సునంద భాషితం -వురిమళ్ల సునంద, ఖమ్మం
 ]న్యాయాలు -414
అర్థ లౌకిక న్యాయము
******
అర్థము అనగా సగము, శబ్దార్థము , కారణము, ధనము, ప్రయోజనము, న్యాయము వస్తువు అనే అర్థాలు కలవు.లౌకికము అనగా ప్రాపంచికమైన, సాధారణమైన, దైనందినపు అనే అర్థాలు ఉన్నాయి.
లౌకికము యొక్క శబ్దార్థము లోకానికి, లోకాలకు సంబంధించినదనీ అవి అటు ఏడు,ఇటు ఏడు లోకాలను గురించి చెబుతుందని మన పెద్దలు అంటుంటారు.
అంతే కాదు అలౌకికమైన అనగా ప్రాపంచికము కాని, లోక సాధారణము కాని, అసాధారణమైన, అరుదైన, సైద్ధాంతికమైన వేదాదుల గురించిన విషయ పరిజ్ఞానం కావాలంటే లౌకిక గ్రంథముల వలననే  గ్రహించవలసి వుంటుందని కూడా చెప్పారు.
ముందుగా లౌకికము అంటే ఏమిటో చూద్దాం.,..లౌకికము అంటే లోకానికి సంబంధించినది.అనగా ప్రాపంచిక విషయాలకు సంబంధించినది.భౌతిక ప్రపంచం గురించి ఆలోచించడం. ప్రాపంచిక విషయాల అనుభవం,పరిశీలనతో వ్యాఖ్యానించడం, వివరించడం మొదలైనవి. అలాగే  ఈ ప్రపంచంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో,ఎవరితో ఎట్లా మసులుకోవాలో మొదలైన విషయాలను తెలుసుకోవడం కూడా లౌకికమే.అయితే అలా తెలుసుకొని ఆ విధంగా మసలుకోవడమే లౌకిక జ్ఞానం.అనగా బ్రతకడానికి కావలసిన జ్ఞానం అన్న మాట.
 ఇక లౌకిక తత్వం గురించి కూడా తెలుసుకుందాం.
మన దేశాన్ని లౌకిక రాజ్యం అని అంటారని మనందరికీ తెలిసిందే.బహు మతాలు,భిన్న సంస్కృతులు, భాషలకు నిలయం మన భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.
మన దేశంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో "లౌకిక తత్వం" అనే పదాన్ని పొందుపరిచారు.
ఈ విధంగా భారత రాజ్యాంగ ఆత్మ, హృదయంగా పరిగణించే ప్రవేశికలో లౌకికం అని చేర్చడం,ప్రతి వ్యక్తికి ఆరాధన, విశ్వాసం, నమ్మకం అనే అంశాలలో స్వేచ్ఛను గుర్తించడం "లౌకిక తత్వానికి" ప్రతీకగా చెప్పుకోవచ్చు.
 అయితే ఈ లౌకిక తత్వం,లౌకిక జ్ఞానంతోనే  కొందరు అలౌకికమైన, పారమార్థికమైన జ్ఞానమును పొందుటకు ప్రయత్నిస్తూ ఉంటారు అదెలానో తెలుసుకుందాం .
లౌకిక విషయాలను అలౌకింగా మార్చే వ్యాపారాలు ఐదు ఉన్నాయని ఆధ్యాత్మిక వాదులు చెబుతుంటారు.అవి సాధారణ,చర్వణ, స్పందన,,భావన,వ్యంజిన అనేవి అలౌకిక వ్యాపారములు అని వేలూరి శివరామ శాస్త్రి గారు వీటి గురించి వివరించారు.
అంతే కాదు లౌకికంతో  ముడిపడిన లలిత కళల సౌందర్యం అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుందని సౌందర్యోపాసకులు చెప్పడమే కాదు  అవి మనకు కూడా అనుభవమే.
ఈ విధంగా "అర్థ లౌకిక న్యాయము" ద్వారా మరో అర్థం భాగమైన అలౌకిక ఆనందాన్ని గురించి కొంత తెలుసుకోగలిగాం.
 లౌకిక తత్వం, లౌకిక జ్ఞానంతో మనం ఈ సమాజంలో  ఎవరినీ నొప్పించకుండా శాంతియుతంగా జీవిస్తూ అలౌకికమైన ఆనందాన్ని స్వంతం చేసుకుందాం.మరి మీరేమంటారు?
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు