సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -405
ఆకాశ పరిచ్ఛన్న& పరిచ్ఛిన్న న్యాయము
****
ఆకాశము అంటే నింగి,అంతరిక్షము.పరిచ్ఛన్న అంటే చుట్టబడినది,మూయబడినది,గుడ్డచే కప్పబడినది, వస్త్రములు ధరించిన వాడు,పరిజనముచే నిండినది, కప్పబడి యున్నది అనే అర్థాలు ఉన్నాయి.పరిచ్ఛిన్న అంటే విభజింపబడినది,నిశ్చయింప బడినది అనే అర్థాలు ఉన్నాయి.
ఆకాశమును గురించి రెండు రకాలైన అర్థవంతమైన  న్యాయాలతో చెప్పడం ఇందులోని విశేషం.
అందులో మొదటిది ఆకాశము అనంతమైనది, ఏకమైనది ,పరిచ్ఛన్న మైనది.దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కలు చేయలేమని చెబుతారు.
అనగా ఒక్కో ఊరికో జిల్లాకో,రాష్ట్రానికో,దేశానికో ఆకాశాన్ని విడదీసి పంచలేము అని అర్థము.
దీనినే  బ్రహ్మము, పరబ్రహ్మము, అనంతము,అద్వితీయము అనే భావనతో చెప్పబడింది.
బ్రహ్మము అంటే అన్నింటి కన్నా గొప్పది.దానికంటే గొప్పది మరేదీ లేదో అదే బ్రహ్మము సర్వాధారము.ఆద్యంతములు లేనిది అనే అర్థంతో  ఆకాశం గురించి కూడా చెప్పారు.ఇలా ఆకాశం అనేది విశ్వానికి , దైవానికి సంబంధించినది.
అయితే  ఇక రెండవ న్యాయంలో  ఈ అవిచ్ఛిన్నమైన, అనంతమైన ఆకాశము  కుండలు, పాత్రలు మొదలైన వాటి యందు ప్రతిబింబించి పరిచ్ఛిన్నమై నానాత్వమును పొందుతోందని చెప్పారు.
అంటే ఈ అనంతమైన ఆకాశం  వివిధ పాత్రల్లో ఒదిగిపోయి కనిపిస్తుంది.అలాగే అవనిపైన ఉన్న వివిధ జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశ విదేశాల్లో వారి వారి ఆకాశంగా చెప్పబడుతుందన్న మాట.
ఇలా అవిచ్ఛిన్నంగా భూమిపై ఓ ఛత్రిలా చుట్టబడి వున్ననూ మానవులు ఏర్పాటు చేసుకున్న హద్దులతో విభజింపబడినది.
నిశ్చలంగా ఉన్న చెరువు ఎలాంటి అలజడులు లేకుండా నిశ్శబ్దంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో కనిపించే ఆకాశం యొక్క చెదరని చెరువు నీటిలో స్పష్టంగా కనిపిస్తుంది.అంటే పరిచ్ఛన్నంగా కనిపిస్తుంది.ఆ చెరువులో రాయి విసిరి చూస్తే ప్రశాంతత నశించిన చెరువు నీటిలో అలలు అలలుగా చెదిరి ఆకాశం స్పష్టంగా కనబడకుండా ముక్కలు ముక్కలుగా విభజించబడినట్లు కనిపిస్తుంది.
 అలాగే మన పెద్దలు మనసును ఆకాశంతో పోల్చారు. సమస్యలు కష్టాల వంటివి వచ్చినప్పుడు మనసు ముక్కలైనట్టుగా అనిపిస్తుంది.అంతేకానీ మనసు ముక్కలు కాదు కదా!
 ఇలా మన పెద్దవాళ్ళు మనిషి యొక్క మనసును "ఆకాశ పరిచ్ఛన్న మరియు పరిచ్ఛిన్న న్యాయము"తో  పోల్చి చెప్పారు.
అనంతమైన ఆకాశం లాంటిదే మనసు. ఆ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సదా ప్రయత్నం చేయాలి. ఆకాశంలా వివిధ పాత్రల్లో ఒదిగిపోయినట్లు మనమూ ఒదిగిపోతూ ఎలాంటి అలజడులు లేకుండా గడుపుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు