శవంతో ఒక రాత్రి ;- డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212)

 ధనయ్య చాలా గొప్ప నటుడు. ఏ పాత్రనయినా సరే అవలీలగా పోషించగలడు. చుట్టుపక్కల రాజ్యాలలో వానంత గొప్ప నటుడు ఎవడూ లేడని పెద్ద పేరు. కానీ ధనయ్యకు పేరులో ధనం వుంది గానీ ఇంటిలో అస్సలు లేదు. చాలా పేదవాడు. నాటకాలు వేయడం ద్వారా వచ్చే ధనం కుటుంబపోషణకు కొంచం కూడా సరిపోయేది కాదు. దాంతో ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తా వుంటే ఒక స్నేహితుడు "మిత్రమా! మన మహారాజు శూరసేనునికి కళలన్నా, కళాకారులన్నా చాలా ఇష్టం. కానీ ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోడు. తానే స్వయంగా చూసి పరిశీలిస్తాడు. నచ్చితే ప్రశంసల వర్షంలోనే గాదు వరహాల వర్షంలో గూడా ముంచెత్తుతాడు ఒక్కసారి కలువు" అని చెప్పాడు.
దాంతో ధనయ్య తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఆ పూరి గ్రామాధికారి సహాయంతో రాజును కలిశాడు. “రాజా... నా గురించి నేను స్వయంగా డబ్బా కొట్టుకోవడం తప్పే అయినా తప్పడం లేదు. నేను చాలా గొప్ప నటున్ని, ఏ పాత్రనయినా అవలీలగా పోషించగలను. కానీ పేదరికం వెంటాడుతోంది. కుటుంబం గడవడం చాలా కష్టంగా వుంది. నాలోని కళాకారుడు చచ్చిపోతున్నాడు. నా ప్రతిభను పరీక్షించి నన్ను ఆదుకోండి" అన్నాడు వినయంగా తల వంచి.
మహారాజు కాసేపు ఆలోచించి తన చుట్టూ వున్న వాళ్ళతో “ఈ లోకంలో అన్నింటికన్నా ఏ పాత్ర నటించడం కష్టం" అనడిగాడు.
ఒకడు స్త్రీ పాత్ర అంటే, మరొకడు వృద్ధుని పాత్ర అన్నాడు. ఒకడు నాయకుని పాత్ర అంటే, ఇంకొకడు ప్రతినాయకుని పాత్ర అన్నాడు. అట్లా ఒకరితో ఒకరు గొడవ పడతా వుంటే మంత్రి మధ్యలో కల్పించుకొని “ మహారాజా... అన్నిటికన్నా శవం పాత్ర వేయడం చాలా కష్టం. కళ్ళ ముందు ఏం జరుగుతున్నా పట్టిచ్చుకోకుండా, మొహంలో ఎటువంటి భావం కనబడకుండా, కొంచం కూడా అటూ యిటూ కదలకుండా నాటకం ముగిసే దాకా వుండాలి” అన్నాడు.
రాజుకు ఆ మాట భలే నచ్చింది. “నిజమే... శవం పాత్ర ధరించడం అంటే మాటలు గాదు" అంటూ ధనయ్య వైపు తిరిగి “ఏం ధనయ్యా... మరి శవం పాత్ర వేయగలవా. కానీ ఇది రంగస్థలంపై కాదు. నిన్ను ఈ రోజు సాయంత్రం రాజ్యంలో ఏదో ఒకచోట వదిలి పెడతాము. మళ్ళా రేపు ఉదయం ఐదు గంటల వరకు ఏమి జరిగినా నీవు అచ్చం శవం లెక్కనే పడివుండాలే తప్ప అస్సలు లేవగూడదు. నీవు బ్రతికి వున్నట్టు ఎవరు కనుక్కున్నా నీవు ఓడిపోయినట్టే. నీ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా కొందరు రాజభటులు దూరం నుంచే నిన్ను కనిపెట్టి చూస్తుంటారు. తరువాత రోజు పొద్దున్నే నువ్వు నా దగ్గరకొచ్చి జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించాలి. ఈ పాత్ర వేయగలిగితే పదివేల బంగారు వరహాలు బహుమానంగా ఇస్తా. ఏం సిద్ధమా" అన్నాడు.
ఆ మాటలకు ధనయ్య చిరునవ్వు నవ్వి “రాజా! నేను నటున్ని, ఎటువంటి పాత్రయినా సరే సయ్యంటూ ముందుకు దూకడమే తప్ప వెనకడుగు వేయడం నా చరిత్రలోనే లేదు. చూస్తుండండి!... నటునిగా శవం పాత్రలో జీవిస్తాను " అన్నాడు.
దాంతో రాజు వానికి ఏం చెయ్యాలో చెప్పాడు. ధనయ్య సరేనని రాజు చెప్పిన చోటికి బైలుదేరాడు.
అది ఒక బంగారు అంగడి. దాని యజమాని పేరు శంకరయ్య. తక్కువ కాలంలోనే వ్యాపారంలో పెద్ద పేరు సంపాదించాడు. అందరికన్నా తక్కువ ధరకే నగలు చేసి అందించేవాడు.
ధనయ్య రాజు చెప్పినట్లుగా ఆ బంగారం అంగడిలోకి అడుగు పెట్టాడు. శంకరయ్య వానిని చిరునవ్వుతో ఆహ్వానించి నగలు చూపడం మొదలు పెట్టాడు. అంతలో అక్కడ పని చేసే సేవకుడు ధనయ్య తాగడానికి తియ్యని లస్సీ కుండలో నుంచి తెచ్చి ఇచ్చాడు. అది తాగిన మరుక్షణం ధనయ్య గొంతు పట్టుకొని కిందపడి గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయినోని మాదిరి అక్కడికక్కడే విరుచుకు పడిపోయాడు.
“రేయ్... వీడేందిరా ఆ లస్సీ తాగుతానే ఇట్లా చచ్చిపోయాడు. కొంపదీసి ఇందులో ఏమన్నా కలిసిందా" అన్నాడు కంగారుగా శంకరయ్య.
“అదేం లేదు దొరా... ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు గూడా చాలామంది తాగారు గదా... వాళ్ళకేం కాలేదు. కావాలంటే చూడండి నేను గూడా తాగుతా" అంటూ కుండలో నుంచి కొంచెం లస్సీ తీసి గుటగుటగుటమని తాగి చూపించాడు.
“మరి వీడెలా చచ్చాడు."
“వాని కాలం తీరి చచ్చిపోయింటాడు అంతే, రాజభటులకు కబురు చేద్దాం. వాళ్ళు వచ్చి శవాన్ని తీసుకుపోతారు" అన్నాడు సేవకుడు.
“రేయ్... మనం చేసేది దొంగ బంగారం వ్యాపారం. దొంగలు ఎక్కడెక్కడి నుంచో దోచుకొచ్చినదంతా మూడో కంటికి తెలీకుండా తక్కువ ధరకు మనకు అమ్ముతా వుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా వెంటనే మనం దాన్ని కరిగించి రకరకాల నగలు తయారు చేసి అమ్ముతా వున్నాం. ఇప్పుడు రాజభటులు గనుక వచ్చినారనుకో, వాళ్ళు మనం చెప్పింది నమ్మి వెళ్ళిపోరు. మనమే ఏదో చేశాం అనుకుంటారు. మన అంగడికి ఎవరెవరు వస్తా వున్నారు, ఏమేం అమ్ముతా వున్నారు, ఏమేం కొంటా వున్నారు ఒక్కొక్కటే తవ్వి తీయడం
మొదలు పెడతారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు చివరకు మన గుట్టు గూడా బట్టబయలు ఐపోతుంది. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు, గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని ఇక్కన్నుంచి మాయం చేసి ఇంకోచోట పడేస్తే సరి” అన్నాడు.
శంకరయ్యకు ఆ వూరిలో వుండే గోపాలం అంటే అస్సలు పడదు. ఇంతకు ముందు వాళ్ళు పక్క పక్క ఇళ్ళలోనే వుండేవాళ్ళు, శంకరయ్యది దొంగ బంగారం వ్యాపారం గదా, ఇంటికి రాత్రుళ్ళ పూట ఎవరెవరో వచ్చిపోతా వుండేవాళ్ళు. ఇంటి తలుపులు దబదబదబ కొడతా వుండేవాళ్ళు. ఆ చప్పుళ్ళకు పక్కనే వున్న తమకు రాత్రి నిద్ర సరిగా రావడం లేదని గోపాలం గొడవపడి రాజభటులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. దాంతో శంకరయ్య ఇళ్ళు ఖాళీ చేసి ఎవరూ లేని ఇంకో చోటికి మారాడు. అది గుర్తుకువచ్చి 'ఈ గొడవలో గోపాలాన్ని ఇరికియ్యాలి' అనుకున్నాడు.
బాగా చీకటి పడగానే నెమ్మదిగా శవాన్ని అంగడి వెనుకవైపు నుంచి గుర్రంబండిలో వేసుకొని గోపాలం ఇంటికి చేరుకున్నారు. వీధిలో ఎవరూ లేరు. నెమ్మదిగా శవాన్ని గోపాలం ఇంటిముందున్న అరుగు మీద ఒక స్తంభానికి కూర్చున్నట్లుగా ఆనించి తలుపు చప్పుడయ్యేటట్లు దబదబదబ బాది వేగంగా అక్కడినుంచి వెళ్ళిపోయారు. గోపాలానికి ఎప్పుడూ కోపం ముక్కు మీదనే వుంటాది. చీటికీ మాటికీ ప్రతి చిన్నదానికి చిర్రుబుర్రులాడుతుంటాడు. కొట్లాటలకి దిగుతుంటాడు. సయ్యంటే సయ్యంటూ అంగీ మడుస్తుంటాడు.
ఇంటి లోపల అన్నం తింటా వున్న గోపాలం ఆ తలుపు కొట్టిన చప్పుళ్ళకు అదిరిపడ్డాడు. సర్రుమని కోపం అరికాలి నుంచి తల వరకు పాకింది. “ఎవడ్రా వాడు కొంచమన్నా బుద్దుందా లేదా” అంటూ విసురుగా తలుపు తీశాడు. ఎదురుగా ఎవరూ లేరు. అటూ యిటూ పరికించి చూస్తే స్తంభానికి ఆనుకొని కూర్చున్న ధనయ్య కనబడ్డాడు. “కొంపలేదో కూలిపోయినట్లు తలుపులు దబదబదబ బాది, హాయిగా ఏమీ ఎరగనోని మాదిరి నింపాదిగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నావా... ఏం తమాషాగా వుందా నీకు” అంటూ పోయి విసురుగా వెనుకనుంచి తల మీద ఈడ్చి ఒక్కటి పెరికాడు. అంతే... ధనయ్య దభీమని ముందుకు పడ్డాడు. కొంచం కూడా కదలకుండా, మెదలకుండా అచ్చం శవం లెక్కనే వూపిరి బిగబట్టాడు. అది చూసి గోపాలం అదిరిపడ్డాడు. 'వీడెవడ్రా నాయనా ఒక్క దెబ్బకే చచ్చిపోయాడు' అనుకున్నాడు.
అంతలో గోపాలం పెళ్ళాం బైటకు వచ్చింది. “నీ కోపం ఏదో ఒక రోజు మన కొంప ముంచుతాదని ఎన్నోసార్లు నెత్తీ నోరు కొట్టుకొని చెప్పా. ఐనా వినలేదు. ఇప్పుడు చూడు ఏమయ్యిందో... ఇంతకు ముందు ఇట్లానే మన పనిమనిషి రంగన్న తల పగలగొడితివి. వాని పెళ్ళానికి పదివేల వరహాలు ఇచ్చి విషయం బైటకు రాకుండా, వాళ్ళింట్లోనే కాలు జారి కిందపడి చచ్చిపోయినాడని అందరినీ నమ్మించే సరికి తలప్రాణం తోకకొచ్చింది. ఇప్పుడు వీడెవడో, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియడం లేదు. ఈ గొడవ నుంచి ఎట్లా బైటపడాల్నో ఏమో” అని నెత్తీ నోరు కొట్టుకొంది.
వాడు పెళ్ళాం నోరు గట్టిగా మూసి “అందరికన్నా ముందు నీవే ఈ విషయం వూరువూరంతా దండోరా వేసేటట్లున్నావు. కొంచెం సేపు గమ్మున లోపలకు పో. ఏం చేయాల్నో నేను ఆలోచిస్తా" అన్నాడు. శవాన్ని నెమ్మదిగా అరుగు మీదకు మరలా చేర్చి ఎవరికీ కనబడకుండా దుప్పటి కప్పాడు. ఏం చేయాలబ్బా అని చానా సేపు ఆలోచించాడు. ఒక ఆలోచన తళుక్కుమంది.
ఆ ఊరి చివర ఒక సారాయి అంగడి వుంది. శవాన్ని ఎద్దులబండిలో వేసుకొని అక్కడికి పోయాడు. కొంచెం దూరంగా ఎవరికీ కనబడకుండా ఒక చెట్టు చాటున బండి ఆపి అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. తాగేటోళ్ళు తాగుతా వున్నారు. అరుచుకునేటోళ్ళు అరుచుకుంటా వున్నారు. కిందపడి దొర్లేటోళ్ళు దొర్లుతా వున్నారు. అంతా సందడి సందడిగా వుంది. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరే వెళ్ళిపోతా వున్నారు. రాత్రి పది దాటేసరికి బైట ఎవరూ కనబడలేదు. లోపల సారాకొట్టు యజమానులు మాత్రమే వున్నారంతే. ఇదే సందనుకోని నెమ్మదిగా శవాన్ని దించి చప్పుడు చేయకుండా దాన్ని సారాయి అంగడి ముందు ఒక దిమ్మెకు ఆనించి కొంచం సారాయి వాని బట్టల మీద చల్లి అక్కడి నుంచి మాయమైపోయాడు.
కాసేపున్నాక సారాకొట్టు యజమాని ఆరోజు వచ్చిన వరహాలన్నీ లెక్కబెట్టుకుంటా తలుపులు మూసేద్దామని బైటకొచ్చాడు. వచ్చి చూస్తే ఇంకేముంది దిమ్మెకు ఎవరో అనుకొని కనబడ్డారు. వాడు దగ్గరికొచ్చి “ఏయ్... లెయ్... లెయ్... తాగింది సాలు గానీ... కొట్టు కట్టేస్తా వున్నాం పద పద" అంటూ భుజం తట్టాడు. వెంటనే ధనయ్య వూపిరి బిగబట్టి ఒక వైపుకి దభీమని పడిపోయాడు. అది చూసి సారాకొట్టు యజమాని అదిరిపడ్డాడు. ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే ఇంకేముంది వూపిరాడ్డం లేదు. .
వాడు భయపడి వెంటనే లోపలనుంచి వాని బావమరిదిని పిలిచాడు. వాడు వచ్చి శవాన్ని చూసి “బావా... ఏ వ్యాపారమైనా న్యాయంగా చేయాలి. ఇట్లా కల్తీసారా కాయించి అమ్మొద్దు అని రోజూ నెత్తీ నోరూ కొట్టుకొని చెబుతా వున్నా, నువ్వు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చూడు వీడు చచ్చిపడినాడు. నీ అదృష్టం కొద్దీ ఇక్కడెవరూ లేరు. అదేగాని వుండింటే ఇప్పటికంతా రచ్చ రచ్చయ్యేది. నువ్వూ నేనూ కారాగారంలో వూచలు లెక్కబెట్టాల్సొచ్చేది” అన్నాడు.
దానికి వాడు “రేయ్... ఈ రాజ్యంలో నేనొక్కన్నేనా ఇట్లా డబ్బుల కోసం దొంగపనులు చేస్తా వున్నది. వూర్లో పెద్ద పెద్ద వ్యాపారస్తులంతా చేసే పని ఇదే గదా... మన రాజ్యంలో పెద్ద ధర్మాత్నుడనీ, చేతికి ఎముక లేకుండా దానం చేస్తాడనీ పేరున్న సుబ్బయ్య నూనె వ్యాపారంలో సగానికి సగం కల్తీనే. రాజ్యానికంతా బియ్యం సరఫరా చేసే సుంకన్న లావుబియ్యాన్ని అరగదీసి సన్నబియ్యంలో కలిపి అమ్ముతా వున్నాడు. ఆఖరికి మన రాజుగారి సేనాధిపతి శూరసేనుడు చేసే పనేమి. ఎవరైనా సైన్యంలో భటులుగా చేరాలంటే ఆయన చేయి తడపాల్సిందే. యుద్ధవిద్యలు రాకున్నా, పరాక్రమం లేకున్నా పరవాలేదు. ఈ లోకంలో దొరకనంతవరకూ అందరూ దొరలేగానీ... ముందు ఈ శాన్ని ఏం చేద్దామో చెప్పు" అన్నాడు.
బావమరిది కాసేపు అలోచించి “బావా.... అడవిలో పదిమైళ్ళ దూరం పోతే ఒక పాడుబడిన గుడి వుంది. అక్కడికి చచ్చినా ఎవ్వరూ పోరు, ఈ శవాన్ని తీసుకపోయి అక్కడ పడేద్దాం. ఏ జంతువులో పీక్కు తింటాయి. ఏం సరేనా” అన్నాడు.
వాళ్ళిద్దరూ కలిసి ఆ శవాన్ని ఎద్దులబండిలో వేసుకోని చీకటిలో అడవిదారి పట్టారు. అట్లా ఆ గుడికి చేరుకునేసరికి రెండు గంటలు పట్టింది. గుడి బైట వరండాలో ఒక మూల శవాన్ని పడుకోబెట్టి మట్టసంగా తిరిగి బైలు దేరారు.
చీకటిలో ధనయ్య ఒక్కడే వున్నాడు గదా... దాంతో వానికి భయమేసింది. నాటకంలో చుట్టూ జనాల మధ్య నటించడం వేరు, ఇలా నిజంగా నటించడం వేరు. అంతలో రాజభటులు తాను ఎక్కడికెళ్ళినా అనుసరిస్తుంటారు గదా అని గుర్తొచ్చి ధైర్యం కలిగింది. రేపుదయం వరకూ ఇలాగే శవంలా నటిస్తే చాలు పదివేల బంగారు వరహాలు చేతిలో పడతాయి గదా అని సంబరంగా కలలు కంటా, కదలకుండా మెదలకుండా అలాగే పడుకున్నాడు. అంతలో దూరం నుండి ఏవో గుర్రపు డెక్కల చప్పుళ్ళు వస్తా వినబడ్డాయి. ఈ సమయంలో ఎవరా అని ఆసక్తిగా చూడసాగాడు. కాసేపటికి అక్కడికి ఒక పెద్ద దొంగలగుంపు వచ్చింది.
వాళ్ళు దోచుకొచ్చిన సొమ్మంతా గుడి ముందు ఆవరణలో పెట్టి కాగడా వెలిగించారు. ఆ వెలుతురులో ఒకడు మూలన పడుకున్న ధనయ్యను చూసి “రేయ్... ఎవడో ఆ మూలన పడుకున్నాడు జాగ్రత్త" అన్నాడు. వెంటనే ఇద్దరు దొంగలు కత్తులు తీసుకొని వాని దగ్గరికి పోయి “రేయ్... ఎవర్రా నువ్. ఇంతదూరం వచ్చినావ్. ఒక్కనివేనా.... ఇంకా చాలామంది వచ్చినారా. లెయ్ లెయ్" అంటూ గట్టిగా అరిచారు. ధనయ్య ఒక్కమాట గూడా తిరిగి జవాబివ్వకుండా కొయ్యబొమ్మ లెక్క అట్లాగే బిగుసుకుపోయి వున్నాడు. ఎంత పిలిచినా లెయ్యక పోవడంతో ఒక దొంగ అటూ యిటూ కదిపినాడు. ఊహూ వాడు లెయ్యలేదు. “అసలు వాడు బతికినాడా చచ్చినాడా" అనుకుంటూ ముక్కు దగ్గర ఏలు పెట్టి చూసినారు. వాడు వూపిరి బిగబట్టడంతో శ్వాస అందలేదు. సారాయి వాసన గుప్పున కొడుతా వుంది. “రేయ్... వీడెవడో బాగా తాగి ఇక్కడకొచ్చి పడి చచ్చినట్టున్నాడు" అన్నాడు.
ఆ మాటలకు దొంగల నాయకుడు “వీడొక్కడే వచ్చాడా, లేక మనం దేవతా విగ్రహం కింద దాచిన నిధి గురించి తెలిసి ఇంకెవరితోనైనా కలిసి వచ్చాడా. ఎందుకైనా మంచిది పోయి విగ్రహం కింద దాచిన నిధి వుందో లేదో చూసిరా. అలాగే లోపల ఎవరివైనా అడుగుల ముద్రలు మట్టి మీద వున్నాయేమో గమనించు" అన్నాడు. వెంటనే ఆ దొంగ వురుక్కుంటా లోపలికి పోయాడు. కాసేపటికి “నాయకా... లోపల ఎటువంటి అడుగుల ముద్రలూ లేవు. నిధి గూడా ఎట్లున్నది అట్లానే భద్రంగా వుంది. వీడు తాగి పొరపాటున దారి తప్పి వచ్చినట్టున్నాడులే, ఈ అడవిలో తిండీ నీళ్ళు దొరకక ఇక్కడ చచ్చిపడినట్టున్నాడు" అన్నాడు.
దాంతో ఒక దొంగ “నాయకా... ఆ శవం సంగతి కాసేపు పక్కన పెట్టి రేపు రాత్రి మనం చేయబోయే దొంగతనం గురించి చెప్పండి" అన్నాడు.
దానికి ఆ దొంగల నాయకుడు “మిత్రులారా... కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అంటారు గదా పెద్దలు. ఇలా చిన్న చిన్న దొంగతనాలు ఎన్ని చేసినా లాభం లేదు. రేపు మనం రాజుగారి ఖజానాను కొల్లగొడదాం. తరతరాలు తిన్నా తరగనంత సంపద దొరుకుతుంది. ఇక మనకు జీవితంలో ఏ దొంగతనమూ చేయాల్సిన అవసరం వుండదు" అన్నాడు.
“కానీ రాజుగారి ఖజానా అంటే మాటలు కాదుగదా... చాలా కాపలా వుంటుంది. అసలు లోపలికి అడుగు గూడా పెట్టలేం" అన్నాడు ఒక దొంగ.
దానికి వాళ్ళ నాయకుడు చిరునవ్వు నవ్వి “మన సైన్యాధికారి శూరసేనుడు వున్నాడు గదా... వాడు పెద్ద లంచగొండి. ధనం ఇస్తే ఎవరూ ఏమీ అని చూడకుండా సైన్యంలో చేర్చేసుకుంటా వుంటాడు. 
మనోళ్ళని నలుగురిని అలా వారం కింద పెద్ద ఎత్తున లంచమిచ్చి అంతఃపురంలో కాపలా భటులుగా చేర్చేశాను. ఆ నలుగురికి రేపు ఖజానా దగ్గరే కాపలా. మత్తుమందు కలిపిన లడ్డూలు ఇప్పటికే పంపించాను. అవి తినగానే అక్కడ కాపలాగా వున్న మిగతా భటులంతా ఎక్కడోళ్ళక్కడ పడిపోతారు. తరువాత రోజు పొద్దున వరకు ఏనుగులతో తొక్కించినా లేవరు. భవనం వెనుకనుంచి మనవాళ్ళు తాళ్ళు కిందికి వదులుతారు. వెంటనే మనం పైకి పోయి ఖజానా అంతా కొల్లగొడదాం" అన్నాడు.
అందరూ 'సరే' అన్నారు. ధనయ్య అదంతా విని అదిరిపడ్డాడు.
దొంగల నాయకుడు ధనయ్య వంక చూస్తా "ఈ శవం ఇక్కడుంటే అంతా కంపులేసి పోతాది గానీ.... ఒకడు దీన్ని తీసుకపోయి వూరి బైట సారా అంగడి వుందిగదా అక్కడ పాడేసి రాపోండి. తాగి తాగి ఆన్నే పడి సచ్చిపోయినాడు అనుకుంటారందరూ. మనం రేపు రాత్రి మరలా ఇక్కడే కలుద్దాం" అన్నాడు.
"సరే... అని ఒక దొంగ ఆ శవాన్ని ఒక గుర్రమ్మీద వేసుకొని సర్రున దూసుకపోయాడు. సారా అంగడి ముందు తలుపులకు అడ్డంగా వాన్ని కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. సారా అంగడి యజమానులు ఎద్దులబండిలో పోయి గుడికాడ శవాన్ని పెట్టి మరలా తిరిగి వస్తా వున్నారు గదా... దారిలో ఒక పెద్ద గుంత వచ్చింది. చూసుకోక పోవడంతో బండి దానిలో పడిపోయింది. ఇద్దరూ కష్టపడి బండి బైటకు లాక్కోని వచ్చేసరికి ఉదయం అవుతా వుంది.
ఇద్దరూ సారా అంగడికొచ్చి చూస్తే ఇంకేముంది.... గుమ్మం ఎదురుగా శవం కనబడింది. అంతే వాళ్ళిద్దరూ అదిరిపడ్డారు. "రేయ్... వాడు దయ్యమయి తిరిగి మనల్ని చంపడానికి మనకన్నా ముందే వచ్చినట్టున్నాడు" అని భయపడి దూరం నుంచే దాచి పెట్టుకొని చూడసాగారు.
రాజుగారి మాట ప్రకారం ఉదయం వరకే కదా ధనయ్య శవంలా వుండాల్సింది. ఇంకో అరగంటలో చీకటి తొలగిపోయింది.
దాంతో ధనయ్య నెమ్మదిగా లేచి ఒళ్ళు విరుచుకోని ముందుకు అడుగేశాడు. అంతే అంతవరకు చెట్టుచాటు నుంచి చూస్తా వున్న ఆ బావా బామ్మర్దులు ఇద్దరూ వణికిపోయారు. “రేయ్... ఆ దయ్యం మనల్ని కనిపెట్టేసినట్టుంది. అందుకే లేసి మనవైపే వస్తా వుంది. ఇంకో క్షణం ఇక్కన్నే వుంటే దానికి బలై సస్తాం" అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు.
ధనయ్య రాజభటులతో కలిసి సక్కగా రాజు దగ్గరికి పోయాడు. రాత్రి జరిగినవన్నీ పూసగుచ్చినట్టుగా వివరించి చెప్పాడు. అవన్నీ విని రాజు నా రాజ్యంలో ఇన్ని అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయా' అంటూ ఆశ్చర్యపోయాడు. వెంటనే భటులను పంపి అందరినీ బంధించాడు. ఆ రోజు రాత్రి ఖజానా కొల్లగొట్టడానికి వచ్చిన దొంగలందరినీ చుట్టుముట్టి బంధించారు. ధనయ్యను పిలిచి “ ఒక్క దెబ్బకు వంద పిట్టలు పడడమంటే ఇదే. నువ్వు ఒక రాత్రి శవంగా నటించేసరికి రాజ్యంలో ఎప్పటినుంచో పట్టుపడని దొంగలు, కల్తీ వ్యాపారులు, ఆఖరికి లంచాల కోసం మన సైన్యాన్ని బలహీనపరుస్తున్న అవినీతి సైన్యాధికారి... ఇలా చిన్న చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద తిమింగలాల దాకా అనేకం చిక్కాయి. అంతేగాక పెద్ద నిధి దొరికింది. అందుకే ముందు చెప్పినట్టు పదివేల వరహాలు కాక ఏకంగా లక్ష వరహాలు కానుకగా ఇస్తున్నా తీసుకో!" అంటూ ఘనంగా సన్మానం చేసి వరహాలు చేతిలో పెట్టాడు.
ఆరోజు నుంచీ ధనయ్య హాయిగా కాలు మీద కాలేసుకుని సుఖంగా బతకసాగాడు.
*********

కామెంట్‌లు