విజ్ఞాన యాత్రలో ప్రభుత్వ పాఠశాల పిల్లలు


  ప్రాచీన కట్టడాలు, పల్లె ప్రకృతి వనాల సందర్శన
======================================
పాఠ్యపుస్తకాలే కాకుండా ప్రకృతిలోకి వెళ్లి, వివిధ ప్రదేశాలను పరిశీలించి అనేక విషయాలు నేర్చుకోవచ్చని విద్యావేత్తలు చెబుతున్నారు. అందుకే వారు ప్రకృతిలోకి వెళ్లి నేర్చుకోమంటున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన బాల, బాలికలు ఆదివారం విజ్ఞాన, విహార యాత్రలకు వెళ్లారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం (ధర్మాబాద్) లోని చారిత్రక నేపథ్యం కలిగిన పురాతన కట్టడాలను, పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. చోళ రాజులు పరిపాలించిన 400 ఏళ్ల నాటి పురాతన కట్టడాలు, దేవాలయాలు అక్కడ ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ముత్తారం గ్రామ సర్పంచ్ పురాతన కట్టడం చుట్టూ అందమైన, ఆకర్షణీయమైన పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. రకరకాల పూల మొక్కలతో ఆ ప్రాంతాన్ని అద్భుతంగా తయారు చేశారు.  శనివారం కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతిలు పాఠశాల పిల్లల్ని తీసుకొని విజ్ఞాన,  విహారయాత్రకు తీసుకువెళ్లి అక్కడి ప్రకృతి అందాలను పరిశీలింపచేశారు. ప్రాచీన కాలంలో కట్టిన కోటలు, దేవాలయాలను చూపించారు. చారిత్రక నేపథ్యం కలిగిన కోటలు, అందమైన ప్రదేశాలను చూసి పిల్లలు ఆనందోత్సాహాలతో గంతులు వేశారు. ఈర్ల సమ్మయ్య ప్రత్యేక చొరవ తీసుకొని గత 13 ఏళ్లుగా పాఠశాల పిల్లల్ని వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, లక్నవరం చెరువు వంటి ప్రసిద్ధ యాత్ర స్థలాలకు తన సొంత ఖర్చులతో తీసుకెళ్తున్నాడు. పరిశీలన, ప్రత్యక్ష అనుభవం ద్వారా పిల్లలకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆనందోత్సాహాల మధ్య అభ్యసనం జరిగేలా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఉపాధ్యాయినులు విజయలక్ష్మి, సమత, భారతి, విద్యార్థినీ, విద్యార్థులు వంటవారు దంతనపల్లి విజయ, దంతనపల్లి సుశీల, పలువురు పాల్గొన్నారు,
కామెంట్‌లు