సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు -419
ఆత్మాశ్రయ న్యాయము
******
ఆత్మ అనగా దేహము, మనస్సు ,పరమాత్మ, బుద్ధి, జీవుడు, ధైర్యము, స్వభావము.ఆశ్రయం అనగా బలవంతుని ఆశ్రయించుట, ఇల్లు, విశ్రాంతి స్థానం, ఆధారము,శరణాలయం, సహాయము,సంబంధము,సమీపము అనే అర్థాలు ఉన్నాయి .
కేవలము హిందూ మతములోనే కాదు.ప్రతి మత గ్రంథంలోనూ ఆత్మ అనే పదాన్ని గురించి  చెప్ఫడం చూస్తుంటాం.అలా కొన్ని సంప్రదాయాలలోనూ తరచుగా వాడబడే పదము  కూడా ఆత్మనే.
"నీ ఆత్మ నీకేం చెబుతుంది అంటారు?  తప్పు,ఒప్పుల నిర్ధారణలో నిజాన్ని చెప్పమని అడిగేటప్పుడు "ఆత్మ సాక్షిగా చెప్పు" అంటుంటారు. అలాగే "ఆత్మ గౌరవం పోగొట్టుకోకూడదనీ, ఆత్మ విశ్వాసం ఉండాలనీ, అంతర్ ఆత్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదని" ఇలా సందర్భాల్లో మన పెద్దవాళ్ళు ఈ ఆత్మ అనే పదాన్ని ఉపయోగించడం చూస్తుంటాం. మరి ఆత్మ అనేది కనిపిస్తుందా? అనే ప్రశ్నకు లేదనే చెప్పాలి.తరచుగా వాడబడే ఆత్మ అనే పదము ఒక తాత్త్విక భావము.దీనికి ఆధ్యాత్మిక సంబంధమైన గ్రంథాల్లో రకరకాల వివరణలు ఇవ్వబడ్డాయి. 
ఇక ఆత్మాశ్రయం అనగా తనకు తానే ఆశ్రయమనుకునే లేదా  ఆధారమనుకునే భావన.
అయితే ప్రతి వ్యక్తిలో వుండే అంతరాత్మ  అందరిలోనూ ఒకే విధంగా  ఆలోచిస్తూ వుంటుంది.ధర్మాధర్మాలు,మంచి చెడులు నిర్ణయించే సమయంలో ఓ న్యాయమూర్తిగా వ్యవహరిస్తుంది.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానబోధ చేస్తూ ఆత్మ గురించి అనేక విషయాలు చెబుతాడు.
"ఆత్మ నిత్య సత్యమైనది.చావు లేనిది.సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే,తన లోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే" అని చెబుతాడు.
అలాగే ముండకోపనిషత్తులో  జ్యోతి స్వరూపమైన ఆత్మ ప్రకాశవంతమైనదని, అత్యంత సూక్ష్మమై అంతటా వ్యాపించి సృష్టికి మూలకారణమైనదని చెప్పడం జరిగింది.
ఇలా మతపరంగానూ, తాత్త్విక సంప్రదాయాల్లోనూ ఆత్మ అనేది వ్యక్తియొక్క ఆధ్యాత్మిక , తాత్త్విక పరమైన భావజాలం.ఇందులో వ్యక్తి గుర్తింపు, వ్యక్తిత్వం మరియు జ్ఞాపకాలు వుంటాయి.
అయితే ఒక వ్యక్తికి ఆత్మతో పాటు ఆత్మాశ్రయ భావన అనేది ఉంటుంది.అది అనేకమైన విభిన్న కారకాలచే నిర్ణయించబడుతుంది.
అవేంటో చూద్దాం...
ప్రతి మనిషి సొంత మనసుతో ప్రపంచాన్ని కొత్తగా చేస్తాడు.ప్రపంచం మనిషి ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.అనుభవం నేర్చుకోవడం ,గ్రహించడం ,అనుభూతి చెందడం,నమ్మడం ,ఆశించడం,గ్రహణ శక్తి మొదలైనవన్నీ ఆత్మాశ్రయమైనవే. ఇవి ఎవరికి వారికే ప్రత్యేకంగా వుంటాయి. ఒక వ్యక్తి భావజాలం, ఇతర వ్యక్తి యొక్క భావజాలం తో కలవొచ్చు కలవక పోవచ్చు. అది ఆయా వ్యక్తుల ఆత్మను అనగా మనస్సును బట్టి వుంటుంది.
అయితే సమాజానికి హితవు చేసే విలువలు అన్నీ ఆత్మాశ్రయమైనవే.
 ఎందుకంటే వాటిని వ్యక్తులు ఆచరించడం వల్లనే సమాజం మానవీయ విలువలతో ప్రశాంతంగా ఉంటుంది.అలాంటి సమాజంలో నేరపూరితమైన భావజాలం  పెరగడం కానీ, అలాంటి సంఘటనలు జరగడం కానీ వుండదు.
కాబట్టి విలువలు ఆత్మాశ్రయమైనవి అయినప్పటికీ వాటి ప్రభావం సమాజంపై వుంటుందని మనం అర్థం చేసుకోవచ్చు.
దీనిని సాహిత్య పరంగా చూసినట్లయితే చాలా వరకు కవిత్వంలో ఈ పోకడలు కనబడతాయి.
 కవిత్వం అంతా ఆత్మ శ్రేయమైనదే అంటారు విశ్లేషకులు .ఒక కళాకారుడు ప్రపంచం ఇలా ఉంది అలా ఉందని అంటాడు.తన నమ్మకాన్ని మాత్రమే చెప్పగలడు.
 మనిషి ఆత్మను ఆశ్రయించిన ఆలోచనలు, వ్యూహాలు, నైతికత, మానవీయత మొదలైనవి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని  ప్రతిబింబిస్తూ సమాజంలో ఫలానా వ్యక్తి ఫలానా అని గుర్తింపబడేలా చేస్తాయి.
అందుకే చిన్నప్పటి నుండే పిల్లల్లో మంచి వ్యక్తిత్వం రూపొందించబడేలా విలువలతో కూడిన విద్యను అందించాలి. నైతికత, మానవీయ బంధాల గొప్ప తనం తెలిసేలా చేయాలి. అప్పుడే ఆత్మాశ్రయ భావనలు సరైన రీతిలో దిశానిర్దేశం చేయబడతాయి.
"ఆత్మాశ్రయ న్యాయము" అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. మనమే కాకుండా మన తర్వాత తరాన్ని కూడా మంచి తరంగా తయారు చేయాలంటే మనమంతా చేయి- చేయినే కాదు మనసు- మనసూ కలుపుకుని ముందుకు సాగాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు