నాకు కాబోయే మొగుడు ఎట్లా వుండాలంటే - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఒకూర్లో ఒక రాజు వుండేటోడు. ఆయనకు లేక లేక ఒక ఆడబిడ్డ పుట్టింది. దాంతో ఆ పాపను కాలు కింద పెట్టనీయకుండా అపురూపంగా పెంచుకున్నాడు. ఆ పాపది అప్పుడే విచ్చిన అందమైన గులాబీలా ముచ్చటైన
మొగం. అటు అందంలోనూ, ఇటు చదువులోనూ ఆ పాపకు సాటి వచ్చేటోళ్ళు అటు పదహారు దేశాలలోనూ, ఇటు వదహారు దేశాలలోనూ ఎక్కడా ఎవరూ లేరు. దాంతో చుట్టు పక్కలున్న రాజుల పిల్లలంతా ఆ పాపను చేసుకోవాలని తెగ ముచ్చటపడి వాళ్ళ వాళ్ళ బొమ్మలు అందంగా గీపిచ్చి పంపిచ్చినారు. కానీ ఆ పాపకు ఒక్కరంటే ఒక్కరు గూడా నచ్చలేదు. ఒకనికి ముక్కొంకర అంటే, ఇంకొకనికి మూతొంకర అంటూ... ఒకనికి కాలొంకర అంటే, ఇంకొకనికి కన్నొంకర అంటూ... ఇట్లా అందరినీ తీసి పారేసింది.
అది చూసి వాళ్ళ నాయన "చూడు పాపా... మనిషన్నాక అన్నీ మంచిగుణాలే ఒక్కచోట కుప్ప పోసినట్లు వుండవు. నీవిట్లా సంబంధాలు వచ్చినవి వచ్చినట్లు ఎగ్గొట్టేస్తా వుంటే నీకు పెండ్లి సేయడం నా వల్ల కాదు" అని తెగేసి చెప్పినాడు.
దానికా పాప "ఎందుకు నాయనా... ఊరికే అట్లా బాధ పడతావు. నాకు ఈ లోకాన మనుషులెవరూ నచ్చడం లేదు. చేసుకుంటే అందరి రాతలు రాసే ఆ బ్రహ్మదేవున్నే చేసుకుంటా... లేకుంటే ఇట్లాగే పెండ్లి చేసుకోకుండా వుండిపోతా" అనింది. ఎంత చెప్పినా ఆ పాప పట్టినపట్టు వదలక పోయేసరికి వాళ్ళ నాయన ఏమీ చేయలేక 'సరే... నీ ఇష్టం' అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి, ఆ గడపా ఈ గడపా చేరి, ఆవూరు ఈ వూరు దాటి చుట్టు పక్కలున్న నూటా అరవయ్యారు వూర్లకూ తెలిసిపోయింది. దాంతో అందరూ "అందంగా వున్నానని ఈ పిల్లకు మరీ టెక్కు ఎక్కువయినట్లుంది. ఇది అయ్యేదా పొయ్యేదా... యాడి మానవులు... యాడి దేవతలు. ఇంగ ఈ పిల్లకు ఈ జన్మలో పెండ్లయినట్లే" అని నవ్వుకున్నారు. కానీ ఆ పాప పట్టినపట్టు ఒక్క మెట్టు గూడా దిగకుండా అట్లే కూచోనింది.
ఆ వూరికి పక్కనున్న ఒకూర్లో ఒక అడుక్కుతినేటోడు వున్నాడు. వానికి తినడానికి పైసా లేకపోయినా ఎచ్చులకు మాత్రం తక్కువ లేదు. ఆడా ఈడా అడుక్కున్న డబ్బులతో మాంచి రంగురంగుల బట్టలు వేసుకోని చుట్టు పక్కల వూర్లలో టిప్పుటాపుగా తిరిగేటోడు. వానికి అడవిలో ఒక రోజు ఒక చిన్న నెమలి పిల్ల దొరికింది. దాన్ని తెచ్చుకొని పెంచుతా మొదట దాని మీద ఒక పావు కేజీ బరువు పెట్టినాడు. అట్లా ఒక పది రోజులకు ఒక కేజీ, మళ్ళీ పదిరోజులకు ఐదు కేజీలు, ఇంకో పది రోజులకు పది కేజీలు... అట్లా నెమ్మదిగా పెంచుతా వచ్చినాడు. దాంతో అది బాగా పెద్దదయ్యేసరికి వాన్ని గూడా మీద కూచోబెట్టుకోని గాల్లోకి ఎగరడం నేర్చుకోనింది. వాడు అర్ధరాత్రి
అందరూ పండుకున్నాక ఎవరికీ కనబడకుండా ఆ నెమలి పైకి ఎక్కి గాల్లో సవారీ చేయడం మొదలు పెట్టినాడు.
ఇక్కడ రాకుమార్తె ఆ బ్రహ్మదేవున్ని తప్ప ఎవర్నీ చేసుకోనని పట్టుబట్టింది గదా... ఆ విషయం వీని వరకు వచ్చింది. దాంతో వానికి “ఎట్లాగయినా సరే ఆ పిల్లను బోల్తా కొట్టించి నేనే బ్రహ్మదేవున్నని చెప్పి పెండ్లి చేసుకుంటే... హాయిగా జీవితాంతం కాలు మీద కాలేసుకోని బతకొచ్చు గదా" అనిపించింది. 'మరి ఎట్లా ఆ పిల్లను నమ్మించడం' అని తెగ ఆలోచించ సాగినాడు. అంతలో ఒకసారి ఆ వూరి గుడికాడ
ఒకడు హరికథ చెబుతావుంటే వినడానికి పోయినాడు. ఆ కథలో ఆయన బ్రహ్మదేవుని వాహనం నెమలి. ఆయన దాని మీద తిరుగుతా వుంటాడు అని చెబుతా వుంటే వీడు విన్నాడు. అంతే వానికి ఒక ఆలోచన తళుక్కున మెరిసింది.
వెంటనే ఒక నాటకాల అంగడికి పోయి రకరకాల నకిలీ నగలు, హారాలు అద్దెకు తెచ్చుకున్నాడు. అర్ధరాత్రి అందరూ పండుకున్నాక అవన్నీ వేసుకోని, నెత్తిన కిరీటం పెట్టుకోని నెమలి మీద పక్కవూరికి బైలుదేరినాడు. రాకుమారి వుండేది అట్లాంటిట్లాంటి అల్లాటప్పా మేడ కాదు. ఏడు అంతస్తుల బంగారు మేడ. సక్కగా
దాన్లోకి పోయినాడు. రాకుమారి బంగారు మంచం మీద నిద్రపోతా వుంది. చుట్టూ రకరకాల తినుబండారాలు వున్నాయి. అక్కడ దిగి అన్నీ హాయిగా తిని, తాంబూలం వేసుకోని అద్దం పైన కాటుకతో “ఓ రాకుమారీ... అందరూ నిన్ను మెచ్చుకుంటావుంటే ఏమో అనుకున్నా గానీ.... నువ్వు నిజంగానే చానా ముచ్చటగా సాన పెట్టిన ముత్యం లెక్క వున్నావు" అని రాసి వెళ్ళిపోయినాడు.
పొద్దున్నే యువరాణి లేచి తల దువ్వుకుందామని అద్దం ముందుకు పోతే ఇంకేముంది కాటుకతో నల్లని అక్షరాలు తళతళలాడతా కనబన్నాయి. చుట్టూ చూస్తే రాత్రి వున్న తినుబండారాలన్నీ మాయమై పోయినాయి. ఏమైనా దొంగనా అని చూస్తే గదిలో ఎక్కడి నగలు అక్కడే వున్నాయి. దాంతో ఆమె 'కొంపదీసి ఆ బ్రహ్మదేవుడే నాకోసం రాలేదు కదా' అని ఆలోచనలో పడింది. అట్లా వరుసగా రెండు రోజులు గడిచిపోయాయి.
ఇంగ లాభం లేదు... ఈ రోజు ఎట్లాగయినా సరే వాన్ని పట్టుకోవాలని ఆమె చేతివేలు సర్రున కోసుకోని, దానికి నిమ్మకాయ పెట్టింది. అది సురసురసుర మండుతా వుంటే ఆమెకు కంటి మీద రెప్ప పడలేదు. వూరికే
మంచం మీద పండుకోని దొంగనిద్ర నటిస్తా ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూడసాగింది. ఎప్పటిలాగే వాడు రాత్రి పన్నెండు దాటగానే నెమలి మీద ధగధగలాడే నగలూ, కిరీటంతో లోపలికి దిగినాడు. అది చూసి ఆమె “అరెరే... నేను అనుకున్నది నిజమే. ఆ బ్రహ్మదేవుడే దేవలోకం నుంచి నా కోసం సక్కగా వచ్చినాడు" అని సంబరపడి దిగ్గున లేచి వాని చేయి గట్టిగా పట్టుకోనింది.
"ఎవరు నువ్వు నిజం చెప్పు. నన్ను పెండ్లి చేసుకోడానికి వచ్చిన ఆ బ్రహ్మదేవునివే గదా” అనింది గట్టిగా.
దానికి వాడు తలూపుతా  "నీవు అనుకున్నది నిజమే... నేను ఆ బ్రహ్మదేవున్నే... కానీ నీవేమో మానవకన్యవు, నేనేమో దేవున్ని. మనకెట్లా జత కుదురుతాది. ఎవరైనా వింటే నవ్విపోతారు. మీ అమ్మా నాన్నలు ఒప్పుకోరు" అన్నాడు.
దానికా పాప "పెండ్లి చేసుకునేది నేనా... వాళ్ళా.... నువ్వు వూ అను చాలు నే చూసుకుంటా" అంటూ పట్టినపట్టు వదల్లేదు. "సరే... అయితే నాదొక్క మాట. మీ అమ్మా నాయనలే స్వయంగా వచ్చి నా కూతురిని పెండ్లి చేసుకోమని నన్ను అడగాల. అప్పుడే చేసుకుంటా లేదంటే లేదు" అని చెప్పి నెమలినెక్కి వెళ్ళిపోయినాడు.
పొద్దున్నే ఆ రాకుమారి పోయి వాళ్ళ అమ్మా నాయనలకు జరిగిందంతా చెప్పింది. అది విని వాళ్ళు "చూడమ్మా.. వచ్చింది నిజంగా ఆ బ్రహ్మదేవుడేనా... లేక ఏ మంత్రగాడో ఆ వేషంలో తిరుగుతా వున్నాడా. ఈ లోకంలో దేన్నీ అంత తొందరగా నమ్మగూడదు. ఈ రోజు రాత్రి మేము గూడా వచ్చి నీ గదిలో ఎవరికీ కనబడకుండా దాచి పెట్టుకుంటాం. మాకు నమ్మకం కుదిరితేనే పెండ్లి చేసేది" అని చెప్పినారు. దాంతో ఆ పాప సరేనని రాత్రి చీకటి పడగానే వాళ్ళని పిలిచింది. వాళ్ళు ఎవరికీ కనబడకుండా మంచం కిందకి దూరి దాచిపెట్టుకున్నారు.
ఎప్పటిలాగానే వాడు ఆ రోజు రాత్రి గూడా పన్నెండు దాటగానే నెమలి మీద లోపలికి వచ్చినాడు. వాళ్ళు మంచం కింద నుంచే అదంతా చూడసాగినారు. రాకుమారి వాన్ని తీసుకోని పోయి మంచం మీద కూచోబెట్టింది. గదిలో మల్లెపూల వాసన గుప్పున కొడతా వుంది. రాకుమారి పెట్టుకున్నవేమో చామంతిపూలు. దాంతో వాడు గదంతా ఆ మూల నుంచి ఈ మూలకు, ఈ మూల నుంచి ఆ మూలకు అంగుళం అంగుళం గమనించినాడు గానీ యాడా ఒక్క మల్లెపువ్వు గూడా కనబడలేదు. దాంతో వానికి ఆ గదిలో ఎవరో దాచి పెట్టుకున్నారని అర్థమై పోయింది.
