పులికి గురువు పిల్లే గురూ ;- డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

   ఒక అడవిలో ఒక పులి వుండేది. అది చానా బలంగా వుండేది. పెద్ద పెద్ద గోర్లు, పదునైన పళ్ళు వుండేవి. అది గాండ్రిస్తే చాలు జంతువులన్నీ భయంతో వణికిపోయేవి. కానీ ఆ పులికి వేగంగా పరిగెత్తడం రాదు. నేర్పుగా వేటాడడం రాదు. కొండలు గుట్టలు ఛటుక్కున ఎక్కడం రాదు. చలాగ్గా తిరగడం రాదు. బరువైన ఒంటితో నెమ్మదిగా కదిలేది. జంతువులు అది కనబడితే చాలు అందకుండా పారిపోయేవి. దాన్ని వెక్కిరించేవి. దాంతో దానికి సరియైన ఆహారం దొరికేది కాదు. చానాసార్లు ఆకలితో నకనకలాడిపోయేది. దాంతో పులికి తాను కూడా మెరుపువేగంతో కదలడం, వేటాడడం నేర్చుకోవాల అనుకోనింది.
అప్పట్లో పిల్లులు ఊర్లల్లో వుండేవి కాదు. అడవుల్లోనే వుండేవి. ఇవి చిన్నగా అచ్చం పులుల లెక్కనే వుండేవి. మెరుపువేగంతో కదులుతా, కళ్ళు మూసి తెరిచేలోగా ఆహారాన్ని వేటాడేవి. చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు ఏవైనాసరే క్షణాల్లో ఎక్కేసేవి. దాంతో పులి ఒక పిల్లి దగ్గరికి చేరి "పిల్లి మామా... పిల్లి మామా... నాకు గూడా నీలా వేగంగా వేటాడే విద్యలు నేర్పవా" అని అడిగింది.
దానికి పిల్లి భయపడతా "అమ్మో... నీకు నేర్పాల్నా... నేర్పిన తర్వాత నువ్వు నన్ను గూడా తినేస్తే" అనింది.
“ఛ... ఛ... గురువును ఎవరైనా మోసం చేస్తారా... పువ్వుల్లో పెట్టి పూజించుకుంటారు గానీ... నన్ను నమ్ము" అంటూ బతిమలాడతా ఏవేవో ఒట్లు పెట్టుకోనింది.
పులి మాటలకు కరిగిపోయిన పిల్లి “సరే నేర్పుతాలే" అనింది.
ఆరోజు నుంచీ రోజూ పొద్దున్నే పులి వచ్చి పిల్లి దగ్గర వినయంగా నిలబడేది. అది కూచోమంటే కూచునేది. లెయ్యమంటే లేచేది. ఎగరమంటే ఎగిరేది. దుంకమంటే దుంకేది. ఏది చెబితే అది... ఎలా చేయమంటే అలా చెప్పిన పని చెప్పినట్లు చేసేది. దాంతో పిల్లి తనకొచ్చిన విద్యలన్నీ నేర్పసాగింది...
అట్లా కొద్ది రోజులు గడిచేసరికి పులికి అన్ని విద్యలూ వచ్చేసినాయి. చప్పుడు గాకుండా నదవడం, వెనుక నుంచి ఎగిరి మీదకు దుంకడం, మెరుపు వేగంతో జంతువులను వేటాడడం, కొండలు గుట్టలు ఎక్కేయడం నేర్చేసుకోనింది. ఆఖరికి పిల్లి కన్నా వేగంగా పరిగెత్తడం కూడా నేర్చేసుకోనింది.
పులికి అన్ని విద్యలూ వచ్చేయగానే ఒకరోజు పిల్లి “అల్లుడూ... నీకు ఇంక నేను నేర్పాల్సినవి ఏవీ లేవు. ఈ భూమ్మీద నీకన్నా వేగంగా, చురుగ్గా కదిలే జంతువు ఏదీ లేకుండా రోజు సాధన చేయి. ఇక వెళ్ళిరా " అనింది.
పులి చిరునవ్వుతో పిల్లి వంక చూసింది. పిల్లి నిండుగా, నున్నగా, బలంగా కొవ్వుపట్టి కనిపించింది.
దానికి నోరూరింది. ఇంతవరకూ అడవిలో వుండే అన్ని జంతువుల రుచి చూసినాను గానీ, పిల్లి మాంసం మాత్రం ఎప్పుడూ రుచి చూడలేదు. ఇక దీనితో పనిలేదు కాబట్టి ఈ రోజుతో ఈ కోరిక గూడా తీర్చేసుకోవాల" అనుకోనింది. అంతే... ఒక్కసారిగా ఎగిరి పిల్లి మీదకు దుంకింది.
మొదటి నుంచీ పులి మీద అనుమానంతోనే వున్న పిల్లి దాని చూపుల్ని పసిగట్టింది. అంతే... ఛటుక్కున ఎగిరి పక్కకు దుంకింది. పులి దగ్గరకు వచ్చేసరికి మెరుపులా అక్కడే వున్న ఒక చెట్టుపైకి సరసరసర ఎక్కేసింది. పులిగూడా వేగంగా చెట్టు దగ్గరికి వచ్చేసింది గానీ పైకి ఎక్కలేక కిందనే నిలబడిపోయింది. ఆ
పిల్లి నవ్వుతా "నీగురించి నాకు ముందు నుంచీ అనుమానంగానే వుంది. నువ్వు నాకన్నా బలవంతురాలివి. అందుకే అన్నీ నేర్పానుగానీ చెట్లు ఎక్కడం మాత్రం నేర్పలేదు. గురువులకే పంగనామాలు పెట్టే నీలాంటి శిష్యుల పట్ల ఆ మాత్రం జాగ్రత్త లేకుంటే ఎట్లా" అనింది.
పులి కోపంతో చెట్టును వాడి గోళ్ళతో రపారపా కొట్టింది. గాండ్రు గాండ్రుమని గాండ్రించింది. "సరే ఎంతకాలం అట్లా పైపైన తప్పించుకోని తిరుగుతావో నేనూ చూస్తా... ఏదో ఒక రోజు కిందకు దిగకపోతావా... నా పంజాకు చిక్కకపోతావా" అంటూ వెనుదిరిగింది.
దాంతో పిల్లికి చెట్టు దిగాలంటేనే భయమేసింది. ఏమూల నుంచి ఎప్పుడు పులి వచ్చి మీద పడతాదో తెలీదు. దాంతో ఇక ఆ అడవిలో వుంటే ప్రమాదమే అనుకోనింది. రాత్రికి రాత్రే చెట్టు మీద నుండి చెట్టు మీదకు దుంకుతా పక్కనే వున్న గ్రామానికి చేరుకోనింది. ఇక నుంచీ ఈ మనుషులతోనే నా బతుకు అనుకోనింది. అంతే... అలా ఆరోజు నుంచీ పులులు అడవుల్లో, పిల్లులు ఊర్లలో స్థిరపడిపోయినాయి.
***********
కామెంట్‌లు