చెదలు పట్టి పోతున్న మన విద్యా రంగం;- సి.హెచ్.ప్రతాప్

 ప్రభుత్వాలు విద్యారంగం అభివృద్ధి కోసం వందల కోట్లు ఏటా ఖర్చు చేస్తున్నాయి అయినా  ప్రభుత్వ బడులలో ఎప్పటిలాగనే అనేక సమస్యలు తిష్టవేసుకొని కూర్చున్నాయి.ప్రభుత్వ పాఠశాలలలో సౌకర్యాలను మెరుగుపరిచి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చి దిద్దుతామన్న విద్యాశాఖ ప్రకటనలు కేవలం నీటి మీద రాతలుగా మారిపోయాయి.  పాఠశాలల తీరు ముఖ్యంగా ప్రైవేటు బడుల పద్ధతి మారలేదు. పిల్లలపై పుస్తకాల బరువు తగ్గడం లేదు. తల్లిదండ్రులకు ఫీజుల మోత ఆగడం లేదు.  ఈ విద్యా సంవత్సరం నుండి పిల్లల పుస్తకాల బ్యాగుల మోతను తగ్గించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలుచేస్తామని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఘనం గా ప్రకటించాయి కాని ఆచరణలో  యధారాజా తధా ప్రజా అన్న చందాన వుంది. పసి పిల్లల నుండి కేజీల కొద్దీ బరువులను స్కూళ్ళు యజమాన్యం మోయిస్తోంది. ఆటపాటలతో  హాయిగా సాగాల్సిన బాల్యం లో స్పెషల్ క్లాసులు,ప్రోజెక్టులు, స్పెషల్ స్టడీ అవర్స్ అంటూ కె జి నుండి రోజుకు పన్నెండు గంటల పాటు చదువు పేరిట విధ్యార్ధులను చిత్రహింసలకు గురి చేస్తున్నారు.  ఎల్ కె జి లో  అడ్మిషన్ కోసం లక్ష రూపాయలు వసూలు చేస్తున్నా ఇదేమని ప్రశ్నించే నాధుడే లేడు.తల్లిదండ్రులు కూడా తమ పిల్లల అవస్థను గమనించకుండా ఎన్ని లక్షలు కడితే అది అంత మంచి స్కూలని, ఎంత బరువు మోస్తే, ఎన్ని గంటలు చదివితే అంత బాగా చదువు వస్తుందన్న భ్రమలో బ్రతుకుతూ ప్రైవేట్  స్కూళ్ళ యజమాన్యానికి వంత పాడుతున్నారు. పుస్తకాల అధిక బరువు బాలల శారీరక ఎదుగుదల మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది అన్న నిపుణుల హెచ్చరికలు బేఖాతరు అవుతున్నాయి.మాతృభాషలో విద్యా బోధన అటుంచి వాటి స్థానం లో ఫెంచి, లాటిన్, జర్మన్ వంటి విదేశీ భాషలను యధేచ్చగా ప్రోత్సహిస్తున్నా తల్లిదండ్రులకు చీమ కుట్టినట్లయినా లేకపోవడం బాధాకరం. కేంద్రీయ విద్యాలయాలలో తప్పితే విద్యా హక్కు చట్టం ఎక్కడా అమలుకాకపోవడం గమనార్హం.
కామెంట్‌లు