మద్యపాన నిషేధం తక్షణ కర్తవ్యం- సి.హెచ్.ప్రతాప్

 ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో విడుదల చేసిన ‘ఆల్కహాల్ అండ్ హెల్త్ ఆన్ గ్లోబల్ స్టేట్ రిపోర్టు’ ప్రకారం భారత దేశంలో 2016 సంవత్సరంలో మద్యానికి అలవాటుపడి అనారోగ్యం పాలుగావడం, మద్యం సేవించిన మైకంలో ప్రమాదాల బారినబడి 30 లక్షల మంది చనిపోవడం ఆందోళనకరం.  మద్యం విక్రయాలలో రెండు తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తం గా 6,7 స్థానాలలో వుండి బోలెడు అప్రతిష్టను పోగుచేసుకున్నాయి.మద్యం కారణం గా ఏటా ఆరు లక్షల కుటుంబాలు పేదరికం లోకి జారిపోతున్నాయి. జాతీయ నేర గణాంకాల బ్యూరో గణాంకాల ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న హత్యలు, మానభంగాలు వంటి హ్యేయమైన నేరాలలో 75 శాతం మద్యం ప్రభావం లోనే జరుగుతున్నాయి. 2006-16 మధ్య మద్యం అలవాటుకు బానిసైన వారిలో 70 శాతం యువతే వున్నారు. తొలుత సరదా కోసమో, కాలక్షేపం కోసమో అలవాటుపడిన మద్యం ప్రియులు, దానికి బానిసలై తమ జీవితాలను కోల్పోతున్నారు. ఇప్పటికే మిజోరం, కేరళ, గుజరాత్, బిహార్, నాగాలాండ్‌లలో మద్యనిషేధం అమలులో ఉంది. మద్యం విక్రయాలను అరికట్టడానికి ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు విశేషమైన కృషి చేసాయి. వాటిని స్పూర్తిగా తీసుకొని, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంపూర్ణ మద్య పాన నిషేధం దిశగా తక్షణం చర్యలు చేపట్టాలి. ఖజానాకొచ్చే డబ్బు సంగతి చూడకుండా, ప్రజల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, నేరాల నియంత్రం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన సమయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకొని ముందడుగు వేయడం ఎంతో అవసరం.
కామెంట్‌లు