స్వరస్మరణీయుడు ఘంటసాల


 గాన గంధర్వునిగా, తెలుగు సంగీత స్వరాల రారాజు ఘంటసాల వెంకటేశ్వరరావు ఘనమైన గాత్రాన్ని అందజేసి పాటసారులకు మిక్కిలి మార్గదర్శిగా నిలిచారని రాజాం ఘంటసాల సంగీత కళాశాల అధినేత, సంగీత కళానిధి మంతపూడి ప్రసాదరావు అన్నారు. 
ఘంటసాల ఏభయ్యో వర్ధంతి సందర్భంగా స్వరనీరాజనం కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ ఘంటసాల రాగాలాపనలతో తన జీవితాన్ని అంకితం చేసారని అన్నారు. 
తొలుత న్యాయవాది, రంగస్థల కళాకారులు మెట్ట దామోదరరావు జ్యోతి ప్రజ్వలన చేసారు. సాంఘిక నాటక నంది పురస్కార గ్రహీత శాసపు సత్యనారాయణ ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఘంటసాల పాటల పోటీలలో కెంబూరు తిరుపతిరావు, కుదమ తిరుమలరావు, తెలుగు శ్రీనివాసరావు, మెహర్ తరుణ్ లు విజేతలుగా నిలిచారు. పాలకొండ సంగీత సమాఖ్య అధినేత బౌరోతు మల్లేశ్వరరావు, రాజాం కళాసాగర్ సంఘం అధ్యక్షులు ఎం.దామోదరరావులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు ముఖ్య అతిథి పద్మశ్రీ యడ్ల గోపాలరావు, విశిష్ట అతిథి బి.వి.అచ్యుతకుమార్, గౌరవ అతిథి కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ ల చేతులమీదుగా బహుమతులను అందజేసారు. ప్రసాద్ ఆర్కెస్ట్రా సంగీత విభావరిలో టీవీ కళాకారులు మల్లాన ఆదియ్యను ప్రత్యేక సత్కరించారు. ఘంటసాల స్వరనీరాజనంలో ప్రసాద్ ఆర్కెస్ట్రా గాయకులతో పాటు ఎస్.సత్యన్నారాయణ, ఎస్.వెంకటరమణ, బొంతు సూర్యనారాయణ, బంగారు దుర్గాప్రసాద్, తామాడ గోవిందం, కె.తిరుపతిరావు, కె.తిరుమలరావు,  టి.శ్రీనివాసరావు, ఎం.తరుణ్,  కరణం శంకరరావు తదితరులు పాల్గొని ఘంటసాల గీతాలను ఆలపించి సభికులను రంజింపజేసారు.
కామెంట్‌లు