సుప్రభాత కవిత ; - బృంద
చీకటిని కిరణాలతో కోస్తూ
జగతికి అభయం ఇస్తూ
ప్రాగ్దిశకు కాంతిప్రభల
ప్రకాశం ప్రసరింపచేసే ప్రభాతం
అనుపమం

మౌన యామినికి సెలవిస్తూ
నిశ్శబ్ద విస్ఫోటనంలా
శిఖరాల ధనువు కురిపించు
మయూఖాల శరపరంపర
అద్భుతం

గగన వేదిక పై 
అరుణ వర్ణ శోభలతో
జలతారు పరదాల వలె
జలదాల జిలిబిలి గమనం
అమోఘం

జీవగతికి చైతన్యమిస్తూ
అవనికి అనుగ్రహంగా
ఆహార నీరములిచ్చి
ఆరోగ్య ప్రదాతగా కాపాడు తీరు
అమూల్యం

తాను కదలక ఉంటూ
కదులుతున్న  భూమికి
కదులుతున్నట్టు అనిపించి
కదిలించి కథ నడిపించు క్రీడ
అద్వితీయం

ఆశలు తీరని ఆవేదననూ
అన్నీ తెలిసిన వేదాంతాన్నీ
ఏమీ తెలియని అజ్ఞానాన్నీ
ఒకేతీరున చూసే  మాయ
అనన్యం

అపురూపమైన 
అద్భుతమైన
అరుణోదయానికి
అంజలి ఘటిస్తూ..

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు