సునంద భాషితం ;- వురిమళ్ల సునంద,ఖమ్మం

 న్యాయాలు -421
ఇంద్రజాల న్యాయము
*****
ఇంద్రజాలం అనగా కనికట్టు విద్య, ఇంద్రుని వల, మాయాజాలం, మోసం, భ్రాంతి మొదలైన అర్థాలు ఉన్నాయి.
ఇంద్రజాలం ఒక అద్భుతమైన కళారూపం.ఇంద్రజాలం గురించి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లోనూ ప్రస్తావించబడింది.భారత దేశం ఒకప్పుడు ఇంద్రజాల భూమిగా ప్రసిద్ధి చెందింది.
 ఇంద్రజాలం అంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమించే విధంగా చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యానికీ,అనందానికీ లోను చేస్తూ వినోదాన్ని పంచే అద్భుతమైన విద్యా ప్రదర్శన.
మరి ఇంద్రజాలాన్ని కూడా మన పెద్దలు ఓ న్యాయంగా  ఎందుకు చెప్పారో చూద్దాం.
 ఏదైనా కార్యాన్ని చక్కబెట్టడానికి, సమస్యను పరిష్కరించడానికి,యుద్ధ  తంత్రంలో ఉపయోగించే  ఉపాయాలలో సామ, దాన,భేద దండోపాయముల గురించి  మనందరికీ తెలుసు.ఐతే వాటితో పాటు మరో మూడు ఉపాయాలు కూడా వున్నాయి.అవే మాయ, ఉపేక్ష, ఇంద్రజాలం.
'సామ' అంటే  తెలుసు కదా!"మంచి మాటలతో కార్యాన్ని సాధించడం. 'దాన' అంటే ఎంతో కొంత దాన రూపంలో ఇచ్చి కార్యాన్ని నెగ్గించుకోవడం.'భేద' అంటే రెండు విషయాల మధ్య భేదాన్ని చూపి మంచి చెడుల విచక్షణ చేయించి సమస్యను పరిష్కరింపజేయడం.ఇక 'దండ' అనగా పై మూడింటితో పని కానప్పుడు బెదిరించి అనుకున్న పనిని సాధించడం.ఇది ఇరువర్గాలలో మరింత కక్షలు కార్పణ్యాలు పెంచేలా  చేస్తుంది.
కాబట్టి ఐదొవది అయిన "మాయ" ను ఉపయోగించి అనగా మాయ మాటలతో ఎదుటి వారిని బురిడీ కొట్టించి అనుకున్న పనిని సాధించడం.ఆరవది "ఉపేక్ష" ఉపేక్షించి సాధించడం.
ఇక ఏడవది చివరి ఉపాయం ఏమిటంటే 'ఇంద్రజాలం'.ఇది ఒక ఆశ్చర్యకరమైన విద్య.మనిషిని భ్రమల్లోకి నెట్టి,ఆ మాయలో  మునిగేలా ఈ విద్యను ప్రదర్శించి అనుకున్నది సాధిస్తూ వుంటారు.
 మరి ఇంద్రజాలం లేదా కనికట్టు విద్య కొత్తగానో  మధ్యలోనో వచ్చింది కాదు. దీని యొక్క సృష్టికర్త ఇంద్రుడు అని మన తాత ముత్తాతల దగ్గర నుంచి ఓ నమ్మకం ఉంది.అంతే కాదు పురాణేతిహాసాల్లో ఈ ప్రస్తావన వుందని ముందే చెప్పుకున్నాం కదా.
ఈ ఇంద్రజాలన్ని లేదా కనికట్టును ఆధ్యాత్మిక దృష్టితో చూసే వారు ఈ జగత్తుకు అన్వయించి చెబుతూ ఈ జగమంతా మాయ, భ్రమ అంటుంటారు.
బౌద్ధ మతంలోని బుద్ధవతాంశక సూత్రంలో ఇంద్రజాలం గురించి కొంత ప్రస్తావన, సమాచారం వుంది. ఇంద్రుని స్వర్గధామానికి దూరంగా అన్ని దిక్కులకు అనంతంగా విస్తరించే విధంగా అద్భుతమైన వల వుందనీ,అదే ఇంద్రుని వల అని  అందులో రాసి వుంది.
 ఈ ఇంద్రజాలాన్ని ఒకప్పుడు పల్లెల్లో సాధనా శూరులు,గారడీ విద్యలు చేసేవారు ప్రదర్శించే వారు. రాన్రానూ వారికి ఆదరణ తగ్గడం, ఆదాయం లేకపోవడం వల్ల ఆ వృత్తిని వదిలి బతుకు తెరువు కోసం ఇతర పనులు చేస్తున్నారు.
మన దేశంలో ప్రముఖ ఇంద్రజాలికులలో పి.సి.సర్కార్,కేలాల్,బి.వి.పట్టాభిరాం,సామల వేణు మొదలైన వారు ముఖ్యులు.
ఇంద్రజాలం కేవలం వినోదం,ఆనందం కోసమే కాదు.మనుషుల్లో,మనసుల్లో ఉన్న అపోహలు, మూఢనమ్మకాలు తొలగించడానికి చక్కగా సహాయపడుతుంది .
నేడు కొంత మంది మాయలు మంత్రాలు, దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పి అమాయకులను మోసం చేసి ధన,మాన ప్రాణాలను సైతం బలి తీసుకోవడం చూస్తున్నాం. అలాంటి వారి ఆట కట్టించడానికి ఈ న్యాయమును సాధనంగా ఉపయోగించుకోవచ్చు.
 ఈ విధంగా "ఇంద్రజాల న్యాయము"ను సమస్యలను పరిష్కరించడానికి, అమాయకులను రక్షించడానికి ఉపయోగ పడేలా చేద్దాం. ఇంద్రజాలం నేర్చుకుని సమాజానికి సేవ చేయాలనుకునే వారికి మన వంతు సహకారం అందిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు