సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

న్యాయాలు -408
అపసారితాగ్ని భూతల న్యాయము
*****
అపసారము అంటే అవసరము,తొలగుట.అగ్ని అంటే నిప్పు ,చిత్ర మూలము. భూతలము అనగా భూమి అనే అర్థాలు ఉన్నాయి.
నిప్పు ఉన్న ప్రదేశంలోంచి నిప్పు తీసివేసినా  అక్కడ ,ఆ స్థలంలో నిప్పు వల్ల కలిగిన వేడి మాత్రం  వెంటనే పోదు.అంటే నిప్పు లక్షణమైన వేడి కొంత సమయం దాకా అలాగే వుంటుంది.
 నిప్పు వల్ల కలిగిన వేడి పోకుండా అక్కడ ఎలా వుందో మనిషికి కూడా పుట్టుకతోనే వచ్చిన కొన్ని సహజ లక్షణాలు వుంటాయి. వాటిని ఎంత మార్చుకోవాలని ప్రయత్నించినా ఫలితం వుండదు అనే అర్థంతో ఈ  "అపసారితాగ్ని భూతల న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 ఒక నిప్పే కాదు పూలలోని సువాసన, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంగువ,చింతకాయ మొదలైనవి ఎన్నో  మన ఎరుకలో కనిపిస్తుంటాయి.
మన చిన్నప్పుడు ఒకటో తరగతిలోనో,రెండో తరగతిలోనో  మనం ఇవి చదువుకున్నాం "ఉడకకే ఉడకకే ఓ ఉల్లిపాయ - నీవెంత ఉడికినా నీ కంపు పోదు, చిమడకే చిమడకే ఓ చింతకాయ - నీవెంత చిమిడినా నీ పులుపు పోదు అంటూ సరదాగా చదువుకునే వాళ్ళం. చిమిడినా,ఉడికినా  వాటి సహజ లక్షణాలను అంత త్వరగా పోగొట్టుకోవని అర్థం.
ఎవరైనా వ్యక్తి మొదట్లో బాగా  బతికి  ఆ తర్వాత చెడిన వాడు వెనుకటి డాబూ దర్పం ప్రదర్శిస్తూ  వుంటే "అబ్బో చింత చచ్చినా పులుపు చావలేదు." మన ఇళ్ళల్లోని పెద్ద వాళ్ళు అనుకోవడం పరిపాటి.
 ఇలాంటివి మంచి లక్షణాలైనా చెడు లక్షణాలైనా ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి.
భర్తృహరి నీతి శతకంలోని ఓ శ్లోకానికి సామానార్థకంలో ఏనుగు లక్ష్మణ కవి రచించిన తెలుగు అనువాదాన్ని చూద్దామా...
 
"అసమాన ప్రియ నీతివర్తనము ప్రాణాంతరంబునందున్ మలీ/మనమగ్రాహ్య మదుష్ట యాచన మనం పత్రార్థనా భావమున్/ వ్యసనాస్తిని ధైర్యముం బుజనాంత్యతానుకూలత్వమీ/యసిధారా వ్రత చర్య యెవ్వడు మహార్యశ్రేణికిం దెల్పెనో..."
అనగా న్యాయమైన నడవడికనే అనుసరించడం, ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైనప్పటికీ చెడ్డ పనులు చేయకుండా వుండటం.ఏ విషయంలోనూ నీచులను ప్రారైథించకుండా వుండటం.డబ్బు లేని పరిస్థితి వచ్చినప్పుడు ప్రాణ స్నేహితుడినైనా యాచించకుండా వుండటం.ఆపదలు మీద పడినప్పుడు ధైర్యంగా వుండటం. మహనీయుల బాటను అనుసరించడం అనేవి అసిధారా వ్రతాల్లాంటి విషయాలు.ఇవి సజ్జనులైన వారిలో సహజంగా వుండే లక్షణాలు.
అలాగే సుమతీ శతక కర్త కూడా సహజ సిద్ధమైన లక్షణాలు ఎలా వుంటాయో ఈ పద్యంలో వివరించాడు చూద్దామా.
"ఉత్తమ గుణములు నీచున/కెత్తెరగున గలుగ నేర్చు?నెయ్యెడలం దా/ నెత్తిచ్చి కరగ బోసిన/ నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ!"
అనగా గొప్ప వారికి మంచి గుణాలు సహజంగానే అలవడతాయి.అల్పులు ఎంత ప్రయత్నించినా ఆ గుణాలు వారికి అలవడవు.ఇత్తడి గొప్పదని భావించి, విలువ వచ్చేలా చేయాలనే ఆలోచనతో దానిని కరిగించి అచ్చుగా పోసినా అది బంగారు కాలేదు. అలాగే ఈ భూమి మీద దుష్ట స్వభావం కలిగి వున్న వ్యక్తికి ఉత్తమ గుణాలు ఏ విధంగా అలవాటు చేసుకోవడం సాధ్యమవుతుంది.ఏ ప్రాంతంలోనైనా దానిని కరిగించి,ద్రవ రూపంలో అచ్చులో పోసినా అది ఇత్తడే అవుతుంది కానీ బంగారం అవుతుందా? కాలేదు కదా!"
ఇక్కడ మనం గమనించినట్లైతే ఇత్తడి, బంగారం చూడటానికి రెండూ ఒకే విధంగా ఉంటాయి.కానీ బంగారానికి ఉన్న విలువ ఇత్తడికి లేదు.రాదు.అలా మంచివారికున్న సంస్కారం చెడు గుణాలు కలిగిన వున్న వారికి కలుగదు అని అర్థము.
 అలా "అపసారితాగ్ని భూత న్యాయము"ను  మంచి చెడు లక్షణాలు కలిగిన వ్యక్తులతో పోల్చి చెప్పడం జరిగింది.
 కాబట్టి  మనలోని మానవీయ విలువలు సంస్కారం, సహృదయతను ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదులుకో కూడదు.వాటిని సహజ భూషణాలుగా ధరిద్దాం  సమాజంలో  గౌరవాన్ని  పొందుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
 

కామెంట్‌లు