కొడిగట్టిన దీపం లా ప్రభుత్వ విద్య;- సి.హెచ్.ప్రతాప్

 ప్రభుత్వ పాఠశాల విద్య అంటే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అంతంతమాత్రంగానే బోధిస్తున్నారని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా లక్షలాది రూపాయల నిధులు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతులు పెంపొందించడంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తకొత్త విద్యా విధానాలను ప్రవేశపెడుతున్నప్పటికీ ప్రజల్లో దీనిపై ఆసక్తి క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకావడం లేదు.
ప్రాథమిక విద్యారంగాన్ని సముద్ధరించాలన్న సంకల్పం రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాల నుంచీ గట్టిగా వినవస్తున్నా, ప్రభుత్వ పాఠశాలలో  దశాబ్దాల తరబడి తిష్ఠ వేసిన మౌలిక సమస్యలు ఈ ఏడాదీ వెంటాడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 28 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 37 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ చదువులు వానా కాలం చదువులుగా సాగుతున్నాయనడం లో సందేహం లేదు. రాశిలో తప్ప వాసిలో ఎంతో వెనుకబడిన దృశ్యమే మన విద్యా వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతున్నది. ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ శిక్షణను మెరుగుపర్చడం, పిల్లల్ని కేంద్రీకృత బోధన వైపు మళ్లించడంలో సంస్థాగత లోపాలు అనేకం.  ప్రైవేటు పాఠశాలల్లో నాల్గవ వంతు సీట్లను పేదపిల్లల కోసం కేటాయించాలనే నిబంధన అమలు కావడంలేదు.  ప్రైవేటు స్కూళ్లలో చదివే పేద పిల్లలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా సరిగ్గా అమలు కావడంలేదు. ఆఖరుకు పేద పిల్ల కోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పధకం కూడా లోపభూయిష్టం గా అమలవుతోంది. ప్రభుత్వ బడులలోని దుస్థితి చూసి పేద వారు కూడా అప్పో సొప్పో చేసి ప్రైవెట్ స్కూళ్ళవైపు మొగ్గు చూపడం నిజంగా బాధాకరం. ఈ ప్రైవేటు చదువుల జాడ్యం వల్లే పర్యావరణ, మానవీయ, సామాజిక, భాషాశాస్త్ర అధ్యయ నాలు మంటకలిసిపోతున్నాయన్న అంశాన్ని మరువరాదు.
విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, ఉచితంగా నిర్బంధంగా నాణ్యమైన విద్యను అందించాలనే రాజ్యాంగ విధానం నేడు అమలు జరగడం లేదు. గత కొన్నేళ్ళుగా ప్రభుత్వాలకు ప్రభుత్వ విద్యారంగాన్ని బతికించుకోవాలనే స్ఫూర్తి, చిత్తశుద్ధి లోపించక సర్కారీ విద్య అష్టకష్టాలు అరకొర వసతులనతో కూనరిల్లుతుంది. పరిస్థితి ఇలా ఉంటే సమాజంలో సామాజిక స్ఫూహా ఆశించడం వృధా ప్రయత్నమే. దానికి తోడు ఎన్నో ఏళ్ళుగా కనీస అవసరాలైన వసతులు, నియామకాలు లేకుండా కాలం వెల్లదీస్తున్నారు. కానీ విద్యావ్యవస్థలో సంవత్సరానికో కొత్త బోధన విధానం తీసుకొచ్చి ప్రభుత్వ విద్యను ప్రయోగ.శాలగా మార్చారు.
కామెంట్‌లు