అటవెలది పద్యాలు- ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట-9966946084
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా
==============================================
లాలి పాటవినుచు లాలిత్య భాష్యంబు
నేర్చినట్టి బిడ్డ నేర్పుగలిగి
అమ్మ భాషనందు కమ్మని పలుకులు
మరువకూడదెపుడు మాతృభాష

అమ్మ భాషలున్న అవని భాషలు వచ్చు
సొబగులన్ని గూర్చు సొంతభాష
అందమైన భాష హరివిల్లు చందాన
మధురమైన చోటు మాతృభాష

కొలువు పెద్దదైన కోట్ల కాంతులిడినా
అమ్మ వొడిన నిద్ర అమృతమయము
భాషలెన్నివున్న బాసటై సాగేటి
మమత సమతలున్న మాతృభాష


అక్షరాల తోడు శిక్షగా చూసినా
చూపుతుంది తెలుగు రూపమందు
మాటలొక్కటైన మార్చకు వేషంబు
మనిషి జ్ఞానమందు మాతృభాష

తెలుగు వున్నచోట వెలుగుల రవళులు
పూర్వ భాషగాను పూర్ణమయము
జగతి భాషలందు జాగృతంబు తెలుగు
మంచి పంచునెపుడు మాతృభాష
కామెంట్‌లు