సునంద భాషితం- ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -402
ఆదర్శ మలిన న్యాయము
******
ఆదర్శము అనగా అద్దము, టీక, అనుకరింపదగిన పరమోత్కృష్టమైన స్థితి, వ్రాయబడిన దాని మాతృక, మాదిరి అనే అర్థాలు ఉన్నాయి. మలినము అనగా మాసినది, నల్లనిది, మిరియాలు,దూషితము అనే అర్థాలు ఉన్నాయి.
 ఆదర్శ మలినము అనగా అద్దమునకు పట్టిన మకిల,మలినము( దుమ్ము, ధూళి).
ఈ మకిలను చాలా తేలికగా తొలగించుకోవచ్చు. అదేం ప్రత్యేకమైన, చెప్పుకోదగిన విషయం ఏమీ కాదు. కానీ మరి ఎందుకు మన పెద్దలు దీనిని కూడా ఓ న్యాయంగా చెప్పారనేది  ఆలోచించాలి.
 అనగా ఇక్కడ మన మనసును అద్దంతో పోల్చినప్పుడు మనసుపై అనేక రకాలైన మాయా పొరలు, వ్యామోహాలు, రాగద్వేషాల వంటి మలినాలు  అంటుకుని మనల్ని మనకూ, ఇతరులకు స్పష్టంగా కానరానీయదు. కాబట్టి అలాంటి మలినాలు ఏమైనా ఉంటే తక్షణమే వాటిని తొలగించేందుకు ప్రయత్నం చేయాలి. అది ఇందులోని అంతరార్థం.
వివరాల్లోకి వెళితే....
 మనం భౌతికంగా అద్దం ముందు నిలబడితే మన చిత్రం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.కానీ దాని ఉపరితలం మురికిగా,మలినంగా వుంటే కనిపించే చిత్రంలో స్పష్టత వుండదు.
ముఖంలో దుమ్ము లేదా మలినము వుంటే అద్దంలో చూసుకుని అద్దాన్ని తుడిస్తే ముఖము మీది మలినము పోదు కదా!
 మనసు అనే అద్దం ద్వారానే అంతరాత్మ కనిపిస్తుంది కానీ మనసు  కామం, దురాశ, కోపం,గర్వం, అసూయ మరియు భ్రాంతి అనే చెత్త మరియు దుమ్ముతో నిండి వుండటం వల్ల మనం అద్దంలో చూసుకుంటే కనబడేది చెత్త మరియు దుమ్ము మాత్రమే.మనసు కాదు.
మరి అది తొలగించుకోవాలనే ప్రయత్నం చేయనంత కాలం మనల్ని మనం స్పష్టంగా చూసుకోలేము.మరి దానిని శుభ్రం చేసుకోవాలంటే ఏం చేయాలో  శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెబుతున్నాడు.
"జీవునికి మూడు స్థాయిల కవచాలు వుంటాయి. వాటి వల్ల స్వచ్చమైన స్పృహ అనేది అస్పష్టంగా వుంటుంది.మానసిక దర్పణం భౌతిక ధూళితో కప్పబడి ఉంటుంది. కాబట్టి దానిని శుభ్రం చేసుకోవాలి.అప్పుడే అద్దంలో అసలు ముఖాన్ని  స్పష్టంగా చూడగలం" అంటారు.
శరీరాన్ని శుభ్రం చేయడానికి సబ్బును ఉపయోగిస్తాం. మరి మనసనే అద్దాన్ని శుభ్రం చేసుకోవడానికి జపం, ఆధ్యాత్మిక శుద్ధి, ప్రక్షాళన అనే మూడు దశలు అవసరం అంటారు ఆధ్యాత్మిక వాదులు.
మనస్సు అద్దం యొక్క ప్రక్షాళన లేదా శుద్ధి అనేది మనస్సు యొక్క నిశ్శబ్దం దాని సంచారం యొక్క అంతిమ ఉత్కృష్టత తప్ప మరొకటి కాదు.
ఇలాంటి స్థితులతో కూడిన మనసును 'నియంత్రిత మనస్సు, జయించిన మనస్సు,జ్ఞానోదయమైన మనస్సు, స్వచ్ఛమైన మనస్సు అనే పేర్లతో పిలుస్తారు.
మరి ఈ మనసులో రావాల్సింది ఏమిటంటే ఆలోచనా రహిత స్థితి, ఆధ్యాత్మిక నిశ్శబ్దం, పరిపూర్ణత,సహజమైన సమ స్థితి, స్వచ్ఛమైన అవగాహన, స్వీయ  సాక్షాత్కారం ,ముక్తి మొదలైనవి.ఇవి వచ్చినప్పుడే  మనస్సు తనను తాను జ్యోతి స్వరూపంగా చూసుకోగలదు.
అప్పుడే రాత్రి చీకటి తొలగిపోయి వెలుగు రేఖలు వచ్చినట్లు మన మనసు స్పష్టంగా  కనిపిస్తుంది.
ఈ సందర్భంగా ఒక మాట చెప్పుకోవాలి. కొంతమంది మనసును మాయ చేయాలని మభ్య పెట్టాలని చూస్తుంటారు. కానీ మనసు అద్దం లాంటిదనీ, ఎలాంటి వివక్ష లేకుండా ప్రతిదీ ప్రతిబింబిస్తుందని తెలుసుకోరు.
అందుకే అలా మభ్య పెట్టుకుని మనసుకు మలినాలు అంటించుకునే వాళ్ళను ఉద్దేశించి ప్రజాకవి వేమన ఇలా అంటాడు.
"అంతరంగ మందు నపరాధములు చేసి/మంచివాని వలెనె మనుజుడుండు/యితరులెరుగకున్న నీశ్వరుడెరుగడా?/విశ్వధాభిరామ వినురవేమ!"
మనసును మోసం చేసి భ్రమ అనే మలినాలను కప్పి అనేక అపరాధాలను చేసే వ్యక్తి ఎవరూ చూడటం లేదని అనుకుంటాడు.ఈ విషయాన్ని ఎవరూ చూడకున్నా , మరెవ్వరూ గ్రహించలేక పోయినా ఈశ్వరుడు అనే వాడు తప్పకుండా గుర్తిస్తాడని అంటాడు.అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈశ్వరుడు అంటే మన అంతరాత్మే. అంతరాత్మ ఎప్పుడూ తప్పు, ఒప్పులను గమనిస్తూ వుంటుంది .తప్పులను ఖండిస్తూ అలా చేయకూడదని హెచ్చరిస్తూనే వుంటుంది.
ఇదండీ "ఆదర్శ మలిన న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసింది.ముఖం మీద మలినాలను శుభ్రం చేసుకున్నట్లు మనం మన మనసునూ శుభ్రం చేసుకుని విలువల జ్యోతి స్వరూపమై సమాజానికి ఉపయోగపడే విధంగా ఆదర్శంగా వెలుగుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు