ఆ బడి ఇక ఓ జ్ఞాపకమేనా.....;- ప్రమోద్ ఆవంచ 7013272452
 ఆ రెండు బడులు మేధావులను తయారు చేసిన కర్మగారాలు...అక్కడ దిద్దిన అక్షరపు ముత్యాలతో వేలాది మంది ఉన్నత శిఖరాలను చేరారు...అక్కడ ఓనమాలు దిద్దుకున్న విద్యార్థినీ విద్యార్థులే కాల క్రమంలో ఆ రెండు బళ్లల్లో భోదకులుగా మారారు.అవి నల్లగొండ పట్టణం  రామగిరిలో దశాబ్దాల క్రితం వెలిసిన రామగిరి బాలుర ఉన్నత పాఠశాల ఒకటి అయితే...మరొకటి ఆ పక్కనే ఉన్న బాలికల పాఠశాల... 
తాజాగా ఆ రెండు బడుల మధ్య ఉన్న ఆర్యసమాజం వందేళ్ల పండగను  ఘనంగా నిర్వహించారు.ఆర్య సమాజం నిర్మించిన ఈ రెండు బళ్ళల్లో వేలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసి, చాలా మంది చాలా ప్రాంతాల్లో ఉన్నత స్థాయిలో స్థిర పడ్డారు.ఇక్కడ చదివిన విద్యార్థులలో ఒకరు డి జి పి గా సేవలు అందిస్తే మరొకరు హైదరాబాద్ జిల్లాలో డి యి ఓ గా సేవలందించారు. అమెరికాలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కి సి యి ఓ స్థాయికి ఎదగడానికి ఈ బడే కారణం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది.దశాబ్ద కాలం క్రితం వరకూ నల్లగొండ పట్టణానికి ఐకాన్ గా నిలిచిన రామగిరి బాలికల పాఠశాల మూత పడగ...విద్యార్థులు లేక బాలుర పాఠశాల కుడా మూసి వేతకు రంగం సిద్ధం అయ్యింది...కట్ చేస్తే....
          పులిజాల రంగారావు ఇంటికి ఎదురుగా సీతా రామయ్య అనే న్యాయవాది ఇల్లు ఉండేది.ఆ ఇంటి పక్కనే రామగిరి బాలికల పాఠశాల,అప్పట్లో దోమలపల్లి యాదగిరి రావు ఆర్య సమాజ్ మందిర్ కు డొనేట్ చేసిన ఆరు ఎకరాల స్థలంలో రామగిరి బాల,బాలికల పాఠశాలలు నిర్మాణం చేసారు మొదట  బాలికల పాఠశాల,ఆ తరువాత ఆర్య సమాజ్ మందిర్, దానిని ఆనుకొని బాలుర పాఠశాల.దాని పక్కనే పండిత్ భద్రదేవ్ క్వార్టర్స్,అంటే ఇప్పటి సావర్కర్ విగ్రహం ఎదురుగా. రామగిరి హైస్కూలుకు చిన్న గేటు ఉండేది.లోపలికి వెళ్ళగానే విశాలమైన ప్లే గ్రౌండ్.ఆ గ్రౌండ్ కి సరిహద్దుగా చెరువు కట్ట ఉండేది.ఆ కట్ట భద్రదేవ్ క్వార్టర్స్ నుంచి మొదలై బాల, బాలికల పాఠశాలలను దాటుకుంటూ గొల్లగుడలో ఎండ్ అయ్యేది.గేటు పక్కనే హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్ రూమ్.కట్టను ఆనుకొని అన్ని తరగతి గదులు ఉండేవి.ప్లే గ్రౌండ్ చివర్లో ఉన్న చెరువు కట్ట వెనుక వైపున కోటమ్మ కూరగాయల తోట ఉండేది.
స్కూలును ఆనుకొని పండిత్ భద్రదేవ్ మాత వేదవతిల ఇల్లు,ఆ ఇంటిని ఆనుకుని రెంటల్ క్వార్టర్స్ ఉండేవి.వీళ్ళ 
ఇంటి వెనుక క్రాంతి బాబు బత్తాయి తోట,చింత చెట్ల తోపు ఉండేవి.ఆ తోపును ఆనుకొని కన్నయ్యలాల్ ఇల్లు ఉండేది.చింత తోపు, క్రాంతిబాబు తోట స్థలంలోనే ప్రస్తుత పద్మావతీ కాలనీ నిర్మాణం జరిగింది.భద్రదేవ్ క్వార్టర్స్ ముందు నుంచి పానగల్లుకు వెళ్ళే దారిలో ఈ మధ్య కట్టిన ఫ్లైఓవర్ రాకముందే వెంకటేశ్వర్లు, కోటయ్య సోడా ఫ్యాక్టరీ, ఊర్మిళ పాన్ షాప్,వడ్ల చంద్రయ్య ఇల్లు,నాగమణమ్మ టీచర్ ఇల్లు ఉండేవి. డెబ్భై వ దశకంలో  నోముల సత్యనారాయణ సార్,
జూనియర్ లెక్చరర్ గా,ఆయన సతీమణి రుక్మిణి గారు రామగిరి బాలికల పాఠశాలలో ఇంగ్లీషు టీచర్ గా పనిచేస్తున్నప్పుడు భద్రదేవ్ క్వార్టర్స్ లోనే కిరాయికి ఉండేవారు.అక్కడి నుంచి పానగల్లుకు వెళ్ళే దారిలోకోనారెడ్డి సార్ ఇల్లు,ఆ ఇల్లు దాటగానే సున్నం బట్టి ఉండేది.... కట్ చేస్తే...
              రామగిరి బాలికల పాఠశాలలో అప్పట్లో ఒకటవ తరగతి నుంచి అయిదవ తరగతి వరకు కో- ఎడ్యుకేషన్ ఉండేది.ఆరవ తరగతి నుంచి పక్కనున్న రామగిరి బాయ్స్ స్కూలులో చదివేవారు.బాలికల పాఠశాలకు రామచంద్రా రెడ్డి గారు హెడ్ మాస్టర్ ఉండేవాడు.ఆయన 
కూతురు డాక్టర్ వసుమతి నాలుగు దశాబ్దాలగా నల్గొండ లో ప్రాక్టీస్ చేస్తున్నారు.ఆయన ఇంకో కూతురు అప్పట్లో
గర్ల్స్ జూనియర్ కాలేజీ లో లెక్చరర్ గా పనిచేసే వారు.నోముల సత్యనారాయణ సార్ సతీమణి రుక్మిణి గారుఇంగ్లీష్ టీచర్ గా పనిచేసేవారు.ఆమె రెండు సంవత్సరాలక్రితం కన్ను మూశారు.రుక్మిణి టీచర్ తో పాటు కుముదిని,సుజాత టీచర్లు కూడా అక్కడ పని చేసారు.ప్రైవేట్ స్కూళ్ల దాటికి తట్టుకోలేక, గవర్నమెంట్ స్కూల్ లో పిల్లలు చేరకపోవడంతో రామగిరి బాలికల పాఠశాలను
మూసివేశారు.ఆ స్థలంలో ప్రస్తుతం ఒక ప్రైవేట్ పాఠశాలనడుస్తుంది.బాయ్స్ స్కూలు కూడా మూసివేతకు రంగం సిద్ధం అయ్యింది.
                 రామగిరి బాయ్స్ హై స్కూల్ చరిత్ర పుస్తకంలో మా నాన్న ఆవంచ సీతారామారావు గారికి సంబంధించిన కొన్ని పేజీలు ఉంటాయి.దాదాపు దశాబ్దానికి పైగా ఇంగ్లీషు టీచర్ గా పనిచేసారు.అప్పట్లో అక్కడ చదువుకున్న విద్యార్థులకు మా నాన్నంటే చాలా ఇష్టం.అంతేకాకుండా భయం, భక్తి.చదువు దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు.డెభై దశకంలో మా నాన్న మూడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం రచించారు.దానిని తెలుగు అకాడమీ ప్రచురించింది.అది మా నాన్నకు దక్కిన అరుదైన గౌరవంగా మా కుటుంబ సభ్యులం భావిస్తాం.మా అన్న కూడా అదే స్కూల్లో చదవడం మూలంగా ఉదయం చర్లపల్లి నుండి రిక్షాలో వెళ్ళేవారు.అప్పట్లో మా ఇంట్లో ఉన్న క్యారేజీలో నాలుగు బాక్సులు ఉండేవి.రెండు బాక్సుల్లో అన్నం, మిగితా రెండిట్లో కూర,పెరుగు పెట్టేది అమ్మ.
నాన్న,అన్నయ్య ఇద్దరు రోజూ ఉదయం స్కూలు కు వెళ్లి సాయంత్రం వచ్చే వాళ్ళు.స్కూలు నుంచి హైదరాబాద్ కి ఎక్సకర్షన్ ( విహార యాత్ర) కు తీసుకపోతే నాన్న వెంట వెళ్ళిన జ్ఞాపకం  ..సాలార్ జంగ్ మ్యూజియం,నవత్ పహాడ్, చార్మినార్ గండిపేటలను జీవితంలో మొదటిసారి చూసిన ఆనందం అంతా ఇంతా కాదు.....మా నాన్న కొలీగ్స్ లలో  రాధాకృష్ణ సార్,ఈయన తమ్ముడు రామ
కృష్టయ్య సార్ నాకు చర్లపల్లి ప్రైమరీ స్కూల్ లో మాథెమాటిక్స్ బోధించే వారు.ఆ తరువాత చంద్రమౌళి సార్ ఈయన మా నాన్నకు మంచి మిత్రులు, కృష్టయ్య,కోనారెడ్డి సార్లు కూడా ఉన్నారు.
                           ప్రైవేట్ స్కూల్స్ దాటికి తట్టుకోలేక రామగిరి గర్ల్స్ హై స్కూల్ మూతపడింది.దాని స్థానంలో
ఏదో ప్రైవేటు స్కూల్ నడుస్తుంది.రేపోమాపో బాయ్స్ హై స్కూల్ కూడా మూతపడుతుంది.గర్ల్స్ స్కూలులో చదువుకున్న పూర్వ విద్యార్థినులకు తాము చదివిన, తిరిగిన ఆ నేల,తమ క్లాసు రూములు ఆ సంతోషాలు, టీచర్ కట్టెతో కొడితే బాధతో వచ్చిన కన్నీళ్లు, మార్కులు తక్కువగా వచ్చినప్పుడు అందరి ముందు న్యూన్యతా భావంతో నిలబడిన రోజులు, స్నేహితుల బుజ్జగింపులు,
క్లాసులో క్లెవర్ స్టూడెంట్ తో ఉదయం ప్రేయర్ చదివించిన సందర్భాలు..ఎప్పుడో కొన్ని సంవత్సరాల తరువాత జ్ఞాపకం వచ్చి తమ బాల్యాన్ని తడుముకునేందుకు,ఒక్క చదువు విషయంలో తప్ప ఏ బాదరాబంది లేని జీవితాన్నిఇంట్లో కన్నా స్కూలు లోనే ఎక్కువ గడిపిన సమయాన్లి, చుట్టూ స్నేహితులు, తరగతి గదులు,బెంచీలు, కోపాలు,ఆనందాలు,వేసవి సెలవుల తరవాత తమ క్లాసుల్లో తమ బెంచీ మీద కూర్చున్నప్పుడు కలిగే సంతోషాలను... వీటన్నింటినీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుందామనీ,తమ బాల్యానికి సంబంధించిన తీపి జ్ఞాపకాల పరిమళాన్నిఆస్వాదించాలనుకునే వాళ్ళకు నిరాశే మిగులుతుంది.ఎందుకంటే అక్కడ ఆ స్కూల్ లేదు, ఒక్కప్పుడు ఉందన్న ఆనవాళ్లు లేవు.నెక్ట్ రామగిరి బాయ్స్ హై స్కూల్ పరిస్థితి కూడా అంతే.అందుకే పూర్వ విద్యార్ధులకు నా విన్నపం
ఏమిటంటే తమ క్లాసు విద్యార్థుల రీయూనియన్ నిర్వహించుకునేందుకు ప్రయత్నించండి.అది ఎక్కడో
హోటల్ లో కాదు.మీ స్కూల్లోనే,మీ తరగతి గదుల్లోనే..అప్పుడు చూడండి మీరు మీ వయసు మర్చిపోయి పిల్లలవుతారు.కావలసినన్ని జ్ఞాపకాలను, అనుభవాలనుమీ పిల్లలతో పంచుకుంటారు.ఒకసారి ట్రై చేయండి...
                            
కామెంట్‌లు