండ జిల్లా
ప్రజలందరికీ ఎంతో గర్వ కారణం.కానీ బాడ్ లక్ ఏమిటంటే ఆ వీడియో క్యాసెట్ ఎక్కడుందో తెలియడం లేదు.ఒకవేళ రాజారత్నం గారి కుటుంబ సభ్యులు
కాంటాక్ట్ లోకి వస్తే గాని అది సాధ్యం కాదు...
                            
కామెంట్‌లు