సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -418
అహి కుండల న్యాయము
*****
అహి అనగా, సర్పము ,పాము,వృత్రాసురుడు.కుండలము అనగా పోగులు,గుండ్రన, త్రాడు అనే అర్థాలు ఉన్నాయి.
 అహి కుండలము అనగా పాము గుండ్రంగా,చుట్టలు చుట్టలుగా చుట్టుకుని వుండుట అని అర్థము.
   
చుట్టలు చుట్టలుగా గుండ్రంగా చుట్టుకుని వుండటం అనేది పాము యొక్క స్వాభావిక లక్షణం.
అలాగే మనుషులకు కొన్ని స్వాభావిక లక్షణాలు వుంటాయని చెప్పడమే ఈ "అహి కుండల న్యాయము"లోని ఉద్దేశ్యం.
 పొడవుగా  ఉంటే  వాటిని వేటాడే జంతువుల నుండి రక్షించుకోవడం కష్టమైన పని.అందుకని వేటాడే జంతువుల నుండి తనను రక్షించుకోవడానికి  చుట్టుకొని వుంటుంది. అలా చుట్టుకొని వుండటం పాములకు ఎంతో సురక్షితమైనది. కాబట్టి పాములు తరచుగా గుండ్రంగా చుట్టుకునే వుంటాయి.అలా పాములకు అవి స్వాభావిక లక్షణాలుగా మారాయి.
ఒక్క పాములే కాదు. సృష్టిలో ప్రతి జంతువుకు,చెట్లకు,క్రిమి కీటకాదులకు సైతం తమవైన కొన్ని సహజ లక్షణాలు వుంటాయనేది  మనందరికీ  సుస్పష్టంగా తెలిసిందే.
పాములకున్న బాహ్య లక్షణాలు మరియు అంతర్గత లక్షణాలు ఏవైనా వాటి ఆత్మ రక్షణ కోసం,శత్రు జంతువులపై దాడి చేసేందుకు, వాటి తప్పించుకునేందుకు, ఆహార సంపాదన కోసమే. 
పాములకు ఉన్నట్టే మానవులకు కూడా బాహ్య /భౌతిక , అంతర్గత లక్షణాలు ఉన్నాయి.
 మనిషిని  బాహ్య, భౌతిక లక్షణాల పరంగా చూసినట్లయితే నిటారుగా నిలబడేందుకు వెన్నెముక,శారీరక  నిర్మాణ వ్యవస్థ ప్రత్యేకంగా  వుండి ఇతర జంతువుల నుండి వేరు చేసి  చూపుతుంది.
అదే విధంగా మానవునిలో  భౌతిక లక్షణాలతో పాటు మానవునిలో అంతర్గత లక్షణాలు కూడా ఉన్నాయి
 అంతర్గత లక్షణాలు  ముఖ్యంగా భావోద్వేగాలకు సంబంధించిన లక్షణాలు.ఇవి ఆయా పరిస్థితులు, వివిధ ప్రదేశాలు, సందర్భాలను బట్టి బహిర్గతం అవుతుంటాయి.
 మన పెద్దవాళ్ళు  ప్రకృతిలోని పశు పక్ష్యాదులను ఎంతో నిశితంగా గమనించి, బాగా అధ్యయనం చేసి  వాటిని మానవ జీవితానికి అన్వయించి చెప్పడమనేది మామూలు విషయం కాదు.వారి మేధస్సు అంత గొప్పది.
 ఈ "అహి కుండల న్యాయము"ను  పెద్దలు సృష్టించడంలో ముఖ్యమైన అంతరార్థం.మనుషులు పశు పక్ష్యాదుల్లాంటి వాళ్ళు కాదనీ. మేధస్సుతో నిండిన వారనీ, తమ మేధస్సుతో అద్భుతాలు సృష్టిస్తున్న వాళ్ళని చెప్పారు.

 అంతే కాదు మనిషి లోని అంతర్గత లక్షణాల్లో  జాలి, దయ ఆదరణతో పాటు   భూత దయ, సామాజిక స్పృహ కూడా ఉండాలనీ,అవే మానవుని సహజ లక్షణాలు ఐనప్పుడు  అని సమాజానికి, సమాజాభివృద్ధికి తోడ్పడాలనీ,.అప్పుడే మానవ జన్మ సార్థకం  అవుతుందని చెప్పారు.
కాబట్టి మనలోని మానవతా  హృదయంతో మానవాళికి  సాయం చేద్దాం.మనవైన  మంచి లక్షణాలతో గౌరవం పొందుదాం.
ప్రభాత కిరణాల నమస్కారములతో 🙏


కామెంట్‌లు