కుక్కే మా పెద్దబిడ్డ (సంయుక్త అక్షరాలు లేని కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
 ఒక ఊరిలో ఒక పెద్ద జమీందారు వుండేటోడు. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు. చూడ్డానికి చక్కని చుక్కల్లాగుంటారు. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. వాళ్ళలో చిన్నబిడ్డ చేతి మీద ఒక పెద్ద పుట్టుమచ్చ పచ్చగా తళతళలాడుతా వుండేది. ఒకసారి ఆ జమీందారు పెళ్ళాంబిడ్డలతో కలసి దూరంగా వున్న ఒక పెద్ద గుడి చూడ్డానికని బైలుదేరినాడు. దారిలో ఒక పెద్ద అడవి వుంది.  అది అలాంటిలాంటి మామూలు అడవి కాదు. పులులూ, సింహాలు, నక్కలూ, తోడేళ్ళతో నిండి వుంది. ఆ అడవి దాటితే గుడి. జమీందారు పోతా పోతా బాగా అలసిపోయి కాసేపు ఆగి అలసట పోగొట్టుకుందామని ఒక చెట్టు కింద కూచున్నాడు. కాసేపటికి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమోగానీ ఒక పెద్దపులి భయంకరంగా అరుచుకుంటా వాళ్ళ మీదకు దుంకింది. దాని దెబ్బకు  భయపడి జమీందారు, ఆయన పెళ్ళాం తలోదిక్కు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయినారు. పులి చానా దూరం వాళ్ళ వెంటపడింది గానీ దానికి ఎవరూ చిక్కలేదు.
సరే.... పెద్దోళ్ళు ఎలాగూ దొరకలేదు. పిల్లలనన్నా తిందామని పులి తిరిగి ఆ చెట్టుకాడికి వచ్చింది. కానీ పులిని చూసిన పిల్లలు భయపడి అప్పటికే ఆ చెట్టు మీదికెక్కి దాచిపెట్టుకున్నారు. పులి చానాసేపు అటూ ఇటూ వెదుకుతా తిరిగింది. కానీ వాళ్ళు ఎక్కడా కనబడలేదు. ''ఛ... ఛ... చిక్కినట్టే చిక్కి అందరూ జారిపోయినారు. ఈ రోజు కడుపు నిండేలా లేదు'' అనుకుంటా అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీళ్ళ అమ్మా నాయన పిల్లలను పులి చంపేసి వుంటాదని అక్కడికి పోతే తమను గూడా చంపుతాదేమోనని భయపడి కళ్ళనీళ్ళతో తిరిగి వూరికి వెళ్ళిపోయినారు.
చెట్టు మీద కూచున్న చిన్న పిల్లలు అలాగే చానాసేపు అక్కడే కూచోని ఇక పులి ఎక్కడా కనబడక పోవడంతో నెమ్మదిగా కిందికి దిగినారు. ఆ అడవిలో వాళ్ళకు ఎక్కడికి పోవాలో తెలీలేదు. ఆకలితో ''అమ్మా... అమ్మా...'' అని పిలుచుకుంటా తిరుగుతా వుంటే దారిలో ఒక తోడేలు ఎదురయింది. అది చానా భయంకరంగా, పెద్దగా వుంది. అది పిల్లలను చూసి ''ఆహా... ఈ రోజు నాకు విందు భోజనం దొరికింది'' అని లొట్టలేసుకుంటా ఎగిరి వాళ్ళ మీదకి దుంకింది.
అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ ఒక కుక్క అక్కడికి వచ్చింది. అది తోడేలు పిల్లల మీదకు ఎగరడం చూసింది. ''అయ్యో.... పాపం చిన్నపిల్లలు... అడవిలో తప్పిపోయినట్టున్నారు. వీళ్ళని ఎలాగైనా కాపాడాలి'' అనుకోని అది ఎగిరి తోడేలు మీదకు దుంకింది. రెండూ కిందామీదా పడి ఒకదానినొకటి కరుచుకున్నాయి. కుక్కకు బాగా దెబ్బలు తగిలినాయి. అయినా అది వెనుకడుగు వేయలేదు. పట్టు వదల్లేదు. తోడేలును అందిన చోటల్లా పట్టి పీకసాగింది. దాంతో తోడేలుకు కూడా బాగా దెబ్బలు తగిలినాయి. ఈ కుక్క వున్నంతసేపు ఆ పిల్లలను ఏమీ చేయలేమనుకోని అది తిరిగి వెళ్ళిపోయింది. ఆ కుక్క పిల్లలను ఇద్దరినీ దగ్గరలోనే వున్న ఒక గుడికి తీసుకోని పోయింది. అక్కడ పూజారి ఈ పిల్లలను చూసి దగ్గరికి తీసుకున్నాడు. ''మీ అమ్మా నాన్నలను కలిసే వరకు ఇక్కడే వుండండి'' అన్నాడు. కుక్కగూడా వాళ్ళతో బాటే వుంటా, వాళ్ళకి తిండి పెడతా, తల దువ్వుతా, కావలసిన పళ్ళు, దుంపలు అడవిలోంచి తెచ్చిపెడతా, వాళ్ళు నవ్వితే నవ్వుతా, బాధపడితే బాధపడతా బాగా కలసిపోయింది. నెమ్మదిగా కొంతకాలానికి ఆ పిల్లలు బాగా పెరిగి పెద్దగయినారు. కుక్క కూడా ముసలిది అయిపోయింది.
ఒకరోజు పక్కనే వున్న వూరిలో పెద్ద తిరునాల జరుగుతా వుంటే పిల్లలిద్దరూ కుక్కను తీసుకోని చూడ్డానికి పోయినారు. అక్కడికి జమీందారు కూడా తన పెళ్ళాంతో వచ్చినాడు. వాళ్ళు తిరునాల జరిగినప్పుడల్లా అక్కడికి వచ్చి చచ్చిపోయినారనుకున్న తమ బిడ్డల పేరు మీద అందరికీ అన్నదానం చేసేటోళ్ళు. ఆ రోజు కూడా అలాగే అన్నదానం చేయసాగినారు. ఈ ఇద్దరు పిల్లలు సంబరంగా తిరునాలంతా తిరిగీ తిరిగీ అలసిపోయి అన్నం తిందామని అక్కడికి వచ్చినారు. జమీందారు పెళ్ళాం అందరికీ వడ్డించసాగింది. అలా చిన్న పాప దగ్గరికి వచ్చి అన్నం పెడతా వుంటే ఆ పాప ''చాలు... చాలు'' అంటా చేయి అడ్డం పెట్టింది. ఇంకేముంది ఆ పాప చేయి మీద పావలా కాసంత పుట్టుమచ్చ పచ్చగా తళతళలాడతా ఆమెకు కనబడింది. అది చూడగానే ఆమె ''కొంపదీసి ఈ పిల్ల నా బిడ ్డ కాదు గదా... దీనికి గూడా చనిపోయిందనుకుంటా వున్న నా బిడ్డ వయస్సే వుంటాది'' అనుకోని ఎక్కడి అన్నంగిన్నె అక్కన్నే వదిలేసి వురుక్కుంటా పోయి మొగునికి చూసిందంతా చెప్పింది.
దాంతో ఆయనగూడా వురుక్కుంటా ఆ పిల్లల దగ్గరకు వచ్చి 'మీ వూరేదమ్మా... అమ్మా నాయనా ఎక్కడుంటారు'' అని అడుగుతా అన్ని వివరాలు సేకరించుకొన్నాడు. వాళ్ళు విడిపోతా వున్నప్పుడు చిన్నపిల్ల చానా చిన్నదిగానీ పెద్దపిల్లకు కొంచం తెలివి వుంది. దాంతో ఆ పాపగూడా బాగా పట్టిపట్టి చూసి వాళ్ళ అమ్మానాయనలను కనుక్కోనింది. ఇంకేముంది అందరూ ఒకరినొకరు పట్టుకోని సంబరంగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు,.
జమీందారు ఆ పిల్లలొంక చూసి ఆనందంగా ''ఇంక... మీ బాధలన్నీ ఈ రోజుతో తీరి పోయినట్టే. మాతో పాటు వచ్చేయండి. ఇప్పటికే ఎన్ని బాధలు పన్నారో ఏమో.... ఇక గుండెల్లో పెట్టుకోని చూసుకుంటా'' అన్నాడు.
వాళ్ళు సరేనని తమతో పాటు ఆ కుక్కను గూడా తీసుకోని బైలుదేరినారు. అది చానా ముసలిదయి పోయింది గదా... దాంతో నడవలే నడవలేక నడవసాగింది. దాంతో పాటు వళ్ళంతా గాయాలతో చానా గలీజుగా వుంది.
అది చూసి జమీందారు ''ఎందుకమ్మా ఆ పాడుకుక్క. దాన్ని ఇక ఇక్కన్నే వదిలేయండి. చూడు ఎంత గలీజుగా వుందో... ఛీ... ఛీ...'' అన్నాడు కంపరంగా ముఖం పెట్టి.
అప్పుడా పిల్లలు ''చూడు నాన్నా... ఆ రోజు మన మీదకు పులి దుంకితే కన్నబిడ్డలని గూడా చూడకుండా మా ఇద్దరినీ అడవిలోనే వదిలేసి మీరు తలోదిక్కు పారిపోయినారు. కానీ ఈ కుక్క... దానికి మేమేమీ కాకపోయినా పాపం చిన్నపిల్లలు అని జాలిపడి తను చచ్చినా పరవాలేదనుకోని తోడేలు మీదకు పోయి మా ఇద్దరినీ కాపాడింది. అప్పుడు తగిలినవే ఈ దెబ్బలన్నీ. ఈ రోజు మేము బతికున్నామంటే అంతా దాని చలవే... మేము మీ ఇద్దరినన్నా వదిలిపెడతాం గానీ, ఈ కుక్కను ఎప్పటికీ వదలం'' అన్నారు.
ఆ మాటలకు వాళ్ళ అమ్మానాన్న కళ్ళనీళ్ళు పెట్టుకోని ''పాపా... మాకు విషయం తెలీక ఏదో తొందరపాటుతో అలా నోరు జారినాం. ఈ రోజు నుంచీ మాకు మీరెంతో ఆ కుక్కా అంతే... దాన్ని మా పెద్దబిడ్డ లెక్క కాలుకింద పెట్టనీయకుండా పువ్వుల్లో పెట్టుకోని చూసుకుంటాం'' అన్నారు.
అప్పుడా పిల్లలు కుక్కతో కలసి సంబరంగా అమ్మానాన్నా వెంట పోయినారు.
***********
కామెంట్‌లు