జగిత్యాల టూ సిద్దిపేట వయా వేములవాడ....;- ప్రమోద్ ఆవంచ- 7013272452
 మెలికలు తిరిగే రోడ్డు..ఆ రోడ్డుకు ఇరువైపులా నేలపై పరుచుకున్న పచ్చని వరి పంటమ్మ.పైరగాలి ఆమె పైటనురెపరెపలాడిస్తుంటే తన్మయత్వంతో ఊగి పోతుంది.మెత్తని ఆమె పాదాలు బురద కల్లెంలో పాదుకొని ఉన్నాయి.మద్యలో ఉన్న మోటారు బోరు నుంచి వచ్చే
వెచ్చని నీళ్ళు తనను నిలువెల్లా తడిపేస్తుంటే వరి పంటమ్మ తనువు పులకరించి పోతుంది.మనసు ఆకాశంలో విహరిస్తూ ఉంది.
దూరంలో గుట్టలు ....ఆ గుట్టలపై బండ రాళ్ళు సైతం పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ కను రెప్పలు వాల్చడం లేదు.గట్టు మీద వాలిన ఒక కాకి పిల్ల,ఆ పచ్చదనాన్ని చూసి కుళ్ళు కుంది.కాలం కలిసి రాక పోతే భూతల్లి 
గుండెల్ని చీల్చి ఆ లోతుల్లో నుంచి గంగమ్మను ఇల మీదకు దింపే ప్రక్రియను మనిషి కనుగొన్నాడు.
ప్రకృతిని కూడా శాసించే ఆవిష్కరణ.
ఈ ఆవిష్కరణ ఎంతో మందికి అన్నం పెడుతుంది.వరి
పంటమ్మకు ఊపిరి పోస్తుంది.పొలం మధ్యలో తాటాకుల
గుడిసె దాని పక్కనే తన రెక్కలను చాచిన వేప చెట్టు
దాని కింద ఒక నులక మంచం.అది సూర్యుడు నడి నెత్తిని
దాటి పడమర ముఖంగా వెళ్ళే సమయం పొద్దంతా
అలసిపోయిన రైతన్న కునుకు తీస్తున్నాడు.చుట్టూ
పరుచుకున్న కష్టం,అది చేతికందే వరకు తెలియని జీవితం.చీమ చిటుక్కుమంటే ఉలిక్కిపడి లేచే తత్వం.
పంచభూతాలపై భారం.కరువొచ్చినా,కాటకమోచ్చినా
చేసిన అప్పుకు కిమ్మనకుండా వడ్డీ కట్టాల్సిందే.ఆయినా రైతు వ్యవసాయం చేయక మానడు.కాలాన్ని నమ్మక తీరడు.పొలం అవతల గట్టున గుట్టలు సెలవు తీసుకోవడానికి సిద్ధంగా సూర్యుడికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి...ఇవీ నేను జగిత్యాల
నుంచి వయా వేములవాడ, సిరిసిల్ల.. సిద్దిపేటకు వచ్చే దారికిరువైలా చూసిన అద్బుత దృశ్యాలు....కట్ చేస్తే.....
                   జగిత్యాల జిల్లా కేంద్రం, ఒకప్పుడు ఉమ్మడి 
కరీం నగర్ జిల్లాలో మండలం.రెండు రోజుల అఫీషియల్
క్యాంపు కోసం కారులో వెళ్ళాను.జగిత్యాలకు రెండు దారులు ఉన్నాయి ఒకటి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ
మార్గం,మరొకటి సిద్దిపేట, కరీంనగర్ ల మీదుగా.వెళ్ళే
అప్పుడు కరీంనగర్ దారినే ఎంచుకున్నాను.జగిత్యాల 
చేరుకునే సరికి పన్నెండు గంటలు అయ్యింది.సాయంత్రం
నాలుగు గంటల వరకు పని చేసుకొని రూమ్ కోసం ఒక హోటల్ కి వెళ్ళాను.రూమ్స్ లేవు సార్ అన్నాడు.అలా టౌనులో నాలుగు హోటల్స్ లో ట్రై చేసాను.ఎక్కడా రూమ్స్ లేవనే చెపుతున్నారు.విషయమేమిటంటే సోమవారం జగిత్యాలకు పీఎం మోడీ వస్తున్నాడనీ ఆయన సెక్యూరిటీ కోసం హైదరాబాద్,చెన్నై, డిల్లీ, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల నుంచి ఇండియన్ ఏయిర్ ఫోర్స్ సిబ్బంది
కోసం ఒక వారం ముందు నుంచే జగిత్యాల టౌనులో ఉన్న
హోటళ్ళలలో రూమ్స్ బుక్ చేసారు.వీళ్ళే కాదు, స్టేట్,అండ్ డిస్ట్రిక్ట్ పోలీసు అధికారులు, కలెక్టర్ మరియు
ఇతర ఉన్నతాధికారులు.......ఇంత మంది చేసే హడావుడిలో జగిత్యాల పట్టణం బందీ అయ్యింది  బ్యూరోక్రాట్స్, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కార్పోరేషన్ చైర్మన్లకు, వాళ్ళ ఆఫీసులు..ఆ ఆఫీసుల్లో సిబ్బంది,వాళ్ళ జీతాలు, వాళ్ళు వాడే వాహనాలు,ఆ వాహనాల్లో డీజిల్, పెట్రోలు ఇలా చూసుకుంటూ పోతే ప్రభుత్వం,ప్రభుత్వ రంగ సంస్థల్లో  దుర్వినియోగం అవుతున్న ఆ ధనం ఎవరిది....
దాన్ని ఎవరి నుంచి తీసుకుంటారు,ఎవరి మీద ఆ భారం పడుతుంది,అంటే చివరికి బలయ్యేది ప్రజలే.ఈ అడ్డగోలు ఖర్చులను ఎవరు నియంత్రించాలి, ఎవరు భాద్యత తీసుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానం కోసం మనం డెబ్భై ఏళ్ళుగా వెతుకుతూనే ఉన్నాం....
చివరికి కొత్త బస్టాండ్ పక్కన బృందావనం అనే హోటల్ లో దాని ఓనర్ నరేష్ రావును రిక్వెస్ట్ చేస్తే తెల్లారి ఉదయం తొమ్మిదింటికి ఖాళీ చేస్తానంటే రూమ్ ఇస్తాననీ,
కండీషన్ పెట్టి రూమ్ ఇచ్చాడు.సరే అని చెప్పి రూమ్ లోకి
వెళ్ళి ఫ్రెష్ అయి ఆరు గంటలకు మళ్ళీ బయటపడ్డాను.
                తెల్లారి ఉదయం ఆరున్నర నుంచే సార్ తొమ్మిదింటికి ఖాళీ చేయాలి అని రిమైండర్స్.చిట్టచివరకు
రూమ్ ఖాళీ చేసి ఉపమాలంకారాలు ( టిఫిన్)
టీకాతాత్పర్యాలు( టీ, కాఫీలు) స్వీకరించి,పాత బస్టాండ్ దగ్గర ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్ళాను.అక్కడ 
డాక్టర్స్ ని,బయట ప్రాక్టీసింగ్ డాక్టర్లను కలిసి మూడు గంటలకు హైదరాబాద్ బయలుదేరేందుకు సిద్దమయ్యాను.నేను సిద్దిపేట, కరీం నగర్ అనేకసార్లు
వెళ్ళాను కానీ వేములవాడ, సిరిసిల్ల అస్సలు చూడలేదు.
నాకెందుకో వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట మీదుగా
హైదరాబాద్ వెళ్ళాలని అనిపించింది.జగిత్యాల నుంచి
నా ప్రయాణం మొదలైంది.దారూర్, పోతారం,నూకపల్లి
ముత్యం పేట్,గ్రామాలు దాటాక కొండగట్టు...ఇక్కడ ప్రసిద్ధి చెందిన హనుమాన్ దేవాలయం ఉంది వేలాది మంది భక్తులు నిత్యం దర్శనానికి వస్తుంటారు.ముఖ్యంగా మంగళ, శని వారాలు భక్తుల రద్ది ఎక్కువగా ఉంటుంది.ఆ తరువాత
కొండగట్టు నుంచి కొంచెం దూరం వెళ్ళగానే కుడివైపు ఒక దారి వేములవాడకు వెళుతుంది.ఆ దారిలో ఫాజిల్ నగర్,
చెప్యాల్,శాత్రాజ్ పల్లి...ఈ మూడు ఊర్ల పొలిమేర్లలో
పచ్చని పంట పొలాలు,నిండు గర్భిణిలా పచ్చని వరి
పంటమ్మలు దూరంగా గుట్టలు ఎంతో అద్బుతంగా
కనిపించాయి.ఒక్క నిమిషం మనం గోదావరి జిల్లాలో ఉన్నామా లేక తెలంగాణాలో ఉన్నామా అన్న అనుమానం కలిగింది.పచ్చదనం కరువైన నా జీవితానికి కొత్త రంగులు అద్దినట్లు అనిపించింది, ఉత్సాహానికి రెక్కలు వచ్చి నీలాకాశం వైపు ఎగిరినట్లనిపించింది.ఆ పచ్చదనాన్ని తనివితీరా కళ్ళల్లోకి ఒంపుకున్నాను.మంచి మధ్యాహ్నం ఎండలో మనసుకు చలి పెట్టినట్లనిపించింది.సింగిల్ రోడ్డు మెలికలు తిరిగే పాములా ఉంటుంది. ఆ రోడ్డుపై ఒక పొడవాటి పాము వెళ్ళడం కూడా కనిపించింది, చాలా సంవత్సరాల తర్వాత పాము లైవ్ లో కనిపించగానే వెంటనే కారు ఆపి అది రోడ్డు క్రాస్ చేసేంత వరకు చూస్తూనే ఉన్నాను.చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది.పీక్ వింటర్,రెయినీ సీజన్ లలో
ఈ మెలికల రోడ్డుపై ప్రయాణం ఇంకా బాగుంటుంది.
రోడ్డు పొగమంచును దుప్పటిలా కప్పుకున్న  అద్బుత దృశ్యాలేన్నో చూడవచ్చు.నా ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ బాలూ మహేంద్ర సినిమాలోలా ఉంటుంది.
                వేములవాడ చేరుకున్నాను.టౌను చాలా పెద్దగా ఉంది.నేను ఊర్లోకి వెళ్ళలేదు.బైపాస్ రోడ్డులో వెళుతుంటే విశాలమైన రోడ్లు,అద్భుతమైన ఓవర్ బ్రిడ్జి,
ఆ తరువాత సిరిసిల్ల దాటాకా నేరెళ్ళ,తంగళ్ళపల్లి,
జక్కంపూర్,నారాయణ రావు పేట,( ఇది కొంచెం లోపలికి ఉంటుంది) గుర్రాలగొంది, రామంచ, గ్రామాలు అన్నీ 
పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.సిద్దిపేట ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉందనగా శ్రీరంగనాయక రిజర్వాయర్ ఉంటుంది...ఆ రిజర్వాయర్ పేరు నాకు కరెక్ట్ గా తెలియదు కాని రంగనాయక రిజర్వాయరే అని
అనుకుంటున్నాను.ఇది ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పడం కాదు దాన్ని చూస్తే ఆ ఫీలింగే వేరు.మేయిన్ 
రోడ్డుపై నుంచి ఎడమ వైపు ఒక అర కిలోమీటరు దూరం వెళితే బయటికి చిన్న కాలువగా కనిపిస్తుంది.దాని పక్కనున్న దారిలో నుంచి పైకి వెళితే మూడు కిలోమీటర్ల బ్రిడ్జి ఉంటుంది.ఆ బ్రిడ్జి మీద నుంచి వెనుకకు చూస్తే కను చూపు మేరలో మొత్తం నీళ్ళే నీళ్ళు.ఎంత బాగుందంటే అది ఒక పర్యాటక స్థలంగా భావించవచ్చు.సాయంత్రం సంధ్యా సమయం అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు.ప్రపంచానికి బాయ్ బాయ్ చెపుతూ పడమరలో నిష్క్రమించే సూరీడు...తనలోని శక్తిని,ఎవరో లాక్కెళ్ళుతున్న భావనలో మానవుడు క్రమ క్రమంగా మసగ బారుతున్న వెలుగు ఆహార వేటలో అలసిపోయి గూటికి చేరే పక్షులు,రోడ్డంతా తమదే అని నెమ్మదిగా నడిచే మేకల మంద,అవి వెళ్ళేంత వరకు నడి రోడ్డు మీద నిలిచిపోయే వాహనాలు,ఆ మేకల మంద రేపే దుమ్ము కారు అద్దాన్ని కమ్మేస్తుంది.నెత్తికి తలపాగా చుట్టుకొని, భుజంపై కర్రను,చేతులతో పట్టుకొని, మేకలను అదిలిస్తూ సాగే కష్టజీవులు,వ్యవసాయ కూలీలు పొద్దుగూకే సరికి గూటికి చేరుతారు....అద్బత దృశ్యం.మరొకసారి మనస్పూర్తిగా చెపుతున్న నాకైతే తెలంగాణాలో ఉన్న ఫీలింగ్ రాలేదు,ఏ గోదావరి జిల్లాలోనో ఉన్నట్లు అనిపించింది.రాబోయే రోజుల్లో సినిమా పరిశ్రమ వాళ్ళు ఇక్కడ షూటింగులు జరుపుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.ఎందుకంటే సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో ఇటీవల బలగం సినిమా షూటింగ్ కూడా జరిగింది.
                    సిద్దిపేట చేరుకొని స్కిప్ అయిన లంచ్ ను డిన్నర్ లా ముగించి,పచ్చదనాన్ని గుండెతో ఒడిసిపట్టుకుని హైదరాబాద్ బాట పట్టాను.....
                      
కామెంట్‌లు