సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -401
అర్థ త్యాగ సుఖ న్యాయము
*****
అర్థము అంటే శబ్దార్థము, కారణము, ధనము, ప్రయోజనము, న్యాయము,వస్తువు అనే అర్థాలు ఉన్నాయి.త్యాగము అంటే ఈవి, విడుపు అనే అర్థాలు ఉన్నాయి.
అర్థ త్యాగము అంటే  ధనము, సంపాదన మొదలైన వాటిని వదిలిపెట్టుట వల్ల  సుఖం కలుగుతుంది అని ఒక అర్థము. ధనం ఖర్చు చేసి సుఖాలను పొందవచ్చు అని మరొక అర్థం.
ఇలా రెండు విధాలుగా  అనగా శ్లేషార్థముతో  మన పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
మరి ధనముతో అన్ని సుఖ,సౌఖ్యాలను పొందవచ్చా? ధనము బాగా ఉన్నవాళ్లు ఈ సుఖ సౌఖ్యాలను పొందుతూ సంతోషంగా ఉన్నారా? అనేది చర్చించుకుందాం.
ఈ చర్చకు ముందు ప్రముఖ కవి సినీ గేయ రచయిత ఉత్పల సత్యనారాయణ ఆచార్య గారు 'ధనము ఉన్న వ్యక్తి కంటే ధనము లేని వ్యక్తే ధన్యుడు'అని రాసిన పద్యాన్ని చూద్దామా...
"ధనము ధనాభిమానము సదా ధనతృష్ణయు మూడు దోషముల్/ధనికున కందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్/ధనికుని కంటె పేద కడు ధన్యుడు,యాతని తృష్ణ సజ్జనా/ప్తిని శమియించు వేంకటపతీ!అఖిలాండపతీ! శ్రియఃపతీ!"
ధనము ధనముపై అభిమానమూ, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరికా అనే మూడు దోషాలూ, ధనవంతుడికి వుంటాయి.కాని పేదవాడికి అందులో ధనము అనే దోషము ఉండదు. పేదవాడికి ధనాశ ఉన్నప్పటికీ మంచివారికి దగ్గరగా వుండటం వల్ల అతడిలో ఆ ధనాశ పోతుంది. కాబట్టి ధనికుడి కంటే పేదవాడే ధన్యుడు అని భావము.
అంటే మరీ ఎక్కువగా కాకపోయినా సరిపడినంత ధనం వుండి ఎలాంటి ఆశ, అత్యాశకు పోని వ్యక్తి  ప్రశాంతమైన జీవితం గడుపుతాడు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
ధనం పెరిగే కొద్దీ సుఖవంతమైన సౌకర్యాలను సమకూర్చుకో వచ్చేమో కాని సుఖాలను, సంతోషాలను ధనముతోనే పొందుతారు అనేది మాత్రం నిజం కాదు.ఎందుకంటే సంపాదన పెరిగే కొద్దీ దానిని దాచే దగ్గర నుండి కుటుంబ ,బంధుమిత్రుల నుండి సమస్యలు ఎదుర్కునే వారిని, మానసిక ఒత్తిడికి గురైన వారిని మన చుట్టూ సమాజంలో ఉన్న కొందరిని చూస్తూనే ఉన్నాం.
ధనం వుండటం వల్లనో దానిని ఖర్చు చేయడం వల్లనో సుఖాలు పొందడం అనేది నూటికి కోటికి ఎవరో  కొందరికి మాత్రమే అలా సాధ్యమవుతుంది.
మరలాగని జీవిత అవసరాలకు కావలసిన ధన సంపాదనను పూర్తిగా వదిలేస్తే.. అలాంటి వ్యక్తులు గాని , కుటుంబాలు  గాని ఎలాంటి యిబ్బందులు ఎదుర్కొంటారో వేరే చెప్పక్కర్లేదు.
మరి అంతో ఇంతో ధనము వుంటేనే అనుకున్నవి సాధించుకోగలుతారు.అవసరాలు తీర్చుకోగలుగుతారు. మంచి మనసున్న వారైతే తమ దగ్గర ఉన్న ధనముతో ఇతరులకు సహాయం చేసి ఆత్మ సంతృప్తిని పొందగలుగుతారు.
 కాబట్టి  సన్యాసి అయితే తప్ప ధనం అవసరం లేదని పూర్తిగా త్యాగం చేసి ఆనందంగా ఉండగలడేమో కాని  అసలు ధనమే లేకుండా ఏ వ్యక్తి అయినా సుఖంగా వుంటాడనటం  అవాస్తవం.
 మొత్తం మీద ఈ "అర్థ త్యాగ న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే... జీవనభృతికి అవసరమైన ధన సంపాదనను పూర్తిగా వదిలిపెట్టకూడదనీ, అవసరాలకు మించి ఉన్న ధనముతో సుఖాలను పొందుతామనుకోవడం భ్రమ అని అర్థము చేసుకోవాలి.
పై రెండు విషయాలకు మధ్యే మార్గంగా జీవించాలి .అంతకు మించిన ఉత్తమమైన జీవనం ఇంకొకటి లేదు అనేది ఈ న్యాయం ద్వారా మనం గ్రహించవలసిన నీతి సూత్రం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు