సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -406
ఆరఘట్టఘటీ న్యాయము
******
ఆరఘట్టము అనగా నూతి గిలక, ఏతాము.ఘటీ అనగా  చిన్న కూజా,24 నిముషాల కాలము.
ఏతమునకు కట్టిన బాన లేదా కుండ క్రిందికి పోవుచు పైకి లేస్తూ వుంటుంది. ఇలా వృద్ధి క్షయములు,కలిమి లేములు,కష్ట సుఖాలు మొదలైనవి వస్తా పోతా వుంటాయనే అర్థం వచ్చేలా చెప్పడానికి ఈ "ఆరఘట్ఠ ఘటీ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 మధ్య వయస్సు గల వారికి ఏతం అంటే చాలా వరకు తెలిసే వుంటుంది.అడవిలోని బావుల్లో నీరు తోడటానికి ఈ ఏతం లేదా మోటను ఉపయోగించే వారు.
విద్యుత్ లేని కాలంలో పంట పొలాలకు నీటిని పారించేందుకు కొన్ని సాధనాలు  వుండేవి.అందులో మోట, ఏతం,దోకెన ,గుల్ల మొదలైనవి.
వీటిల్లో మోట బొక్కెన అనగా పెద్ద ఇనుప బాన లాంటిది రెండు వైపులా తెరిచి వుంటుంది.పైవైపు వెడల్పుగా కింది వైపు అడుగు తీసేసిన కుండలా వుండేది.దానికి తోలు తిత్తి గొట్టం అతికేసి కుట్టే వాళ్ళు. పైభాగం బొక్కెనలా పెద్ద తాడు కట్టి మోటగిలక మీద తిరిగేలా అమర్చే వారు.
 ఆ తాడు చివర్లో రెండు వైపులా ఎద్దులను కాడికి బిగించే వాళ్ళు.ఎద్దులు వెనక్కి వెళ్ళినప్పుడు మోట బొక్కెన నీళ్ళలోకి పోయి అందులోకి నీళ్ళు చేరేవి.ఆ ఎద్దులు ముందుకు నడిచినప్పుడు ఆ నీళ్ళు పైకి వచ్చి కాలువలో పారేవి. వాటిని పొలాలకు మళ్ళించే వారు.
ఇదంతా ఎందుకంటే ఆలా నీరు నిండడం వృద్ధితో పోల్చడం అనగా కలిమి లేదా సంపద కలిగి వుండటం అన్న మాట.ఇక నీళ్ళు లేక ఖాళీగా ఉండటమంటే  సంపద లేకపోవడానికి గుర్తు.
 ఇలా మనిషి జీవితంలో  కలిమి లేములు, కావడి కుండలు అంటారు.ఇలా వృద్ధి క్షయములు అనేవి వెలుగు నీడలు,కష్ట సుఖాలు వస్తూ పోతూ వుంటాయి.ఇవన్నీ ఏవి శాశ్వతంగా ఉండవు అని చెప్పేందుకు  మన పెద్దలు ఈ "ఆరఘట్ఠ ఘటీ న్యాయము "ను  సృష్టించారు.
ఇలా రోజులో రాత్రి పగలు రెండూ వుంటాయి.రాత్రి కష్టానికి, పగలు సుఖానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.
 నార్ల వారు కూడా ఇదే విషయాన్ని పద్యంలో చెప్పారు.
'ఎండ వెనుకె వాన నిండు హర్షము నిచ్చు/ రేయి వెనుక పగలు హాయినిచ్చు/ బాధ వెనుకె సుఖము బహుళమై చెలగురా/ వాస్తవమ్ము నార్ల వారి మాట!"
"అంటే ఎండాకాలం తర్వాత కురిసిన వానను తొలకరి అంటారు.అసలు అలాంటి  వాన ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.రాత్రి తర్వాత వచ్చే పగలు కూడా అంతే హాయిని కలిగిస్తుంది.అలాగే కష్టాల తర్వాత కలిగే సుఖం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది'' అని భావము.
ఇలా "ఆరఘట్ఠ ఘటీ న్యాయము"  చెప్పేది ఏమిటంటే మనిషి జీవితంలో అన్నీ వస్తూ పోతూ వుంటాయి. కాబట్టి బాగా డబ్బు ఉన్నప్పుడు కన్నూ మిన్ను కానకుండా ప్రవర్తించ కూడదనీ, అవి లేనప్పుడు కృంగి పోవద్దు- మంచిరోజులు వస్తాయని చెప్పడమే ఈ న్యాయం యొక్క ఉద్దేశం.
కాబట్టి   జీవన ప్రయాణంలో ఇవన్నీ సహజమమని గుండె దిటవు చేసుకుని  సాగిపోవాలి.



కామెంట్‌లు