సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -403
ఆకాశ భేదన&ఆకాశ ముష్టి హనన న్యాయము
*****
ఆకాశము అంటే నింగి,అంతరిక్షము.భేదనము అనగా ముక్కలు చేయుట,విరుచుట,పంచుట అనే అర్థాలు ఉన్నాయి.ముష్టి అనగా కత్తి పిడి, పిడికిలి, సమృద్ధి,ముసిడి చెట్టు,అభినయ హస్త విశేషము,,బిచ్చము, పిడికెడు గింజలు అనే అర్థాలు ఉన్నాయి.హననము అనగా చంపుట.
ఆకాశమును ఛేదించేందుకు ఎలాంటి సాధనము లేదు.అలాగే ఆకాశమును పిడికిలితో గ్రుద్దుటకు వీలు కాదు. ఇవి రెండూ దాదాపుగా ఒకే అర్థాన్ని కలిగి వున్నాయి.ఇవి రెండూ అసాధ్యాలే. మానవ మాత్రులకే కాదు మరెవరికీ సాధ్యం కావు .
అలాంటి అసాధ్యాలను సాధ్యం చేస్తామని చెప్పేవాళ్ళను నమ్మకూడదని ఈ న్యాయాలలోని అంతరార్థము.
మరి  పనిలో పనిగా మనం నిత్యం చూసే ఆకాశం గురించి నాలుగు విషయాలు తెలుసుకుందాం.
ఇంటి బయట నిలబడి తలెత్తి పైకి చూస్తే నీలిరంగులో కనిపించేదే ఆకాశం.ఎంత దూరం వెళ్ళి చూసినా అదే కనిపిస్తుంది.అనంతమైన ఈ ఆకాశం నీలిరంగులో ఎందుకు కనిపిస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం భూమి ఉపరితలం మీద కొన్ని ఆవరణాలు ఉంటాయి.ఆయా  ఆవరణాలైన మేఘాలు , వాయు మండలము పై సూర్య కిరణాలు పరావర్తనం చెందడం వల్ల నీలిరంగులో కనిపిస్తుంది.అంతే కానీ ఆకాశం నీలిరంగులో ఉండదు.నిజానికి ఆకాశం ఏ రంగులో వుండదు. రాత్రి పూట సూర్య కాంతి లేకపోవడంతో ఆకాశం చీకటిగా కనిపిస్తుంది.అనంతమైన దూరంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తాయి.
అత్యంత ఎత్తైన కట్టడాలను ఆకాశ హార్మ్యాలు అంటుంటారు.ఎంత ఎత్తు కట్టినా అవి ఆకాశాన్ని తాకలేవు.
అయితే మానవ మేధస్సు రీత్యా సాధించిన అనేక అద్భుతాలలో విమానం కనిపెట్టడం ఉపగ్రహాలను తయారు చేసి అంతరిక్షంలోకి పంపడం లాంటివి అన్నీ కూడా శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో.. ఇలా శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో ఎన్నో రకాల పరికరాలను కనిపెట్టి ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలను సాధించాం.
అంతే కానీ ఆకాశాన్ని ముక్కలు చేయడానికి, చీల్చడానికే సాధ్యం కాదు.అలాంటిది  ఆకాశాన్ని ముష్టి ఘాతాలతో చంపడమనేది  సాధ్యం అవుతుందా?  కానే కాదు కదా! అంటే అది ఖచ్చితంగా మూర్ఖత్వంతో కూడిన ప్రేలాపనే.
అలా ఆకాశ ముష్టి హననం చేయలేమనీ ,అందని ఆకాశాన్ని పిడికిలితో తాకలేమనీ,చీల్చి ముక్కలు చేయలేమని తెలిసింది కదా! ఇలా అసాధ్యమైన వాటిని గురించి చెప్పేటప్పుడు, ఎవరైనా ఇలాంటి అసత్యపు మాటలు మాట్లాడినప్పుడు  మన పెద్దలు ఈ రెండు న్యాయాలను ఉదాహరణగా చెబుతుంటారు.
 
మరి ఆకాశాన్ని ఛేదిస్తాననీ, పిడికిలి బిగించి ఆకాశంతో ముష్టి యుద్ధం చేస్తానని ఎవరైనా మాట్లాడిన  వాళ్ళు  అతి మూర్ఖులైనా అయి వుండాలి.లేదా అత్యంత అహంకారులైనా అయివుండాలి... ఈ విషయాలను గమనంలో ఉంచుకోవాలి.
 అంతే కాదు వీటిని లేత లేత సొరకాయ కోతలని కూడా అనవచ్చు.
ఇలాంటివి మన జానపద కళారూపాలలో  "పిట్టల దొర" అంటుంటాడు.అతడు తన పేదరికాన్ని చెప్పకుండానే హాస్యాన్ని అతిశయోక్తులను కలగలిపి చెబుతూ  ఇల్లిల్లూ తిరిగి వాళ్ళు ఇచ్చిన తృణమో పణమో... వాటితో తన జీవితాన్ని గడిపేవాడు.
 
 సత్యదూరాలైన  మాటలను మాట్లాడకూడదనీ. అలా మాట్లాడే వారిని పై విధంగా మూర్ఖులుగానో ,ఇతరుల ముందు గొప్పలు చెప్పుకునే అహంభావులుగానో  అనుకుంటారనీ ఈ "ఆకాశ భేదన "మరియు "ఆకాశ ముష్టి హనన"న్యాయాల ద్వారా మనం తెలుసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు