అక్షరబంధాలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అక్షరాలకు
బీగంవేస్తే
బద్దలుకొడతా
బయటకుతీస్తా

అక్షరాలను
మూటకడితే
ముళ్ళువిప్పుతా
మెరిపిస్తా

అక్షరాలకు
మురికిపూస్తే
కడుగుతా
ముస్తాబుచేస్తా

అక్షరాలను
పారవేస్తే
ఏరుకుంటా
ఎదలోదాచుకుంటా

అక్షరాలను
కట్టేస్తే
సంకెళ్ళుతెంచుతా
స్వేచ్ఛగాతిరుగమంటా

అక్షరాలపై
అపనిందలేస్తే
నోరుమూపిస్తా
నిగ్గుతేలుస్తా

అక్షరాలను
మరువమంటే
ధిక్కరిస్తా
వీలుకాదంటా

అక్షరాలను
వీడమంటే
విననుపొమ్మంటా
వల్లకాదంటా

అక్షరాలతో
పోరాడమంటే
కుదరదంటా
తలలోదాచుకుంటా

అక్షరాలు
ఙ్ఞానమంటా
అంధకారమును
తరిమేస్తాయంటా

అక్షరాలను
సత్యమంటా
నిజాలుతెలుసుకొని
మెలగమంటా

అక్షరాలు
లక్షలతోసమానమంటా
అమూల్యమైనవని
అర్ధంచేసుకోమంటా

అక్షరాలు
ఆలోచనలకురూపమంటా
అద్భుతభావాలను
అందంగాతీర్చిదిద్దమంటా

అక్షరాలు
అలరులంటా
సుగంధాలను
చల్లుతాయంటా

అక్షరాలను
నమ్మమంటా
ఆనందాలను
పొందమంటా

అక్షరాలను
సాహిత్యమంటా
చదువుకొని
సంబరపడమంటా

అక్షరాలు
దేవతలంటా
అనునిత్యమూపూజించమంటా
దశదిశలావ్యాపించమంటా


కామెంట్‌లు