నువ్వు చెప్పిందే నే చేస్తా ;-డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒక పిల్లోడుండేటోడు. వాడు చానా అమాయకుడు. చెప్పింది చెప్పినట్లు చేయడమే తప్ప కొంచంగూడా సొంతంగా ఆలోచించేటోడు కాదు. ఒకరోజు వాళ్ళమ్మ వానికి డబ్బులిచ్చి "రేయ్... సంతకు పోయి బఠానీలు తేపోరా" అని పంపించింది. వాడు చేతుల నిండా బఠానీలు పోపిచ్చుకోని వస్తా వుంటే దారిలోనే సగానికి సగం పడిపోయినాయి. అది చూసి వాళ్ళ నాయన "ఒరే... ఏవయినా ఇస్తే అట్లా చేతిలో పట్టుకోని రాగూడదురా, జేబులో పోసుకోని రావాల" అని చెప్పినాడు. 
ఒకరోజు వాళ్ళమ్మ వాన్ని పిల్చి “రేయ్... అంగడికి పోయి పాలు తేపోరా" అని పంపిచ్చింది. ఏవయినా ఇస్తే జేబులో వేసుకొని రావాల అని వాళ్ళ నాయన చెప్పినాడు గదా. దాంతో వాడు అంగడి వాడు ఎంత చెప్పినా వినకుండా పాలన్నీ జేబులో పోపిచ్చుకోని వచ్చినాడు. దాంతో దార్లోనే అన్నీ కారిపోయినాయి. అది చూసి వాళ్ళ నాయన “ఒరే... ఏవయినా ఇస్తే అట్లా జేబులో పోసుకోని రాగూడదురా, గిన్నెలో వేసుకోని పడిపోకుండా మూతబెట్టుకోని రావాల" అని చెప్పినాడు.
ఒకరోజు వాళ్ళమ్మ వాన్ని పిలిచి "రేయ్... సంతకు పోయి కోడిని కొనుక్కోని రాపోరా" అని పంపిచ్చింది. ఏవయినా తెచ్చేటప్పుడు గిన్నెలో వేసుకోని రావాల అని వాళ్ళ నాయన చెప్పినాడు గదా. దాంతో వాడు కోడిని గిన్నెలో వేసుకోని పైన మూత పెట్టుకోని వచ్చినాడు. దాంతో ఇంకేముంది పాపం అది ఊపిరాడక లోపల్నే చచ్చిపోయింది. అది చూసి వాళ్ళ నాయన “ఒరే... ఏవయినా తెచ్చేటప్పుడు అట్లా గిన్నెలో వేసి మూత పెట్టుకోని రాగూడదురా, మెడకు తాడు కట్టి గుంజుకోని రావాల" అని చెప్పినాడు.
ఒకరోజు వాళ్ళమ్మ వాన్ని పిలిచి "రేయ్... పక్క సందులో వుండే మీ అవ్వని పిలుచుకోని రాపో. కొంచెం పనుంది" అని పంపిచ్చింది. ఏవయినా తెచ్చేటప్పుడు మెడకు తాడు కట్టుకోని గుంజుకోని రావాలని వాళ్ళ నాయన చెప్పినాడు గదా. దాంతో వాడు ఒక తాడు తీసుకోని వాళ్ళవ్వ 'నేనొస్తాలేరా' అని మొత్తుకుంటావున్నా వినకుండా, మెడకు తాడు కట్టి బరబరబర ఈడ్చుకోని వచ్చినాడు. అది చూసి వాళ్ళ నాయన “ఒరే.. ఎవరయినా మనుషులు కనబడితే అట్లా ఈడ్చుకోని రాగూడదురా... రండి రండి దయచేయండి అంటూ వాళ్ళని లోపలికి పిలిచి మర్యాదలు చేయాల" అని చెప్పినాడు.
ఒకరోజు వాళ్ళమ్మా నాయనా పనుండి బైటకు పోతా “ఒరే మేమొచ్చేసరికి బాగా చీకటి పడతాది. నువ్వు ఇంట్లోనే హాయిగా ఆడుకుంటా ఆకలైతే అన్నం తిని పండుకో. మేము బైట తాళమేసుకొని పోతాము" అని చెప్పి వాళ్ళు తాళమేసుకొని పోయినారు. వాళ్ళట్లా పోయిన కాసేపటికే కొందరు దొంగలు ధనాధనా తాళం పగులగొట్టి లోపలికి వచ్చినారు. వాళ్ళ నాయన ఎవరయినా మనుషులు కనబడితే "రండి... రండి... దయచేయండి అంటూ పిలిచి మర్యాదలు చేయమన్నాడుగదా" దాంతో వాడు ఆ దొంగలను చూస్తానే “రండి... రండి..." అంటూ లోపలికి పిలిచి, కూర్చోవడానికి కుర్చీలు వేసినాడు. వీడెవడో తిక్కలోనిలెక్క వున్నాడే అనుకుంటా దొంగలు వానికి ఆమాట ఈమాటా చెబుతా ఇంట్లో వున్న విలువయిన వస్తువులన్నీ మూటగట్టి
మొత్తం ఎత్తుకపోయినారు. అది తెలిసి వాళ్ళ నాయన నెత్తీనోరు కొట్టుకుంటా “ఒరే... ఎవరయినా ఇట్లా తాళం పగులగొడతా వుంటే లోపలికి రమ్మనగూడదురా... తలుపు వెనకాల దాచిపెట్టుకోని రోకలి బండతో వాళ్ళ నెత్తులు పగులగొట్టాల" అని చెప్పినాడు.
ఇంకొకరోజు వాళ్లమ్మా నాయన పనిబడి పక్కూరికి పోతా వాన్ని ఇంట్లోనే వుండమని చెప్పి బైట తాళమేసుకొని పోయినారు. పనయిపోయి తిరిగి వచ్చేసరికి బాగా చీకటి పడింది. తాళం తీద్దామని చూస్తే తాళం చెవి కనబడలేదు. ఎంత వెదికినా దొరకలేదు. దాంతో లాభం లేదనుకోని పెద్దరాయి తీసుకోనొచ్చి వాళ్ళ నాయన ధనాధనామని తాళం పగులగొట్టసాగినాడు. ఆ చప్పుడుకి వాడు అదిరిపడి లేచినాడు. వాళ్ళ నాయన ఎవరయినా తాళం పగులగొడతా వుంటే వూరికే వుండగూడదు. తలుపు చాటున దాచి పెట్టుకోని రోకలిబండతో వచ్చినోన్ని వచ్చినట్టు తల పగిలేలా కొట్టాల అని చెప్పినాడు గదా. దాంతో బిరబిరా వంటింట్లోకి పోయి పెద్ద రోకలిబండ తీసుకోని తలుపు చాటున నిలబడినాడు. ఆ సంగతి తెలీని వాళ్ళ నాయన తాళం పగలగొట్టి లోపలికి వచ్చినాడు.
అంతే... వాడు ధనధనధనమని తలుపుచాటు నుండి రోకలి బండతో నాలుగు పెరికినాడు. ఆ దెబ్బకు వాళ్ళ నాయన “అబ్బా... అమ్మా' అంటూ కుప్పకూలిపోయినాడు.
***********
కామెంట్‌లు