సుప్రభాత కవిత ;- బృంద
చూపు అందే  దూరం వరకూ
రూపు ఆనని తీరం వరకూ
మాపులన్నీ మాయం చేస్తూ
కాపు కాచిన రేపు తెచ్చే ఆశలన్నీ 

ఎంత మధురం...!

పుత్తడి రంగులు కొత్తగ పులిమి
పుడమిని మెత్తగ  మేలుకొలిపీ
పచ్చని పట్టు పుట్టము కట్టిన
పకృతి కన్యకు కళలు నింపడం

ఎంత అబ్బురం!

ముద్దుగ రేకులు విప్పుతూ
పొద్దుపొడుపులో కళ్ళు తెరిచి
సద్దులేని సందడి చేసి 
హద్దే లేక ఆనందించే సుమ పరవశం

ఎంత సుందరం!


అంబరాన కాంతిరేఖలు
సంబరాన తొలగించిన
బంగరు జలతారు పరదాల
పొంగిన వర్ణమాలికల సోయగం

ఎంత అద్భుతం!

ఎత్తుగ నిలిచిన శిఖరాల
పొత్తిళ్ళ పూచిన వెలుగుపువ్వు
కత్తులు దూయకనే కిరణాలతో
చిత్తుగ  చీకటిని తరిమే దృశ్యం

ఎంత  అద్భుతం!

బంగరు భానుని కరుణను
వర్షించే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు