సత్యవాక్కు;- సి.హెచ్.ప్రతాప్
 సత్యాన్నాస్తి పరోధర్మ : అనే ఒక శాస్త్ర వాక్కు యావత్ మానవాళికి ప్రామాణికం . సత్యమనే విద్యుత్ ధర్మం అనే తీగ ద్వారా శాంతి అనే బల్బులో ప్రవేశించి ప్రేమ అనే కాంతిని వెలిసిస్తుంది అని భగవాన్ బాబా వారు సత్య వాక్కు యొక్క ప్రామాణికత గురించి అత్యద్భుతంగా చెప్పారు. సత్యమే విశ్వవ్యాఒపకమైన ఆత్మసక్తి. సత్యాన్ని ఆలంబనగా చేసుకోకపోతే మన జీవితాలు సంసార సముద్రంలో చుక్కాని లేని నావ లాగ గంయం లేకుండా అటూ ఇటూ తిరుగుతూ వుంటాయి.  కాబట్టి మనందరం అజ్ఞానంతో ఆవరింపబడిన ఆత్మను సత్యజ్ఞానంతో శోధించి, సాధించి దివ్యాత్మ స్వరూపులం కావాలి.
అసత్యం పలకడం అశౌచఅంతో సమానం అని శాస్త్రం చెబుతొంది. అసత్యవాది మాటలకు సమాజంలో ప్రామాణికత ఉండదు. వినయపూర్వక సత్య వచనాలు పలకడం వల్ల ఆనందమే కాకుండా వాక్కుకు రాణింపు, కార్యసిద్ధి కలుగుతాయి.
సత్యవాక్కు కామధేనువు లాంటిది. అది కీర్తిని, గౌరవాన్ని ఇస్తుంది. శత్రువులను తరిమేస్తుంది. కాబట్టి సత్యవాక్కును పలకడం జీవితంలో భాగం చేసుకోవాలి. అబద్ధం చెప్పడం, ఇచ్చినమాట  తప్పడం, పరుష పదజాలం ఉపయోగించడం, వాక్కు అశౌచం కావడానికి కారణం అవుతాయి అని ఉత్తర రామచరితంలో భవభూతి పేర్కొన్నాడు. కాబట్టి ప్రయత్న పూర్వకంగా అయినా ప్రియవాక్కులు పలకడం అలవాటు చేసుకోవాలి. సాధన క్రమంలో వాక్కుకు శుద్ధి కలుగుతుంది.పురాణులైన ,ఆద్యులైన వాల్మీకి వ్యాస వశిష్టాది మహర్షుల నోట వచ్చే మాటలన్నీ కూడా -సత్యములే అవుతాయి. 'ఋషయః సత్యవచసః 'అని శాస్త్రం. ఆ ఋషుల వాక్కులని అనుసరించే వారి భావాలు లోకానికి హితం చేస్తాయి. ఋషుల నోటినుంచి వచ్చిన పలుకులను -అర్ధం అనుసరిస్తుంది. దానివల్ల తప్పనిసరిగా ఆ మాటలు నిజం అవుతాయి. ఋషులు సత్య వాక్కులు క్రాంతదర్శనులు కనుక వారాడిన మాటల వెంట అర్ధం తనంత తానుగా వెంటపరిగెత్తుకొని వస్తుంది. వేయి అశ్వమేధయాగాలు, ఒక సత్య వాక్కు ఈ రెంటినీ త్రాసులో పెట్టి తూచితే సత్య వచనమే బరువు. తీర్థయాత్రల వల్లా, వేదాధ్యయనం వల్ల వచ్చే పుణ్యం నిత్య సత్యవ్రతం అనుష్ఠించే వాని పుణ్యానికి సాటిరావు. సత్యమే పరబ్రహ్మ స్వరూపం.
సత్య వాక్కు కలిగి వుండటమే కాదు. సజ్జనులతో గోష్టి చేయాలి. ఎవరైనా మనవద్దకు ఏదైనా ఆశతో దేనినైనా అభ్యర్థించడానికి వస్తే, వారి అభ్యర్థనలను తోసిపుచ్చకూడదు. మనకు సాధ్యమైనంతలో వారి కోర్కెలను తీర్చే ప్రయత్నం చేయాలి.

కామెంట్‌లు