సుప్రభాత కవిత ; - బృంద
వసంతం వాకిలి ముందు
వేంచేసి మురిపించినట్టు
కిరణాల తోరణాలు
గుమ్మాన కట్టినట్టు

నడిరేయి నిదుర రానీయక
ఏడిపించిన కలతలన్నీ
గాలికెగిరే ఊకలాగ
ఎగిరి మాయమైనట్టూ..

కల వరించి కనికరించి
పరవశించిన తలపులు
పరిమళించి సుగంధాలు
చిలకరిస్తూ  పలకరించినట్టూ

చిన్నిపాప నిదురలో 
పకపకా నవ్విన నవ్వుల సడి 
మనసంతా పరచుకుని
ముద్దులు మూటకట్టినట్టూ

ప్రాణమైన ప్రియనేస్తం
అనుకోక కనిపించి
కోటి మెరుపులు కళ్ళ నింపి
వేయి వీణలు ఎదను మోగినట్టూ...

చేజారిన మధుర క్షణాలు
ఎంతో శ్రధ్ధగా సేకరించి 
ఇవిగో నీ సంపద అని
ఎవరో ఒడి నింపినట్టూ

ఆనందమంత దోసిళ్ళతో
దోచి మనసు నింపుకోవాలని
వేచి ఉన్న మదికి ఎదుట
సాకారంగా నిలిచిన వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు