విద్యుల్లతల వెలుగుల అరుగు "ఇరుగు పొరుగు " ;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు 9849305871
 సాహిత్యంలో పరామర్శ  ప్రక్రియ   ఒక వినూత్న ఆత్మీయ ఆనంద గీతం.విశిష్ట  వైవిధ్యాల పరస్పర వ్యతిరేకమైన భావోద్వేగాల నఖశిఖపర్యంత సంక్షిప్త సమగ్రత. వివిధ భాషల భిన్నవిభిన్న కోణాల ఆవిష్కృత అనుసృజనలోని వాడీ వేడి నివేదన మంచ్ పై మంచీ చెడు నాడీశోధనే.కవిత పరామర్శ  విస్తృతమైన లోతైన ఆత్మీయ అధ్యయనం.సాహిత్యంలో సాధికార ప్రామాణిక ప్రక్రియలైన అభిప్రాయం సమీక్ష విమర్శ మీమాంసల  సరసన పరామర్శ తోడైంది.ఇది చేతి వేళ్లతో కమ్మలను తిరిగేస్తూ కన్నుల టార్చిలైట్ తో సాగిపోయే పైపై అక్షర ఉపరితలం కాదు.కవి కలం దున్నిన పొలం ఇది.పంట పచ్చగ స్వఛ్ఛంగా ఉండి కవిత్వం బాగా పండింది.కవి చెప్పేంతవరకు ఇది అనువాద కవిత్వం అనిపించదు. అంటే అణునాదానికి సరితూగే అనువాదం ఇది.సృజన కవిత్వానికీ అనువాద కవిత్వానికీ తేడా ఏమాత్రం కనిపించదు కలం సత్తాగలదైతే. కవి నిత్య అధ్యయన  పిపాసియైన నిజ అభ్యాసన దాహార్తియైనా అయి సామాజిక స్పృహతో సామాజిక చైతన్యాన్ని రగిలించి సమాజహితానికి రాచబాటగా కవిత్వాన్ని చెక్కగలదు.ఈ కోవలోనిదే వారాల ఆనంద్ కలం. ఆయన 'ఇరుగు పొరుగు' అనువాద కవిత్వం కూడా.ఇక కవితలను తడిమితే తడితడిగా 
హృదయం ద్రవిస్తూ వాడివాడిగా పిడికిలి జ్వలిస్తూ చాలా లోతైన  సాంద్రతతో విశాలమైన  మైదానాల తలపించే బృహత్ కవిత్వ మంజూష.ఇందులో 29 భారతీయ భాషల్లోని 90 ప్రఖ్యాత కవుల 152 కవితలున్న అనువాద కవితలున్నయి. 
ఆత్మ స్తుతి పర నింద నడకల కాలంలో కలం కదంతొక్కడం మానేసి చాలాకాలమైన నేపథ్యంలో ఒక గొప్ప సృజన మంచి ప్రయత్నం ఈ 'ఇరుగు పొరుగు' అనువాద కవిత్వంతో వారాల ఆనంద్ చేయడం భాషా సమైక్యత భావ సమైక్యత ద్వారా భారతీయ ఆత్మనూ జాతీయ తాత్వికతనూ  చూపేందుకు చేసిన సాహిత్య కృషి ప్రశంశనీయం. మాతృభాష ఎవరికైనా అమ్మమాటే. 29భారతీయ భాషలన్నీ బంధువులు మిత్రులు కుటుంబమనే నా దేశంలో. అనువాదం ప్రపంచ భాషల వారధి.మన ఇరుగు పొరుగు భాషాసాహిత్యాల పలుకరింపుల ప్రవాహ నదీ గీతం.ఈ సంపుటిలోని కొన్ని కవితల పాదాలు మచ్చుకు మీ ముందుకు...
కె.సచ్చిదానందన్ మళయాళం మూల కవిత 'వీడ్కోలు'  లో 
"తన గొంతు/నలిగిపోక ముందు  ఆలపించే/
కలలు నిండిన గీతం/మన కవిత్వం"
'రూపీ  కౌర్ కవితలు' ఆంగ్ల మూలంలో
"అతన్ని ఎలా ప్రేమించాలో/నేర్చుకుంటున్నాను/నన్ను నేను ప్రేమించుకుంటూ"
కనిమొళి తమిళకవిత 'అవసరం లేదు'  లో
"స్వర్గాన్ని ఆధీనంలోకి/తెచ్చుకోవలసిన అవసరం/
నాకు లేదు/
ఈ భూమే నాకు అలవాటయిపోయింది/"
డోంగ్రీ కవిత 'బాధ' ముగింపులో
"ఈ బాధ/
నేనివ్వాళ గానం చేయలేని/
దుఃఖం నుండి పుడుతుంది/"
ఆఘా షాహిద్ అలీ కాశ్మీరీ కవిత'ఉనికి'లో "నువ్వు వెళ్ళిపోతే/నా దుఃఖపు ఉనికిని/
ఎవరు నిరూపిస్తారు/ఉనికిలోకి రాకముందు/నేనెవర్నో చెప్పవూ/"
ఇంకా ఫైజ్ అహ్మద్ ఫైజ్  ఉర్దూ కవిత' దుఃఖానికి మాటలొస్తే'లో
"నా దుఃఖం, నిశ్శబ్ద  సంగీతం/
నా ఉనికి, పేరు లేని అణువు/"
మరోచోట
"నా ఉనికి ఆనవాళ్ళు నాకు తెలిస్తే/ ఈ లోకపు రహస్యం నాకు తెలిసేది/"
ఇలా ఎంతో వైవిధ్యమైన  అనుసృజన ప్రక్రియలో అర్ధవంతమైన సాంద్ర సృజనతో ఇరుగు పొరుగు కవిత్వాన్ని తెలుగులో వెలువరించిన వారాల ఆనంద్  బహుధా అభినందనీయులు.

కామెంట్‌లు