అంతామనమంచికే..!!------శ్రీమతి సత్యగౌరి.మోగంటి

 పూర్వకాలం నుంచీ మన దేశంలో       ప్రకృతిని,వృక్షాలనీ ,దైవాలుగా భావించి పూజిచడం ఆనవాయితి.ఆయా ప్రదేశాలలోని  వృక్షాలు,       జంతువులు ,స్థావరాలన్నింటినీ పవిత్ర భావనతో భావించడం పూజించడం పరోక్షంగా వాటిని కాపాడటము కొరకే!                                                         ఇది మన భారతదేశ  సంస్కృతి -జ్ఞానాన్ని, దూరదృష్టిని,సుసంస్కారాన్ని ,తెలియజేస్తోంది.
ఒకప్పుడు మనం ప్రకృతి మాతను పూజిస్తే ఇప్పుడు మనం ప్రకృతిని కబళించడానికి
చూస్తున్నాం.
సూర్యారాధన.-రథసప్తమి సంగతి చూద్దాం.
"సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌!!’’
చిన్నప్పుడు రథసప్తమి పండుగను చాలా ఇష్టపడేవాళ్లం.
ముందు రోజు చిక్కుడు పాదుని చిక్కుడు కాయలు,చిక్కుడు ఆకులు,స్కూలు నుండి వచ్చే దారిలోనో ఎక్కడో అక్కడ వెదికి జిల్లేడు ఆకులు,రేగు పళ్లు,ఇవన్నీ తేవడం జరిగేది.
మర్నాడు ఉదయాన్నే లేవడం,తలారా స్నానం చేయడం,
పెరట్లో వాకిట్లో తులసి కోట దగ్గర శుభ్రంగా కడిగి ముగ్గులు వేయడం,అలంకరించడం,
కుంపటి కడిగి అందులో బొగ్గులు,ఆవు పిడకలు(ఏరు పిడకలంటారు) వేసి అంటించి
ఇత్తడి గిన్నెకు పసుపు రాసి అందులో ఆవు పాలు పోసి నానబెట్టిన కొత్త బియ్యంతో,కొత్త బెల్లంతో పరమాన్నం చేయడం.
ఆ పరమాన్నాన్ని చెరుకు గడతో
కలియబెట్టడం. 
అబ్బ ఆ పరమాన్నం రుచి జన్మలో మరచిపోలేము.
ఇత్తడి గిన్నెలో అడుగంటిన పరమాన్నానికి
ముందే పోటీ. 
తులసి కోట దగ్గర రథం ముగ్గు వేసి,కాయలతో కొబ్బరి పుల్లలతో రథం చేసి,చక్రాలుకి కొబ్బరి పుచ్చులు అంటే కొబ్బరి పిందెలు (రాలినవి)పెట్టేవాళ్లం.
ఈ ఆనందం అంతా ఒక ఎత్తైతే..
ఎందుకు పూజించాలో అమ్మ,అమ్మమ్మ చెప్పే కబుర్లు ఇంకా బావుండేవి.
ఈరోజు తరిగిన కూర తినకూడదు,నూనె వాడకూడదు.
అందుకే వంకాయ కాల్చి పచ్చడి,పచ్చి పులుసు తింటారు.
ఆ కుంపటి మీదే పప్పు కూడా వండటం.
భలే రుచిగా ఉంటుంది కుంపటి,పొయ్యి మీద వంట.
ఇవన్నీ ఆరోగ్యప్రదమే కదా.
చిన్నప్పుడు అమ్మను "అమ్మా మనం సూర్యుణ్ణి
ఎందుకు పూజించాలమ్మా ?"అంటే 
"సూర్యుడు లేకుండా మనుషులే కాదు చెట్లు చేమలూ  బ్రతకగలవా!బతకలేము.
అందుకే పూజించాలి" అనేది సింపుల్ గా.
భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నాయాంటె అందుకు కారణం సూర్యుడే.                                                  అందుకే భాస్కరుని కనిపించే దేవుడు అని అంటారు.                                                  హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది.                  
కాబట్టి సూర్యోపాసన చేస్తే -రుణ,రోగ, శత్రుబాధలు నశిస్తాయి.సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ 'డి' లభిస్తుంది.
అందుకే పిల్లలను పుట్టినప్పుడే ఆరు నెలలు వచ్చేవరకూ ,ఉదయాన్నే బయటకు వచ్చి ,సూర్య కిరణాలు తగిలేలా ఒడిలో కూర్చోబెట్టుకుంటాము. 
సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి.                                              అందుకే వైదిక వాజ్మయం,సంధ్యావందనం, సూర్యనమస్కారాలు,ఆర్ఘ్యప్రధానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది.
సూర్యుని పూజించడం పక్కకు పెడితే
ఆదిత్యుడు ఈ సృష్టికి అమూల్యమైన సందేశం  కూడా ఇస్తాడు.                         సూర్యోదయం,సూర్యాస్తమయం క్రమశిక్షణకు నిదర్శనం.సమస్యలు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకూడదనీ కష్టం తరువాత సుఖం  ఉంటుందనీ చీకటి వెంటే వెలుగూ వస్తుందనీ అంతవరకూ ఎదురుచూడాలనీ తన గమనం ద్వారా  మనకో సందేశ ఇస్తున్నట్టే.
పూజ ఒకటే కాదు అందులో ఉన్న ఆరోగ్య సూత్రాలు ముఖ్యం అని గమనించాలి మరి!
                            ***

కామెంట్‌లు