సుప్రభాత కవిత - బృంద
ఆనందం పొంద డానికి ఇంతకన్నా
కారణం అక్కర్లేదు
అందం చిందించడానికి అనువైన
ఉద్యానం అక్కర్లేదు


అమాయకంగా నవ్వుతూ
అరవిరిసిన అరవిందపు
ఆనందం అగుపడితే
అంతరంగమంతా ఆనందమే?

చల్లగాలిని పలకరించి
చందనాలను చిలకరించి
చక్కగా చిక్కని దరహాసాలు
చిందించు చిన్నిచిన్ని సుమాలు

వడలిపోతూ వెడలిపోయే
వన్నె వన్నెల కుసుమాలు
బిడియపడక పంచిపోవా
సడిచేయని  సంతోషాలు!

కాంతిరేఖలు సోకగానే
కనులుతెరచే సోయగాలు
కనులముందు కురిపించే
కమనీయ ఆహ్లాదాలు

విరిసి మురిసే సుమబృందాలు
చిలికి తీసిన మకరందాలు
ఒలకబోసిన తావులన్నీ
పరిమళించే మధువనాలే!

నిష్క్రమించని ఆశలేవో
నిన్ను నడిపే ఇంధనం
నీరసించని హృదయమే
నిన్ను వదలని  నేస్తమంటూ

వస్తున్న వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు