కలియుగ ధర్మం - సి.హెచ్.ప్రతాప్

 యుగాల్లో ఆఖరిది కలియుగం. దీని కాలపరిమితి 4 లక్షల 32 వేల సంవత్సరాలు. అందులో సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ , బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంధమైన సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వ శఖం 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని భావిస్తారు. నాలుగు యుగాలలో, కలియుగం అత్యంత భయంకరమైనది. ఈ యుగం అన్ని కష్టాలను ఇస్తుంది అని మన ప్రాచీన గ్రంధాలు చెబుతున్నాయి. ఈ యుగంలో ధర్మకార్యాలు మందగించి అధర్మం ఉచ్ఛస్థితిలో ఉంటుంది. న్యాయం మరియు ధర్మం వెనక్కి నెట్టబడతాయి.అన్ని రకాల పాపాలను చేయడానికి మానవులు వెనుకంజ వేయరు. ధర్మం అనేదే ఒక అంటరాని పదంగా వాడబడుతుంది.మానవులలో స్వార్ధకాంక్ష హెచ్చవుతుంది. నరులలో పవిత్రత నశిస్తున్నది. పుణ్యము అంటే పవిత్రకర్మ అని. పవిత్రకర్మలు లేనివారై ప్రతివారూ దురాచారములయందు రతులై ఉంటారు. ఏవి సత్యములో ఆ మాటలపట్ల విముఖత్వం కలిగి ఉంటారు.ఈ యుగంలో వావి-వరుసలు ఉండవు, వర్ణబేధం ఉండదు, దొంగలే దొరలవుతారు, దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరుగుతాయి. స్త్రీని, ధనాన్ని పొందినవాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి. వర్ణద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతారు. ఈ కలియుగంలో మంచి అనే మాటకి చోటు లేకుండా అధర్మం వైపే అడుగులేస్తారు. ఈ అధర్మం పెరిగిపోయినప్పుడే శ్రీ మహావిష్ణువు కల్కిరూపంలో అవతరించి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతోంది.
ద్వాపరయుగం ముగిశాక కలియుగం ఆవిర్భవించడం గురించి ఋషులు, సాధువులు ఆందోళన చెందారు. ఈ కలియుగంలో ఎంత కష్టంగా ఉంటుందో అడగడానికి వారు వేదవ్యాస మహర్షి వద్దకు వెళ్లారు. వారి మనస్సులను చదివి, వారు ఏమి అడుగుతారో ఊహించి, వేదవ్యాసుడు స్వయంగా విరుద్ధమైన సమాధానం ఇచ్చాడు - కలియుగంలో మోక్షాన్ని పొందడం చాలా సులభం. ఋషులు చాలా వరకు ఊహించిన దానికి విరుద్ధంగా జరిగిన సమాధానంతో మూగబోయారు.  
కామెంట్‌లు