- సుప్రభాత కవిత బృంద
చీకటి అలమిన పొరల
దిగులొకవైపు
వెలుతురు కనపడి వెలుగుకై
వెదికే పొర లొకవైపు

పొగమంచు కప్పిన
మమతల పొరలొకవైపు
సెగతగిలి కరిగే కలలంటి
పొరలొకవైపు

దిగంతాలకు సాగిన చూపు
అనంతమైన ఆశల రూపు
ఆద్యంతం అనూహ్యంగా
సుఖాంతమవనున్న రేపు

ఏడు అశ్వాల రథమెక్కి
ఏడు శిఖరాలు దాటేసి
ఏడు వర్ణాల హరివింటి వెలుగు
గూడు ముంగిట వాలేనా?

తోడు తానై ఉంటాననీ
నీడ నీకు నేనేననీ
పీడలేవీ దరికి రానివ్వననీ
కడదాక చేయి వీడననీ

ఆశ వీడక సాగమనీ
శ్వాస నీకు ధ్యేయమనీ
ధ్యాస తప్పక ఉంచమనీ
దశ తానే మారుననీ 

అంచెలంచలుగ వెలుగు చిమ్ముతూ
అచలాలకు అందం అద్దుతూ
అభయమిస్తూ ఆగమించే
అందమైన అరుణోదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు