చిటికెల పందిరి - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

   ఒకూర్లో ఒక పరమ పిసినారి వుండేటోడు. వాడు ఎంగిలి చేత్తో కాకిని గూడా తరమని రకం. ప్రతి పైసాను పదిసార్లు ముందుకూ వెనక్కూ ఆలోచించి ఖర్చు పెడతాడు. ఎదుటివాడు చస్తా వున్నా ఒక్కపైసా కూడా దానం చేసేటోడు కాదు.
ఆ పిసినారి ఒకసారి జొన్నచేను వేసినాడు. ఊరంతా మొక్కలు మోకాలంత ఎత్తు పెరిగినాయి. అది చూసి జనాలంతా ఈసారి పంటలు విరగబడి కాస్తాయని సంబరపడినారు. కానీ ఆ తరువాత ఒక్క వాన గూడా పల్లేదు. రైతులు విలవిలలాడిపోయినారు. కనబన్న దేవునికల్లా మొక్కులు మొక్కుతా వున్నారు. ఆ ఊరిబైట ఒక ఆంజనేయ సామి గుడుంది. ఆ సామికి చానా మహత్తులున్నాయని జనాలంతా అనుకుంటా వుంటారు. పిసినారి ఆ గుడికి పోయి అందరూ చూస్తా వుండగానే “సామీ... సామీ... నా చేను గనుక పండితే ఇంతవరకూ ఈ భూమ్మీద ఎవరూ వేయని విధంగా నీకు చిటికెల పందిరి వేయిస్తా... ఎట్లాగైనా సరే నా పంటను కాపాడు సామీ" అని మొక్కుకున్నాడు.
అంజనేయసామి ఆలోచనలో పడినాడు. తమలపాకుల పందిరి తెలుసు, అరిటాకుల పందిరి తెలుసు, మామిడాకుల పందిరి తెలుసు, మల్లెపూల పందిరి తెలుసు... కానీ ఈ చిటికెల పందిరంటే ఏమి... ఎప్పుడూ వినలేదు. కనలేదు. ఇదేందో చూసి తీరాల్సిందే అనుకోని వెంటనే నింగీనేలా ఏకమయ్యేటట్లు, భూమమ్మ తడిని ముద్దయ్యేటట్లు, వాగులు వంకలు వురుకులాడేటట్లు, ఇండ్లపై దోనెలు ఎక్కి కారేటట్లు... బ్రమ్మాండమైన వాన కురిపించినాడు. ఆ దెబ్బకు భూమి బాగా పదునెక్కింది. పడుకున్న మొక్కలు కాస్తా పైకి లేసి నిటారుగా నిలబన్నాయి. దాంతో అందరూ ఆ పిసినారి దగ్గరకు పోయి “నీవు మొక్కుకున్నట్లే వానలు కురిసినాయి. మొక్కలు బతికినాయి. సామికి వెంటనే మొక్కు తీర్చు, లేకుంటే కోపమొస్తాది" అన్నారు.
ఆ మాటలకు పిసినారి "ఆ... ఏం... నా ఒక్క చేను మీదే కురిపించినాడా వాన. అందరి చేల మీదా ఎంత పడిందో నా చేను మీదా అంతే పడింది. అట్లాంటప్పుడు నేను మొక్కినందుకే వాన కురిసిందని ఎట్లా నమ్మడం. మీరు గూడా రకరకాల మొక్కులు మొక్కినారు గదా... దాండ్లకి కురిసి వుండొచ్చు గదా... ఇదిగో... వూళ్ళో ఎవరికీ పండనంత పంట నాకు పండితే ఇప్పుడు నమ్ముతా ఆంజనేయసామి మహత్తు. ఆరోజు పోయి మొక్కుకున్నట్లే చిటికెల పందిరి వేస్తా" అన్నాడు.
ఆంజనేయసామికి ఆ పిసినారి చెప్పింది గూడా నిజమే గదా అనిపించింది. దాంతో చిటికెల పందిరి ఎట్లా వుంటాదో అనే ఆశతో ఆ ఊర్లోనే గాదు ఏడేడు పద్నాలుగు లోకాల్లో యాడా పండనంత పంటను ఆ చేలో పండించినాడు. అందరూ విరగ కాసిన ఆ చేనుని చూసి “ఆహా... ఏమి ఆంజనేయసామి మహిమ" అంటా ఆచ్చర్యపోయినారు. పిసినారికి పంట అమ్మితే అందరి కన్నా పదింతలు లాభం వచ్చింది.