కాసేపు అవీ ఇవీ జాగ్రత్తగా మాట్లాడి "ఇప్పటికే నేను ఈడికి రాబట్టి వారం దాటిపోయింది. ఇంతవరకు మీ అమ్మగానీ, నాన్నగానీ ఎవరూ రాలేదు. ఆడ దేవలోకంలో పనులన్నీ ఆగిపోతా వున్నాయి. ఎంతో మంది రాతలు రాయాల. వాళ్ళను భూలోకంలో ఎవరెవరి కడుపుల్లోకి ఎవరెవరిని పంపాల్నా అని తెగ ఆలోచించాల.
ఈడేమో చూస్తాంటే మన పెండ్లి అయ్యేటట్లు లేదు. ఇంగ ఇట్లా వూరికే నీతో గప్పాలు కొట్టుకుంటా కూచోవడం నా వల్ల కాదు. వస్తా" అంటా పైకి లేచినాడు.
మంచం కింద నుంచి ఆ మాటలు వింటా వున్న రాకుమారి తల్లిదండ్రులు అదిరిపడి ''అల్లుడూ కాస్త ఆగు” అంటూ కింద నుంచే గట్టిగా వాని కాళ్ళు పట్టుకోని బైటకు వచ్చినారు. వచ్చి "ఏమనుకోవద్దు అల్లుడూ... నువ్వు ఎట్లాంటోనివో తెలీదు గదా. అందుకే పరీక్షిద్దామని వచ్చినాం" అన్నారు. ఆ మాటలకు వాడు నవ్వి “తప్పేముందిలే మామా... ఆడపిల్లను కన్నాక ఆ మాత్రం ముందు జాగ్రత్త లేకుంటే ఎట్లా. పెండ్లన్నాక అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలంటారు కదా పెద్దలు" అంటా నవ్వినాడు.
అప్పటికీ అనుమానం తీరని అత్త “ఏమీ అనుకోనంటే ఒకమాట అల్లుడూ... బ్రహ్మదేవుడంటే నాలుగు తలకాయలుంటాయి గదా... మరి నీకేంది ఒక్క తలకాయనే వుంది" అనడిగింది.
ఇలాంటి ప్రశ్నలన్నింటినీ ముందే వూహించి సిద్ధంగా వున్న వాడు పడీ పడీ నవ్వుతా “అత్తా... దేవలోకంలో ఒక్కన్ని కూచోని సృష్టి చేస్తా, జనాల తలరాతలు రాసేటప్పుడు మాత్రమే లోకంలో నాలుగు దిక్కులు చూస్తా వుండాల గాబట్టి నాలుగు తలకాయలుంటాయి. మిగతా సమయమంతా అందరిలాగే ఒక్క తలకాయనే" అన్నాడు.
ఆ మాటలకు అత్త చిరునవ్వు నవ్వి "అల్లుడూ... మా అమ్మాయి నిన్ను తప్ప ఎవరినీ చేసుకోనని పట్టుపట్టి కూచోనింది. నువ్వు వూ అంటే ఏడేడు పద్నాలుగు లోకాలు అదిరిపోయేటట్లు భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరీ యేసి, వీధి వీధీ ముత్యాల తోరణాలు కట్టి, గడప గడపకు చీర రవిక పంపి, అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చెప్పుకునేంత ఘనంగా, నూటా అరవయ్యారు వంటకాలతో పెండ్లి చేస్తాం. సరేనా" అనింది...
ఆ మాటలకు వాడు "అట్లాగే అత్తా... నీవెలాగంటే నేనలాగే.. కానీ ఒక్కమాట. నేను దేవలోకం నుంచి దిగొచ్చి భూలోకంలో పెండ్లి చేసుకుంటానంటే మా వాళ్ళు ఎవరూ ఒప్పుకోరు. అందుకని వచ్చే పున్నమికి నేనొక్కన్నే ఎవరికీ తెలీకుండా దిగొస్తా. అట్లాగే మా దేవతల ఆచారం ఏమిటంటే పెండ్లికూతురి పక్కన కత్తి పెట్టి పెండ్లి చేయాల్నే గానీ స్వయంగా నేను కూచోగూడదు. కాబట్టి నేను రాగానే నా కత్తి మీకిచ్చి గదిలోకెళతా. మీరు కత్తితో రాకుమారికి పద్ధతి ప్రకారం పెండ్లి చేసేయండి. పెండ్లి అయినాక దేవలోకంలో అందరికీ చెప్పి ఒప్పిస్తా" అని చెప్పి వెళ్ళిపోయినాడు. అట్లయితే పెండ్లికి ఎవరైనా తన వూరోళ్ళు వచ్చినా గుర్తు పట్టరని.
ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకి నిమిషాల్లో చుట్టు పక్కల వూర్లకంతా పాకిపోయింది. దాంతో జనాలంతా ఆ బ్రహ్మదేవున్ని చూద్దామని పున్నమికి యాడి పనులు ఆడనే వదిలేసి పరుగుపరుగున వచ్చినారు. వాడు కొత్త బట్టలు వేసుకోని నకిలీ నగలు పెట్టుకోని, చేతిలో ధగధగ మెరిసిపోతా వున్న కత్తి పట్టుకోని నెమలి మీద ఆకాశంలో బైలుదేరినాడు.
వాడు ఆకాశంలో వస్తా వుంటే చూసిన జనం అదిగో బ్రహ్మదేవుడంటే.... ఇదిగో బ్రహ్మదేవుడంటా జయజయధ్వానాలు చేస్తా అరుపులు, కేకలు, ఈలలతో సందడి సందడి చేయసాగినారు. ఆకాశంలో కత్తి పట్టుకోని వస్తావున్న వానికి ఇదంతా చూసి చెప్పలేని సంబరమేసింది. దాంతో తన ప్రతాపం అందరికీ తెలియాలని నెమలి మీద లేచి నిలబడి కత్తి గిరగిరగిర తిప్ప సాగినాడు. అది చూసిన జనాలంతా మరింత గట్టిగా సంబరంగా జయహో, జయహో బ్రహ్మదేవా అంటూ కేకలు వేయసాగినారు. దాంతో వాడు మరింత రెచ్చిపోయి మరింత వేగంగా కత్తి కిందికీ మీదికీ సరసరసర తిప్పసాగినాడు. అట్లా తిప్పుతా వుంటే అనుకోకుండా అదొచ్చి సర్రున నెమలి మెడకు తగిలింది. అంతే దెబ్బకు దాని తల తెగి అంత ఎత్తు నుంచి వానితో పాటు దభీమని జనాలందరి  నడుమ పడింది.
అది చూసి అందరూ “అయ్యయ్యో... బ్రహ్మదేవునికి ఏమయిందో ఏమో" అనుకుంటా వురుక్కుంటా వచ్చినారు. వాడట్లా పడడం పడడం కిరీటం, నగలు అన్నీ చెల్లాచెదురయి పోయినాయి. వురుక్కుంటా వచ్చిన జనాల్లో వాని వూరి వాళ్ళు గూడా వున్నారు. వాళ్ళు వాన్ని చూసి గుర్తుపట్టి “ఓరినీ.. వీడు బ్రహ్మదేవుడేంది. మనూరి అడుక్కుతినేటోడు గానీ... జనాలందరినే గాక రాజూ రాణీలను గూడా భలే బురిడీ కొట్టిచ్చినాడే" అంటా వాన్ని పట్టుకోని మెత్తగా తన్నినారు. ఆ విషయం తెలుసుకోని రాజకుమారి సిగ్గుపడింది. కోరరాని కోరిక కోరుకుంటే ఇట్లాగే అయితాదని బుద్ధి తెచ్చుకోని మట్టసంగా వాళ్ళమ్మా నాన్నలు తెచ్చిన సంబంధం చేసుకోని హాయిగా కలకాలం బతికింది.
***********
కామెంట్‌లు