ఉపాయం వుంటే విజయం మనదే ;- డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212.

  ఒక అడవిలో ఒక భయంకరమైన రాక్షసి వుండేది. అది అడవిలోనికి అడుగుపెట్టిన వాళ్ళందరినీ కరకరకర నమిలి మింగేసేది. దాని దెబ్బకు భయపడి ఎవరూ అటువైపు వెళ్ళేటోళ్ళు కాదు. దాంతో అది చుట్టుపక్కల వూళ్ళ మీద పడి జనాలని చంపి తినడం మొదలుపెట్టింది. అది చూసి రాజు ''ఎవరైనా ఆ రాక్షసిని చంపినా, పట్టి బంధించినా వాళ్ళకు నిలువెత్తు బంగారమిచ్చి సంబరపెడతానని'' దండోరా వేయించినాడు.
ఒక ఊరిలో నలుగురు అన్నదమ్ములు వుండేటోళ్ళు. వాళ్ళు చానా పేదోళ్ళు. తినడానికి తిండి గూడా లేక చానా బాధ పడుతుండేవాళ్ళు. వాళ్ళకు ఈ దండోరా వినగానే ఆశ పుట్టింది. 'ఎన్ని రోజులు బాధలతో ఇలా బతకడం. పోయి ఆ రాక్షసి పని పడదాం. ఓడిపోతే మనం పోతాం... గెలవగలిగితే ఈ పేదరికం పోతుంది' అనుకున్నారు. వాళ్ళలో నాలుగవవాడు చానా చిన్నోడు. దాంతో ''రేయ్‌ నువ్వు ఇక్కన్నే ఇంటికాన్నే వుండు. మాకు ఏమన్నా అయితే కనీసం నువ్వు ఒక్కనివన్నా మిగులుతావు'' అన్నారు.
కానీ ఆ చిన్నోడు దానికి ఒప్పుకోలేదు. ''అన్నా.... చావయినా, బతుకయినా మీతోనే. కలిసి పెరిగినాం. కలిసే ఏ పనైనా చేద్దాం'' అంటా వాళ్ళతో వచ్చినాడు.
అడవిలో ఆ నలుగురూ రాక్షసిని వెదుక్కుంటా బైలుదేరినారు. అలా పోతావుంటే ఒకచోట ఆ రాక్షసి ఎదురొచ్చింది. దాని ఆకారం చూడగానే వాళ్ళు భయంతో వణికిపోయినారు. వెంటనే ఏమయితే అదయిందని కత్తులు తీసుకోని ఎగిరి దాని మీదకు దుంకినారు. కానీ ఆ రాక్షసికి ఆ కత్తులు పూచిక పుల్లల్లెక్క కనిపించినాయి. అన్నీ విరిచి పాడేసి నలుగురినీ పట్టుకోని ఇంటికి తీసుకోని పోయింది.
ఆ ఇంటిలో ఒక పెద్ద కారాగారం వుంది. నలుగురినీ అందులో పాడేసి తాళం వేసేసింది. ''ఆహా! మంచి విందు భోజనం తినక చానా రోజులైంది. మనుషులు దొరకడం లేదు. ఈ నాలుగు రోజులు హాయిగా ఒకొక్కన్నే కూర చేసుకోని తింటా'' అని సంబరంగా కులుక్కుంటా పోయింది.
నలుగురికీ ఏం చేయాలో తోచలేదు. కారాగారం గోడలు, దానికున్న తలుపులు ఆ రాక్షసి గూడా బద్దలు చేయలేనంత గట్టిగా వున్నాయి. అనవసరంగా ఆశపడి వచ్చి ఇరుక్కున్నామే... ఇంక చావడం తప్ప మరోదారి లేదు'' అని బాధపడతా వుంటే, చిన్నోడు ''అన్నలారా... ఎందుకలా బాధపడతారు. ఇంకా మనకు చానా సమయం వుంది. బుర్రకు పదును పెడితే ఏదో ఒక దారి దొరక్కపోదు. అప్పుడే నిరాశతో బాధపడొద్దు'' అంటా చుట్టూ చూడసాగినాడు.
కారాగారం లోపలికి గాలి వెలుతురు రావడానికి వీలుగా బాగా పైన అందనంత ఎత్తులో ఒక చిన్న కిటికీ వుంది. అది చూసిన చిన్నోడికి ఒక ఉపాయం తళుక్కుమనింది. వెంటనే అన్నలకు చెప్పినాడు. వాళ్ళు సరేనని ఒకరి మీద ఒకరు వరుసగా ఎక్కి నిలబన్నారు. చిన్నోడు వాళ్ళ మీద నుంచి ఎక్కి కిటికీని అందుకున్నాడు. దానికేమీ కడ్డీలు లేవు. అందులోంచి దూరి బైట వున్న చెట్టుకొమ్మను పట్టుకోని కిందికి దిగినాడు. నెమ్మదిగా చప్పుడు చేయకుండా దాక్కుంటా దాక్కుంటా లోపలికి వచ్చినాడు. 
లోపల ఆ రాక్షసి ముందురోజు తెచ్చుకున్న మాంసం తింటా వుంది. దాని వెనుక తాళం చెవుల గుత్తి కనబడింది. చప్పుడు గాకుండా దాన్ని తీసుకోని పోయి అన్నలను విడిపించినాడు. లోపల పెద్దపెద్ద మొద్దులు నాలుగు వరుసగా పెట్టి వాటిపై దుప్పటి కప్పి మళ్ళా తాళం వేసి ఆ తాళాలు రాక్షసి వెనుకే పెట్టి వచ్చినాడు. నలుగురూ, దానికి కనబడకుండా ఒక మూల దాక్కోని తగిన సమయం కోసం వేచి చూడసాగినారు.
కాసేపటికి ఆ రాక్షసి తాళం తీసుకోని కారాగారం వద్దకు వచ్చింది. లోపల వరుసగా పండుకోని కనిపించినారు. దానికి తెలీదు గదా అక్కడ వున్నది మొద్దులని. దాంతో వాళ్ళలో ఒకరిని పట్టుకోని వద్దామని తాళం తీసి లోపలికి పోయింది. అంతే... ఆ నలుగురు ఒక్క క్షణం గూడా ఆగకుండా వేగంగా వచ్చి బైట నుంచి తలుపులు మూసి తాళం వేసేసినారు. జరిగిన మోసం తెలుసుకోని ఆ రాక్షసి పెడబొబ్బలు పెడతా ఆ తలుపులను దబాదబా బాదసాగింది. కానీ అవి అలాంటిలాంటి అల్లాటప్పా తలుపులు కావుగదా... ఎంత పీకినా కొంచం గూడా చెక్కు చెదరలేదు. దాంతో అది ఏమీ చేయలేక లోపలనే ఇరుక్కోని పోయింది.
వెంటనే ఆ నలుగురు వురుక్కుంటా రాజు దగ్గరికి పోయి జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించినారు. రాజు సైనికులతో వచ్చి దాన్ని గొలుసులతో బంధించి తీసుకపోయి కారాగారంలో వేసినాడు. రాజు ఆ నలుగురినీ బాగా మెచ్చుకోని వారికి కావలసినంత బంగారం ఇచ్చి వూరంతా వూరేగించినాడు. అన్నలు ముగ్గురూ తమ్మున్ని భుజాల మీదకు ఎత్తుకోని ''ఒరే... నువ్వు చిన్నోనివైనా నీ తెలివితేటల వల్లనే ఈ రోజు మేమంతా బతికి బైటపడినాం. అంతేగాదు ఈ రోజుతో మన పేదరికం గూడా పోయి ధనవంతులుగా మారిపోయినాం. ఇదంతా నీ చలువనేరా'' అని మెచ్చుకున్నారు.
 ***********

కామెంట్‌లు