దాంతో ఊరోళ్ళందరూ ఆయన దగ్గరికి పోయి “ఏమయ్యా నీవు మొక్కుకున్నట్లే ఆంజనేయసామి నీ చేలో బంగారంలాంటి పంట పండించినాడు. కాబట్టి మొక్కు తీర్చు, మాకు గూడా ఆ చిటికెల పందిరి ఎట్లా వుంటాదో చూడాలని ఒకటే ఇదిగా వుంది" అన్నారు.
"సరే..... ఐతే ఈ అమాసకు మొక్కు చెల్లిస్తాలే" అన్నాడు పిసినారి.
అమాస రానే వచ్చింది. ఊరు ఊరంతా ఈ చిటికెల పందిరి ఎట్లా వుంటాదో చూద్దామని యాడి పనులు ఆడే వదిలేసి ఉరుకులు పరుగుల మీద గుడికాడికి వచ్చినారు. ఆంజనేయసామి గూడా ఆ పిసినారి ఎప్పుడు వస్తాడా... పందిరి ఎట్లా వేస్తాడా అని ఎదురుచూడసాగినాడు. పిసినారి పొద్దున్నే లేచి బాగా తలస్నానం చేసి, నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోని, ఉతికిన బట్టలు వేసుకోని, ఉత్త చేతులూపుకుంటా గుడికి బైలుదేరినాడు. జనాలంతా అది చూసి "అదేందిరా వీడు ఏమీ లేకుండా ఊపుకుంటా వస్తా వున్నాడు. ఎట్లా వేస్తాడు పందిరి" అని గొణుక్కోసాగినారు.
ఆ పిసినారి సక్కగా పోయి ఆంజనేయసామీ బొమ్మ ముందు నిలబడి "సామీ.... నేను కోరుకున్నట్లే ఎవరికీ పండనంత పంట పండించినావు. అందుకే నేను మొక్కుకున్నట్టే చిటికెల పందిరి వేస్తా వున్నా చూడు" అన్నాడు. ఆంజనేయసామితో బాటు జనాలంతా వూపిరి బిగపట్టి చూడసాగినారు. వాడేం చేస్తాడా అని.
పిసినారి ఒక మూల నిలబడి "సామీ... ఇదిగో ఇది దక్షిణం వైపు పందిరి గుంజ అంటూ కింది నుంచి పైవరకూ వరుసగా చిటికెలు వేస్తా చేయి పైకి లేపినాడు. ఇదిగో ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం అంటూ నాలుగువైపులా కింది నుంచి పైవరకూ చిటికెలు వేసినాడు. వేసి, సామీ... చిటికెలతో నాలుగువైపులా నాలుగు పందిరి గుంజలు వేసినాను. ఇక వాటిని ఒకదాన్ని మరొకదానితో కలుపుతా పందిరేస్తా వున్నా చూడు అంటూ ఒక గుంజ నుండి మరొక గుంజకు, మరొక గుంజ నుండి ఇంకొక గుంజకు పైన చిటికెలు వేస్తా కలుపుకుంటా పోయినాడు. అట్లా అన్నివైపులా చిటికెలు వేసి ఇదిగో సామీ... బాగా చూడు... ఇదే చిటికెల పందిరి. ఇంతవరకూ ఈ భూమ్మీద ఎవ్వరూ వేయని పందిరి వేసి, నా మొక్కు చెల్లించా... వస్తా...." అంటూ దండం పెట్టుకోని వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాడు. అది చూసి జనాలంతా నోళ్ళు వెల్లబెట్టినారు.
ఆ దెబ్బకు ఆంజనేయసామి మొగం మాడిపోయింది. “అరెరే... చిటికెల పందిరంటే ఎట్లా వుంటాదో ఏమో అనుకుంటేగానీ ఇదా.... ఐనా వీడు పెద్ద పిసినారని తెలిసి వాని మాటలు నమ్మినందుకు బాగానే శాస్త్రి జరిగింది. దేవునికే పంగనామాలు పెట్టడమంటే ఇదే కాబోలు" అనుకుంటా మట్టసంగా వుండిపోయినాడు.
***********
కామెంట్‌లు