సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -397
ఆమోద షట్పద న్యాయము
****
ఆమోద అనగా బహుదూరము వ్యాపించు పరిమళము, వాసన,సంతోషము అనే అర్థాలు ఉన్నాయి.షట్పద అనగా తుమ్మెద,భ్రమరము,పద్మబంధువు,పుష్పకీటము, భృంగకము అనే అర్థాలు ఉన్నాయి.
ఆమోద షట్పద అనగా వాసనను బట్టి తుమ్మెద ఎంత దూరంలో ఉన్నప్పటికీ పువ్వు ఉన్న చోటును గుర్తిస్తుంది అని అర్థము.
తుమ్మెద అనగానే ముందుగా మనకు 'జోరుమీదున్నావు తుమ్మెద',"పాండవులు పాండవులు తుమ్మెద", "తుమ్మెద ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా"లాంటి సినిమా పాటలు," రావె రావె నల్ల తుమ్మెదా, కొత్త పంట వచ్చింది తుమ్మెదా" అనే జానపద కళారూపాలు గుర్తుకు వస్తాయి.అలాగే 13వ శతాబ్దంలోనే  పాల్కురికి సోమనాథుడు తుమ్మెద పదములను రాశాడని కూడా చదువుకున్నాం.
 అలా  కవుల, జనాల నోళ్ళలో నానిన తుమ్మెద ఎంతో చిన్నగా ఉన్నప్పటికీ దానికి ఉన్న  సహజ గుణం ఏమిటంటే, ఎంతో దూరంలో ఉన్న పువ్వు యొక్క సువాసనను గుర్తుపట్టే శక్తి వుండటం.
 
మరి దానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామా.. .
తుమ్మెద అనేది ప్రపంచంలో అనేక ప్రాంతాలలో కనిపించే ఒక చిన్న కీటకం.ఇది ఎంతో మనోహరమైన కీటకం.దీనిని చంచరీకము అని కూడా అంటారు.ఇది చీకటిలో వెలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది.చిన్న నిప్పురవ్వలా కనిపిస్తుంది.అందుకే వాటిని గ్లోవార్ములు అని పిలుస్తారు.ఇవి రాత్రి పూట తమ సహజ లక్షణమైన కాంతిని పొందుతాయి.
మనం పగటి పూట వీటిని సరిగా గమనించలేము.ఎందుకంటే అవి పొడవైన గడ్డిలో దాక్కుంటాయి.
ఇవి సమశీతోష్ణ మరియు ఉష్ణ మండల వాతావరణంలో కనిపిస్తాయి.అలాగే చిత్తడి నేలల్లో లేదా తడి,చెట్లతో కూడిన ప్రదేశాలలో నివసిస్తాయి. పురాతన కాలంలోనే ఈ తుమ్మెదలు మానవుడి దృష్టిని ఆకర్షించాయి.
 వీటిల్లో  ఒక రకమైన తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు కూడా రంధ్రాలు చేయగలదు.అలాగే చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రాలు చేసి అందులో నివసిస్తూ తన పిల్లలను పెంచుతుంది.
అలాంటి తుమ్మెద మకరందాన్ని గ్రోలడం కోసం పూల వాసన పసిగట్టి ఎంతో దూరం ప్రయాణం చేసి పువ్వులు ఉన్న చోటికి వెళుతుంది.
అయితే ఒకోసారి సాయంత్రం సమయంలో తామరపువ్వుపై మకరందం కోసం తుమ్మెద వాలినప్పుడు తామరపువ్వు రెక్కలు ముడుచుకుంటాయి. దాంతో తుమ్మెద తనను ఎవరో బంధించారని భయపడి పోయి ఆ రెక్కల్లో  ఇరుక్కుని పోతుంది.ఊపిరాడక చనిపోతుంది.
 మహా వృక్షాలకు, మొద్దులకు సైతం రంధ్రాలు చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న తుమ్మెద సున్నితమైన తామర పువ్వు రెక్కల్లో ఇరుక్కుని చనిపోవడం చిత్రం కదా!
మన పెద్దవాళ్ళు ఈ "ఆమోద షట్పద న్యాయము"ను ఎందుకు సృష్టించి వుంటారో మన మానవ జీవితానికి అన్వయించి ఎందుకు  చెప్పారో చూద్దాం.
ఈ న్యాయమును రెండు రకాలుగా చూడాల్సి వుంటుంది.
ఏదైనా సమస్య తలెత్తగానే ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని బెంబేలెత్తి పోవడం,నిరాశా నిస్పృహలకు లోనవడంతో వ్యక్తిలో ఉన్న శక్తి సామర్థ్యాలకు సంబంధించిన మానసిక ధైర్యం, నమ్మకం క్షీణించిపోతుంది.ఇక ఇందులోంచి బయట పడలేననే భావం తుమ్మెదను ఆ తామర పువ్వు రేకులనుండి బయటికి రానివ్వకుండా, ప్రయత్నం చేయకుండా ఆపేసినట్లు మనిషి కూడా అందులో చిక్కుకుని మరణం పాలవుతాడు.
ఇక మరో కోణంలో చూస్తే తుమ్మెద మకరందాన్ని గ్రోలుతూ ఆ మత్తులో అలాగే వుండిపోవడం. సాయంత్రం అవడంతో పువ్వు ముడుచుకుని అందులో  చిక్కుకున్న తుమ్మెద అనుకుంటుంది.  ఎలాగూ తెల్లవారుతుంది.పువ్వు మరల విచ్చుకుంటుంది.అప్పుడు బయటపడవచ్చునని.  బయటికి వచ్చేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా అందులోనే వుండిపోతుంది.
కానీ దురదృష్టవశాత్తు అక్కడికి వచ్చిన ఓ ఏనుగు ఆ తామరపువ్వు తూడులతో సహా పెరికి చిందరవందరగా చేస్తుంది. దాంతో తుమ్మెద ఉన్న తామరపువ్వు కూడా విరిగిపోతుంది.ఇక తామరపువ్వు విచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. అంటే  వ్యక్తిలో కూడా తనకు ఏం కాదనే  అతి నమ్మకమే ప్రాణం మీదికి తెచ్చిపెడుతుందని అర్థము.
ఇలా ప్రయత్నలేమి,అతి నమ్మకం ఎప్పుడూ వుండకూడదని ఈ "ఆమోద షట్పద న్యాయము" ద్వారా మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయాలు.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు