ఇతరులను హేళన చేస్తే : సరికొండ శ్రీనివాసరాజు
 శ్రావణి 9వ తరగతి చదువుతున్నది. చాలా చురుకైన అమ్మాయి. కానీ చాలా రోజుల నుంచి శ్రావణి దిగులుగా ఉంటుంది. అమ్మా నాన్నలు కారణం అడిగితే ఏమీ చెప్పడం లేదు. "ఏమీ లేదులే!^ అంటుంది. శ్రావణి అన్నం కూడా సరిగా తినడం లేదు. మోర్కులు తగ్గుతున్నాయి. ఒకరోజు శ్రావణి వాళ్ల తాతయ్య చుట్టపు చూపుగా వచ్చాడు. విషయం తెలిసింది.
     తాతయ్య శ్రావణిని పిలిచాడు. దిగులుకు కారణం చెపితే పరిష్కారం చూపుతా అన్నాడు. తాను చాలా పొట్టిగా ఉన్నానని అందరూ తనను హేళన చేస్తున్నారు అని, రోజు రోజుకూ హేళనలు శ్రుతి మించుతున్నాయి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. తాతయ్య శ్రావణి కన్నీరు తుడిచి, ఒక కథ చెపుతా నినమన్నాడు.
      "ఒక అడవిలో మామిడి చెట్టు ఉంది. అది పూత పూసి, కాయలు కాయడం మొదలు పెట్టింది. తన కాయలను చూసుకొని తానే మురిసి పోతుంది. సమీపంలో ఉన్న తుమ్మచెట్టును చూసి ఛీ అంటూ హేళన చేయడం మొదలు పెట్టింది. "నల్లని ఆకారం ఒంటి నిండా ముండ్లు తప్ప ఏముంది నీలో. నిన్ను ఎవరూ పట్టించుకోరు." అంటూ హేళనగా నవ్వింది మామిడి చెట్టు.తుమ్మచెట్టు పట్టించుకోలేదు. కొన్నాళ్లు గడిచాయి. తుమ్మచెట్టుకు చాలా గిజిగాడు పక్షులు గూళ్లు కట్టి నివాసం ఉంటున్నాయి. ఆ సమీపానికి వచ్చిన చాలామంది గిజిగాడు పక్షులను అవి పెట్టిన గూళ్లను ఆసక్తిగా చూస్తున్నారు. "ముద్దు ముద్దుగా బంగారు రంగులో చూడ ముచ్చటగా ఉన్న ఈ బుల్లి పక్షులు ఇంత పెద్ద ముచ్చటైన గూళ్లను ఎలా కట్టాయి అన్నయ్యా!" అన్నది వాణి. "అదే ఈ సృష్టిలోని వింత. తాము చాలా చిన్నగా ఉన్నాము తమ పట్ల ఏమవుతుంది అనుకుంటే ఏమీ కాదు. ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏమీ ఉండదు. రైతులకు ఎంతో ఉపయోగ పడుతుంది. తుమ్మచెట్టు వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి." అంటూ చెబుతున్నాడు వాసు. అక్కడ నుంచి వెళ్తున్న చాలామంది గిజిగాని గూళ్లను, ఆ పక్షులను తదేకంగా చూస్తూ వెళ్తున్నారు. చిట్టి పక్షులైన గిజిగాని గొప్పతనాన్ని తుమ్మచెట్టు విలువను చెప్పుకుంటున్నారు కొందరు. ఆ కాలంలో కాయలు కాయని మామిడి చెట్టును ఎవరూ పట్టించుకోవడం లేదు మామిడి చెట్టుకు బుద్ది వచ్చి, తనను క్షమించమని వేడుకుంది." కథ ముగించాడు తాతయ్య. "అర్థమైంది తాతయ్య". అన్నది శ్రావణి.
     శ్రావణి ఎవరినీ పట్టించుకోక మరింత పట్టుదలతో చదువుతుంది. మార్కులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్రమంగా శ్రావణికి స్నేహితులు పెరిగి, తమకు అర్థం కాని విషయాలు చెప్పించుకుంటున్నారు. ఇంతకాలం శ్రావణికి వ్యతిరేకంగా జట్టును తయారు చేసి, శ్రావణిని హేళన చేయించిన మాలినిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కాలం గడుస్తుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో శ్రావణి అత్యుత్తమ గ్రేడులో ఉత్తీర్ణత సాధించింది. శ్రావణి మూలంగా ఎంతోమంది మంచి గ్రేడులు సాధించారు. మాలిని ఫెయిల్ అయింది.

కామెంట్‌లు