సుప్రభాత కవిత ; - బృంద
తలవాకిట వేచి నిలిచిన
తెలిమబ్బుల పల్లకీలో
నులివెచ్చని నవ్వులతో
పలకరింపుగ నవ్వుతూ....

మెరుపులీను కాంతులతో
సప్తవర్ణ మాలికలను
అంబరానికి బహుమతినిస్తూ
సంబరమంతా నీదేనంటూ....

నిదుర పట్టని నిశిలో
వెంటాడే తలపుల్లా
గిరుల చుట్టూ కమ్ముకున్న
హిమశకలాలను కరిగిస్తూ...

చలి వెన్నెలలో తడిసి
పొద్దుపొడుపు ఎపుడెపుడా అని
ఎదురు చూచు లోయలపై
వెచ్చని కిరణాలు ప్రసరింప

మంచున దాగిన మమతలన్నీ
కొంచెం కొంచెంగా బయటపడి
గుండె కరిగి నీరై పోగా
అండ నీవే నంటూ దాసోహమవగా

బండలైనా....వెండికొండలైనా
హిమవన్నగపు లోయలైనా
తరులైనా....నీలగిరులైనా
అరుణోదయపు తరుణాన

కొత్తవెలుగులు విరజిమ్మి
చిత్తమందలి చింతదీర్చి
మత్తు వదిలించి మాయ తీర్చి
హత్తుకుని వెన్నుతట్టే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

 

కామెంట్‌లు