సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -420
అధికరణ సిద్ధాంత న్యాయము
***"***
అధికరణము అంటే ఆధారము,ఒక విషయమునకు సంబంధించిన వాదోపవాదములు, న్యాయస్థానము. సిద్ధాంతము అనగా నిర్ణయము.
ఒక సిద్ధాంతము నందు మరొకటి అంతర్భూతమై నుండునట్లు.అనగా ఒక విషయము ఒక విధంగా సిద్ధాంతీకరించుకొని దానిపై మరల ఇంకొక రకముగా ఊహాగానాలు, అపోహలు చేయడం ఈ న్యాయము లోని అంతరార్థం.
సిద్ధాంతము నాలుగు విధములు.అందులో మొదటిది సర్వతంత్ర సిద్ధాంతము.2.ప్రతి తంత్ర సిద్ధాంతము.3.అధికరణ సిద్ధాంతము 4.అభ్యుపగమ సిద్ధాంతము.
మొదటిదైన సర్వతంత్ర సిద్ధాంతము  సర్వసామాన్యముగా అందరికీ వర్తించు నిర్ణయము.
ఇక రెండవదైన ప్రతి తంత్ర  సిద్దాంతం కొందరిచే మాత్రమే ఉపయోగపడే మరియు కొందరికి మాత్రమే వర్తించు నిర్ణయము.
మూడవది అధికరణ సిద్దాంతం : ఇది ఊహలు, అపోహలతో కూడిన విషయాలకు సంబంధించిన నిర్ణయము.
నాల్గవది చివరిది అయిన అభ్యుపగమ సిద్ధాంతం అంటే వ్యతిరేక నిర్ణయాలతో కూడి సవ్యమైన దిశలోకి వచ్చునది. అభ్యుపగమ అంటే నిజము తెలిసికొనుట లేదా తప్పును అంగీకరించటం అని అర్థము.
 అనగా దుష్టుడు, దుర్మార్గుడు అధోగతి పాలవుతారు.అలా కానివారికి మంచి జరుగుతుంది అని అర్థం.
 అసలు ఈ సిద్ధాంతాల గురించి ఎవరు ఏ విధముగా నిర్వచించారో చూద్దాం.
సిద్ధాంతము అనగానే మన పెద్దలచే తరచుగా వాడబడే  "ఎవరి సిద్దాంతం వారిదే"అనే మాట గుర్తుకు వస్తుంది. నిజమే మనుషుల తీరు,సిద్ధాంతాలే కాదు. వివిధ శాస్త్ర విభాగాలలో వివిధ పద్ధతుల ప్రకారం రకరకాల నిర్వచనాలు వున్నాయి.
సాధారణంగా సిద్ధాంతము అనేది ఆలోచన, అభిప్రాయము లేదా ఏదైనా విషయం పట్ల అవగాహనతో కూడిన భావన.అనగా ప్రకృతిలో గల సత్య,అసత్యాల పట్ల తమ తమ అభిప్రాయాలే సిద్ధాంతాలన్న మాట.
ఈ సిద్ధాంతాలు మనం చూసే వాటికి,చేసేవాటికి  సరైన దిశానిర్దేశం చేస్తాయి.
ఇలా ఈ సిద్ధాంతాలు విద్య, విజ్ఞానము,తత్వము, సంగీతము, సాహిత్య,కళా రంగాల్లో కూడా కనిపిస్తాయి.
 ఇలా  నాలుగు రకాలుగా వ్యక్తుల భిన్నమైన అభిప్రాయాలు, ఊహలు ,అవగాహనతో కూడిన నిర్ణయాలు మొదలైన వాటన్నింటిని గురించి చెప్పడమే ఈ "అధికరణ సిద్ధాంత న్యాయము"లోని అసలైన అంతరార్థం.
 ఈ సిద్ధాంతాలు ఏమిటో, నిర్ణయాలు , సూత్రాలు ఏమిటో అని కంగారు పడకండి. 
 సిద్ధాంతాలు ఎన్ని వున్నా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది.ఏదీ గుడ్డిగా నమ్మకుండా ఊహలకు, అపోహలకు తావు ఇవ్వకుండా శాస్త్రీయ నియమాలు,సూత్రాల ఆధారంగా సత్యం , అసత్యాలను తెలుసుకొని సత్య మార్గంలో నడుస్తూ, ఆచరించి చూపడం ముఖ్యం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు