మంత్రి  సేవకుడు -డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక రాజు దగ్గర ఒకడు పని చేస్తా వుండేటోడు. వాడు ఎప్పుడూ రాజు వెంటనే ఉంటూ రాజు ఏ పని చెబితే ఆ పని చేస్తా వుండేటోడు. రాజు వానికి మూడుపూటలా తిండి పెట్టి నెలకు వేయి వరహాలు జీతంగా ఇచ్చేటోడు.
రాజు దగ్గర ఒక మంత్రి వుండేటోడు. రాజుకు పరిపాలనకు కావలసిన సమాచారం అందిస్తా, సలహాలు ఇస్తా వుండేటోడు. వానికి రాజు ఒక పెద్ద రెండంతస్తుల ఇంటినీ, పదిమంది సేవకులనూ ఇచ్చి నెలకు పదివేల వరహాలు జీతంగా ఇచ్చేటోడు.
రాజు దగ్గర పని చేసే సేవకునికి మంత్రిని చూస్తే చానా అసూయగా వుండేది. "మంత్రికి అస్సలు పనిలా, పాటలా... ఊరికే అప్పుడప్పుడు వచ్చి అరగంట సేపు హాయిగా కూచోని ఉత్తమాటలు చెప్పి పోతా వుంటాడు. ఒంటి మీద చెమటా పట్టదు, వేసుకున్న అంగీ నలగదు. అయినా ఆయనకు పదివేల జీతం. కానీ నాకు ఎంత పని. పొద్దున్నుంచీ సాయంత్రం వరకు గానుగెద్దులా రెక్కలు ముక్కలు చేసుకుంటా... అట్లా ఇట్లా మాటిమాటికీ తిరుగుతా, చెప్పినవన్నీ అందిస్తా, యాడికి పొమ్మంటే ఆడికి పోతా, ఏం తెమ్మంటే అది తెచ్చి పెడతా... లేసినప్పటి నుంచీ పండుకొనేదాకా ఒకటే పని. అయినా నాకు వేయి వరహాల జీతం. ఈ పద్ధతేం బాగాలేదు" అనుకునేటోడు.
ఒకరోజు రాజు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన కాళ్ళు నొక్కుతా “రాజా... ఏ మాత్రం పనీపాటా లేకుండా ఊరికే వచ్చి కాసేపు కబుర్లు చెప్పి పోయే మంత్రికి పదివేల వరహాలు ఇచ్చి, నీవు లేసినప్పటి నుండీ పండుకునేదాకా నీ వెనకాల్నే తిరుగుతా నీవు చెప్పిన పనల్లా చేసే నాకు మాత్రం వేయి వరహాలు జీతంగా ఇవ్వడం న్యాయమేనా... నిజానికి నాకు పదివేల వరహాలు ఇచ్చి, ఆయనకు వేయి వరహాలు ఇవ్వాల గానీ" అన్నాడు.
రాజు ఆ మాటలకు చిరునవ్వు నవ్వి “ఒరేయ్... నీకు అవసరానికి డబ్బులు కావలసి వస్తే అడుగు... ఇస్తా... జీతం సరిపోకపోతే సరిపోవడం లేదు రాజా అని చెప్పు... పెంచుతా... అంతేగానీ మంత్రితో పోలికెందుకురా నీకు, మీ ఇద్దరికీ నక్కకు, నాగలోకానికి వున్నంత తేడా వుంది. నీకు శరీర కష్టం చేస్తా ఉన్నందుకు డబ్బులిస్తా వుంటే మంత్రికి తెలివితేటలను వుపయోగిస్తా ఉన్నందుకు ఇస్తా వున్నా. లోకంలో ఎప్పుడయినా, ఎక్కడయినా భుజబలం కన్నా బుద్ధిబలానికే విలువెక్కువ'' అని చెప్పినాడు. కానీ వానికి ఆ మాటలు కొంచం గూడా తృప్తి కలిగించలేదు. రాజు అది గమనించినా "కొన్ని విషయాలు కొందరికి ఎంత చెప్పినా అర్థం కావు. దానికి సరియైన సమయం రావాలి" అనుకున్నాడు.
ఒకసారి రాజు వేటకు పోయినాడు. వెంబడి మంత్రి,
సేవకుడు కూడా వున్నారు. రాజు వేటాడుతా వేటాడుతా బాగా అలసిపోయి, అలసట తీర్చుకోడానికి ఒక నది ఒడ్డున చెట్టు కింద కూచున్నాడు. రాజు అటూ ఇటూ చూస్తా వుంటే నదికి అవతలవైపు కొంతమంది గుంపుగా కనబడినారు. రాజుకు వాళ్ళని చూడగానే తళుక్కున ఒక ఉపాయం మెరిసింది. వెంటనే సేవకున్ని పిలిచి "రేయ్... అవతల కొంతమంది గుంపుగా కనబడతా వున్నారు గదా... వాళ్ళెవరో కనుక్కోని రాపో" అన్నాడు.
నది చానా పెద్దగా వుంది. కాకపోతే నీళ్ళు లేవు. పరుగెత్తుకుంటా పోయినా అవతలికి పోయి ఇవతలికి రావడానికి పావుగంట పైన్నే పడుతుంది. సేవకుడు "సరే రాజా" అని ఉరుక్కుంటా నది అవతలికి పోయి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వేగంగా తిరిగొచ్చి 'రాజా! వాళ్ళు నాటకాలు వేసే వాళ్ళంట'' అని చెప్పినాడు గసబెట్టుకుంటా.
"అట్లాగా... వాళ్ళది ఏ ఊరు" అన్నాడు రాజు. “ఒక్క నిమిషం రాజా... ఇప్పుడే కనుక్కోవొస్తా" అంటా మళ్ళా వేగంగా ఉరికినాడు.
కాసేపటికి వచ్చి “రాజా... వాళ్ళు నంద్యాల నుంచి వచ్చినారంట" అన్నాడు. వాని ఒళ్ళంతా చెమటలు కారిపోతా వున్నాయి.
"అట్లాగా మరి యాడికి పోతా ఉన్నారంట" అన్నాడు రాజు.
సేవకుడు తల గోక్కోని “ఒక్కనిమిషం రాజా... అడిగొస్తా" అని ఉరుక్కుంటా పోయి ఆయాసపడతా, ఒళ్ళంతా చెమటలు గక్కుతా వుంటే, గనబెడతా తిరిగొచ్చి “రాజా వాళ్ళు కందనవోలులో పదిరోజులు నాటకాలు వేయడానికి పోతా వున్నారంట." అన్నాడు కాళ్ళు పీకుతా వుంటే అన్నే ఒక పక్కకు కూలబడి...
రాజు అది విని “అట్లాగా... మరి మన రాజ్యంలో గూడా నాటకాలు వేయడానికి వస్తారంటనా" అన్నాడు. ఆ మాటలకు వాడు నోరెళ్ళబెట్టినాడు. అప్పటికే నది అవతలికీ, ఇవతలికీ ఉరికీ ఉరికీ, అలసిపోయి చెమటలు కక్కుతా వున్న వాడు “రాజా! కాసేపాగి వెళతా... ఇప్పుడే వెళ్ళడం నా చేతగాదు. కాళ్ళు పీకుతా వున్నాయి" అన్నాడు.
దానికి రాజు వాని వంక చూసి “అదెట్లరా... అంతలోపు వాళ్ళు వెళ్ళిపోతే" అన్నాడు.
సేవకునికి ఏం చేయాల్నో తోచక "రాజా... ఈ ఒక్కసారికి నీ మాట కాదన్నందుకు మన్నించి ఎవరినైనా పంపు రాజా... నాచేత అస్సలు కావడం లేదు" అన్నాడు కండ్లనీళ్ళు పెట్టుకోని.
రాజు సరేనని మంత్రిని పిలిపించి "మంత్రీ! నదికి అవతల ఏదో గుంపు కనబడతా వుంది. ఎవరు వాళ్ళు" అన్నాడు.
మంత్రి అటుపక్క చూసి “రాజా! వాళ్ళు నాటకాలేసేవాళ్ళు. నంద్యాల నుండి వచ్చినారు. పదిరోజులు కందనవోలులో నాటకాలు వేయడానికి పోతున్నారంట. మనం పిలిస్తే మన రాజ్యానికి గూడా వస్తారంట. తీనడానికి ఇంత తిండి పెట్టి మీకు తోచినంత ఇస్తే చాలన్నారు. రామాయణం, భారతంలో ఏ కథయినా నాటకంగా వేయగలరంట. మొత్తం పదిమంది వున్నారు" అని చెప్పినాడు.
మంత్రి టకటకటక వివరాలన్నీ ఒక్క క్షణంలో చెబుతా వుంటే పనోడు నోరు వెళ్ళబెట్టుకోని వింటా వున్నాడు.
రాజు మంత్రితో "మంత్రీ! ఇవన్నీ నువ్వెప్పుడు కనుక్కోని వచ్చినావు" అన్నాడు.
మంత్రి నవ్వి “రాజా... నిన్ను, రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడమే గదా నా పని. నీవు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటా వుండగా... అవతల ఒక గుంపు కనబడింది. వాళ్ళు ఎవరు? అక్కడ ఎందుకున్నారు? వాళ్ళ వల్ల నీకేమయినా ప్రమాదమా? అని సందేహం వచ్చి వెంటనే అవతలికి పోయి రహస్యంగా అన్నీ విచారించుకోని వచ్చినాను" అన్నాడు.
“అట్లాగా... మరి నాకెందుకు చెప్పలేదు. మన రాజ్యానికి పిలిపిస్తా వుంటిమి గదా" అన్నాడు రాజు.
మంత్రి చిరునవ్వు నవ్వి "రాజా... ఇది మంచి పంటల కాలం. వాళ్ళను పిలిపించి అనవసరంగా రైతుల పనులు చెడగొట్టడం ఎందుకు, కోతలు పూర్తయ్యాక అందరూ విశ్రాంతిగా వుంటారు. అప్పుడు పిలిపిస్తే అందరికీ సంతోషంగా వుంటాది. అందుకే వాళ్ళ వివరాలన్నీ తీసుకున్నాను. ఇక ఇవన్నీ మీకెందుకు చెప్పలేదంటే ఇప్పటికే మీరు వేటాడి వేటాడి బాగా అలసిపోయి వున్నారు. ఏదో హాయిగా విశ్రాంతి తీసుకుంటా ఉంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటా మీ విశ్రాంతిని పాడు చేయడం ఎందుకు. తీరిగ్గా వున్నప్పుడు చెప్పొచ్చులే అని చెప్పలేదు" అన్నాడు.
మంత్రి వెళ్ళిపోగానే రాజు సేవకుని వైపు తిరిగి “ఇప్పుడు అర్థమయ్యిందా? మంత్రికీ, నీకూ వున్న తేడా... మనిషి శారీరక శ్రమ కన్నా తెలివితేటలకే విలువెక్కువని" అన్నాడు.
సేవకుడు సిగ్గుతో తల వంచుకున్నాడు.
***********
కామెంట్‌లు