గండం గడిచినవేళ...!!----శ్రీమతి.సత్యగౌరి.మోగంటి.

 మార్గశీర్ష మాసం,మాఘమాసం రెండూ చాలా ప్రత్యేకమైనవి ఆధ్యాత్మికంగా.
నాకు జీవితంలో మరచిపోలేని మాసాలు.
ఎంత వద్దనుకుంటున్నా నాలో  నిక్షిప్తమైన జ్ఞాపకాలు తరంగాలై నన్ను తడుతుంటాయి.
ఈరోజు ఎందుకో మరిమరీ అవన్నీ కళ్లముందు
పదే పదే తిరుగుతున్నాయి. 
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న నానుడి సత్యం.
ఎందుకంటే మాఘ మాసంలో ఒకసారి,మార్గశిర మాసంలో రెండు సార్లు
మరణం అంచుల దాకా వెళ్లి వచ్చాను.
పౌర్ణమి అందునా మాఘ పౌర్ణమి ఎంత విశేషమైనదో కదా.
మాఘమాసం,పున్నమి చంద్రుడు,వెన్నెల, మంచు కురిసే వేళ అందరికీ ఇష్టమే కదూ.
నాకూ అంతే.
నాకు అయిదేళ్ల వయసు.
అందరి పిల్లలానే నాకూ నదులు,సముద్రం,నీళ్లు,ఆటలు, స్త్నానాగలు చాలా ఇష్టం.
ఎస్.రాయవరం కి దగ్గరగా
(వైజాగ్,గురజాడ వారి ఊరు)
వాకపాడు మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్లాము  మా అమ్మ నేను.
మా ఇంట్లో ఆడా మగా,ఇంకా ఊరిలో స్నేహితులు అందరూ కలసి దగ్గరలోని బంగారంపాలెం దగ్గర ఉన్న సముద్రానికి స్త్నానాలకు తెల్లవారఝామున నడచి వెళ్లాము.
దారంతా విపరీతమైన చలి.
పుచ్చపువ్వు లాంటి వెన్నెల.
సుమారు మూడు గంటల సమయం.
సరదాగా అందరి కబుర్లు వింటూ
చాలా సేపు అందరి మధ్యన ఆడుకున్నాను.
స్త్నానానికి అందరితో పాటు సముద్రంలో దిగి స్త్నానం చేస్తున్నాను.
చేతులతో నీటిని తీసి జల్లుకోవడం.
నా చుట్టూ చాలా మందే ఉన్నారు.
ఇంతలో ఓ పెద్ద అల వచ్చి నన్ను లాగేసింది.
అందరూతెల్లబోయి బిక్కమొహం వేశారు.
అందులో ఈత వచ్చిన ఒకరు గబగబా నన్ను పట్టుకుని ఒడ్డుకు పడేశారు.
మృత్యువు అంచు వరకూ వెళ్లి ఈ జీవితం నాకు రాసిపెట్టి ఉందని ఆ పరమేశ్వరుడే ఆయన రూపంలో నన్ను బతికించాడు.
ఆరోజు మా అమ్మ కళ్లల్లో భయాందోళనలు,నేను బ్రతికానన్న ఆనందం ఉక్కిరిబిక్కిరవడం నాకింకా జ్ఞాపకం.
నేను కళ్లు తెరవగానే తన గుండెకు గట్టిగా హత్తుకుంది.
అందుకే ఆ భగవంతునికి ఆజన్మాతం కృతజ్ఞురాలిని.
ఇది తొలి గండం.
----------------------
ఇక మాఘ పూర్ణిమ కి వద్దాము
"న సమం భవితా కించిత్తేజః సౌరేణ తేజసా। 
తద్వత్‌ స్నానేన మాఘస్య నా సమాః క్రతుజాః క్రియాః"
అంటారు.
సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ "మాఘ పూర్ణిమ'' అత్యంత విశేషమైనది. ఈ "మహామాఘి'' శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైనది.  అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేయాలంటారు. 
"నదీనాం సాగరో గతి"
సకల నదీ,నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. అందుకే సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది.ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏంటటే నిత్యం సూర్యకిరణాలవల్ల,ఎంత నీరు ఆవిరి అవుతున్నా సముద్రం పరిమాణం తగ్గదు.అలాగే,ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు.స్థిరత్వం ఆయన ధర్మం.
మాఘమాసంలో సూర్యుడు స్థానం ప్రకారం ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి.ఈ సమయంలో సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత,పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని,వేగంగా ప్రవహించే నీళ్లలో చేస్తే మరింత శ్రేష్ఠమని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం పేర్కొంటున్నారు.
ఇక సంక్రాంతి పండుగ శలవులకి
ఇదే ఊరు వచ్చాము.
నాకు అప్పుడు తొమ్మిదేళ్లు.
మా మేనమామ టీచరు.
సాయంత్రం ఆరు గంటలవుతోంది.
పెద్ద లాంతర్లు రెండు పెట్టుకుని పిల్లల పరీక్ష పేపర్లు దిద్దుతున్నాడు.
నేను పక్కనే మఠం వేసుకుని
కూర్చుని చూస్తున్నాను.
ఇద్దరం నిమగ్నమైపోయాము పనిలో.
ఒక పెద్ద తాచుపాము కనీసం అయిదడుగులుంటుంది.
మా వెనుకే అర్థ చంద్రాకారంలో తిరుగుతూ మాకు ఓ అడుగు దూరంలో ఉంది.
మా మామయ్య చూశాడు దాన్ని.
వెంటనే పేపర్లు శబ్దం లేకుండా కింద పెట్టేసి నా రెక్క పుచ్చుకుని(సన్నగా ఉండేదాన్ని)లాగి నిలబడుతూనే అరుగు మీంచి కిందకి దూకేశాడు.
అదండి ఈసారి మలి గండం ఇలా  గడిచింది.
ముచ్చటగా మూడో సారి.
-----------------------------------
ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాజమండ్రిలో చదువుతున్నా.
సంక్రాంతి పండుగకు స్టూడెంట్ పాస్ మీద సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి మా నాన్నగారి మేనత్త గారి ఊరు తిరుపతి వెళ్లాను.
మా మామయ్య గారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో
ఫిజిక్స్ ప్రొఫెసర్.
మా అమ్మమ్మ కూడా సరదాగా ఉంటారు.
ఆమె వెంకటేశ్వర స్వామి దర్శనానికి తీసుకు వెడతానన్నారు.
చలి మెండుగా ఉండేకాలం. మంచు తెరలు ఒక వైపు, ధనుర్మాస పాశురాలు,భక్తి గీతాలు మరోవైపు .         విశేషాలకు శ్రీకారం చుట్టే మాసం మార్గశీర్ష మాసం.
ఉదయం ఆరుగంటలకు కొండపైకి మా అమ్మమ్మ నేనూ బస్ ఎక్కాము.
బోలెడు కథలు,కబుర్లు చెప్పుకుంటూ వెంకన్న బాబు ధ్యాసలో పడిపోయాము.
ఇంతలో సడన్ గా పెద్ద చప్పుడు.
బస్ ఇష్టమొచ్చిన పరుగు.
అందరూ గోవిందా,గోవిందా అని చేతులెత్తి అరుస్తుంటే ముందు నవ్వొచ్చేసింది.
అంతలో తెలిసింది.
బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని,అది లోయవైపు దూసుకెడుతోందని.
ఎదురు బస్ అద్దంలోంచి కనబడుతోంది.
అమ్మమ్మ నన్ను తన దగ్గరకు భయంభయంగా,ఆత్రుతగా దగ్గరకు తీసుకున్నారు.
నేనూ అప్రయత్నంగా రెండు చేతులూ జోడించి చావు తప్పదని,కళ్లు గట్టిగా  మూసుకుని  ఏడుకొండలవాడా..వెంకట రమణా..గోవిందా...గోవిందా 
అంటూ అరిచాను.
బస్సు రివ్వున తిరిగి,అక్కడే ఉన్న ఓ పెద్ద కొండ లాంటి బండకి
తగిలి ఆగిపోయింది.
కళ్లు తెరవాలంటే భయం.
ఎక్కడుంటామోనని.
అంతలో జనాల గోల,బస్సును వెనుకకు లాగడం,అరుపుల వినబడుతుంటే,కనులు తెరిచా.
నేను అమ్మమ్మ భుజం మీద ఉన్నాను.
బస్ లోయలో పడకుండా బండ ఆగింది.
అంత చలిలో చెమటలు పట్టేశాయి.
మెల్లగా ఒక్కొక్కరం దిగి మరో బస్సు ఎక్కాము.
అలా భగవంతుని దయ వలన మరోసారి గండం గడచిందండి.
ఇంకా ఏమున్నాయో కదా,మరి ఉద్దరించాల్సినవి ఈ భూమి మీద!!
                              ***

కామెంట్‌లు