పాపిష్టి సొమ్ము - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
 ఒకూర్లో ఒక వ్యాపారి ఉండేటోడు. వాడు చానా పిసినారి. అంతేగాదు పెద్ద మోసగాడు కూడా. వానికో అంగడుంది. ఊర్లో జనాలు ఏమైనా కొనుక్కోవడానికి అంగడికొస్తారు గదా. అప్పుడు వాడేం చేసేటోడంటే వాళ్ళతో ఒకపక్క తియ్యతియ్యగా మాట్లాడూనే మరోపక్క తక్కువ తూకాలు తూచేటోడు. కల్తీ సరుకులు అమ్మేటోడు. అట్లా జనాలను మోసం చేసి సంపాదించిన సొమ్ముతో బంగారం, వజ్రాలు కొని పెండ్లాం బిడ్డలకు కూడా తెలియకుండా ఒక పాతకుండలో వేసి దాచిపెట్టినాడు.
ఒకరోజు రాత్రి వాడు పక్కూరి నుండి సామాన్లు కొనుక్కోని వస్తా... వస్తా... దారిలో చూసుకోక ఒక నాగుబాము మీద కాలేసినాడు. అంతే అది సర్రున లేచి కసుక్కున కాటేసింది. ఆ దెబ్బకు వాడు గిలగిలా కొట్టుకుంటా, నురగలు కక్కుకొని చచ్చిపోయినాడు.
వ్యాపారి చచ్చిపోయినాక వాని పెండ్లాం ఆ ఊర్లో బతకలేక ఇంట్లో వున్న సామానంతా బండి మీదేస్కోని, పిల్లల్ని తీసుకోని పుట్టింటికి చేరుకోనింది. ఆమెకు పాత కుండలో బంగారం, వజ్రాలు ఆమె మొగుడు దాచిపెట్టిన సంగతి తెలీదు గదా... అందుకే దాన్ని అక్కన్నే వదిలేసి వెళ్లి పోయింది.
ఒకరోజు రాత్రి నలుగురు దొంగలు దొంగతనం చేయడానికని వ్యాపారి ఇంట్లోకి దూరినారు. లోపలికి పోయి చూస్తే ఇంకేముంది... పగిలిన కుండలు, విరిగిన మంచాలు తప్ప ఎమీ కనబడలేదు. "సరే ఏం చేద్దాం పక్కింట్లోకన్నా దూకుదాం" అనుకున్నారు. కానీ ఆ పక్కింటి గోడ చానా ఎత్తుగా వుంది. "ఎట్లా ఎక్కాలబ్బా" అని చూస్తావుంటే దూరంగా మూలకు ఆ పాతకుండ కనబడింది. పోయి దాని మీద కాలుబెట్టి ఎక్కబోతా వుంటే ఆ కుండ పాతది గదా... ఫటుక్కున పగిలిపోయింది. చూస్తే ఇంకేముంది... బంగారం బంగారం కాదు. దొంగలంతా సంబరంగా ఆ బంగారం, వజ్రాలూ అన్నీ మూట కట్టుకోని ఒక గుళ్ళోకి చేరుకున్నారు.
వాళ్ళు పొద్దున్నుంచీ ఏమీ తినలేదు. దాంతో నలుగురికీ ఆకలి దంచికొట్టసాగింది. దాంతో ఒకడు "రేయ్...కడుపు కాలిపోతా వుంది. ఓ ఇద్దరు పోయి మాంచి బిర్యానీ కట్టించుకోని రాపోండి. వస్తానే బాగా తిని ఈ సొమ్మంతా సమానంగా పంచుకుందాం" అన్నాడు. సరేనని ఇద్దరు బిర్యానీ తేవడానికి బైలు దేరినారు.
వాళ్ళిద్దరూ అట్లా పోతావుంటే వాళ్ళలో ఒకడు “రేయ్...మనకు ఇంత వరకు ఎప్పుడూ దొరకనంత బంగారమూ, వజ్రాలు దొరికినాయి గదా... దీన్ని అనవసరంగా వాళ్ళిద్దరికీ ఎందుకు పంచాల. మనమే ఆ
మొత్తం కొట్టేసి సగం సగం పంచుకుందాం. ఇక జీవితంలో మళ్ళా దొంగతనం చేయాల్సిన అవసరమే వుండదు. హాయిగా కాలు మీద కాలేసుకోని బతకొచ్చు" అన్నాడు. ఆ మాటలింటూనే రెండోవానిక్కూడా ఆశ పుట్టి "సరే" అన్నాడు. దాంతో వాళ్ళిద్దరూ హాయిగా బిర్యానీ తిని, మిగతా దాంట్లో విషం కలుపుకొని ఏమీ ఎరుగని నంగనాచుల్లెక్క బైలుదేరినారు. 
అక్కడ ఇంకో ఇద్దరు దొంగలు గుళ్ళో వున్నారు గదా...వాళ్ళలో ఒకడు వీళ్ళు బిర్యానీ కోసమని బైటికి పోగానే పక్కనున్నోనితో “రేయ్...మనకు ఇంతవరకు ఎప్పుడూ దొరకనంత బంగారమూ, వజ్రాలూ దొరికినాయి గదా... దీన్ని అనవసరంగా వాళ్ళిద్దరికీ ఎందుకు పంచాల. మనమే ఆ మొత్తం కొట్టేసి సగం సగం పంచుకుంటే ఎట్లా వుంటుంది" అన్నాడు. ఆ మాటలింటూనే రెండోవానిక్కూడా ఆశ పుట్టి "సరే" అన్నాడు. దాంతో వాళ్ళిద్దరూ చెరో కత్తీ తీసుకొని గుడి తలుపుకు రెండు వైపులా దాచిపెట్టుకోని బైటికి పోయినోళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురు చూడసాగినారు.
బైటికి పోయిన దొంగలకిది తెలీదు గదా... దాంతో వాళ్ళిద్దరూ “బంగారమంతా మాదే" అనుకుంటా సంతోషంగా బిర్యానీ తీసుకోని తలుపు తెరచి లోపలికొచ్చినారు. అంతే... రెండువైపులా దాచి పెట్టుకున్న దొంగలు ఒక్కసారిగా వాళ్ళ మీద పడి కసుక్కున పొడిచేసినారు. ఆ దెబ్బకు పాపం వాళ్ళిద్దరూ అక్కడికక్కడే కిందా మీదా పడి గిల గిల గిల కొట్టుకుంటా చచ్చిపోయినారు.
వాళ్ళిద్దరూ చచ్చిపోగానే మిగతా ఇద్దరూ సంతోషంగా కింద పడిన బిర్యానీ పొట్లాలు తీసుకున్నారు. వాళ్ళకు బాగా ఆకలవుతోంది గదా... అందుకని ముందుగా బిర్యానీ తిని ఆ తరువాత బంగారు, వజ్రాలు పంచుకుందాం అనుకున్నారు. వాళ్ళిద్దరికీ అందులో విషం కలిపినేది తెలీదు గదా. దాంతో లొట్టలేసుకుంటా ఆవురావురుమని తిన్నారు. అలా తిన్న కాసేపటికే ఒళ్ళంతా విషమెక్కి గిల గిలా కొట్టుకుంటా వాళ్ళు కూడా అక్కన్నే పడి చచ్చిపోయినారు.
తరువాత రోజు పొద్దున దేవునికి పూజ చేద్దామని ఆ గుడి పూజారి వచ్చి తలుపు తెరిచినాడు. తెరిచి చూస్తే ఇంకేముంది... నలుగురు దొంగలు ఎక్కడికక్కడ చచ్చి పడున్నారు. మధ్యలో ధగధగలాడతా బంగారం
మెరిసి పోతావుంది. దాన్ని చూస్తానే ఆ పూజారికి ఆశ పుట్టింది. ఎవరికీ చెప్పకుండా మట్టసంగా ఆ నలుగురు దొంగల్ని గుంత తీసి పూడ్చి పెట్టేసి, ఆ సొమ్మంతా మూటగట్టుకొని ఇంటికి తీసుకోని పోయినాడు.
పూజారి కొన్ని వజ్రాలు అమ్మి వచ్చిన సొమ్ముతో ఆ ఊరి చెరువు పక్కనే పెద్ద అందమైన మేడ కట్టించుకున్నాడు. పెండ్లాం బిడ్డలకేమో ఒంటి నిండా మోయలేనన్ని నగలు చేపిచ్చినాడు. ఒక రోజు రాత్రి అనుకోకుండా పెద్ద వాన కుండపోతగా విరుచుకు పడింది. వానంటే అట్లాంటిట్లాంటి వాన గాదు. దెబ్బకు చెరువు నిండిపోయి గండి పడింది. చెరువు పక్కనే గదా పూజారి మేడ వుండేది. ఆ నీళ్ళ దెబ్బకు మేడంతా వడిపోయింది. నగలు దాచి పెట్టిన ఇనప్పెట్టె నీళ్ళలో కొట్టుకొని పోయింది. అది అట్లా కొట్టుకోనిపోయి... కొట్టుకోనిపోయి... ఒక అడవిలో పొదల నడుమ చిక్కుకొనింది.
ఒక జమీందారు ఒకరోజు వేటకని అడవికి పోయినాడు. జంతువులను వేటాడుతా... వేటాడుతా పోతావుంటే ఒక పొదలో ఇనప్పెట్టె కనపడింది. "ఏముందబ్బా దీంట్లో" అని పగలగొట్టి చూస్తే ఇంకేముంది కండ్లు జిగేల్మన్నాయి.
ఆ జమీందారు అవన్నీ తీస్కోనిపోయి పెండ్లాం, బిడ్డలకు ఇచ్చినాడు. వాళ్ళు సంబరంగా అవి మెళ్ళో వేసుకోని టింగురంగా అని తిరగసాగినారు. కానీ... వాళ్ళు అవి వేసుకున్న కొన్ని నాళ్ళకే ఇంట్లో అందరికీ రోగాలు పట్టుకున్నాయి. ఎంత మంది వైద్యులొచ్చినా... ఎన్ని మందులేసినా... కొంచెం గూడా తగ్గకపోగా రోజు రోజుకీ మరింతగా పెరగసాగినాయి.
ఇదేందిరా నాయనా... ఈ రోగాలు ఇట్లా పట్టుకున్నాయని ఆ ఊరి బైటున్న ఒక ముని దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పినాడు. ఆ మునికి దివ్యదృష్టి ఉంది. దాంతో జరిగిందంతా చూసినాడు. చూసి "నాయనా... నీకీ నడుమ అడవిలో బంగారం, వజ్రాలు దొరికినాయి గదా... అది మామూలు సొమ్ము గాదు. జనాలను మోసం చేసి సంపాదించిన సొమ్ము. అందుకే అవి ఎవరి దగ్గరున్నా కష్టాలు నష్టాలే తప్ప సుఖాల్లేవు. వెంటనే ఆ పాపిష్టి సొమ్ము తీస్కోని పోయి పేదోళ్ళకు పంచు. అప్పుడు మీ రోగాలు తగ్గిపోతాయి" అని చెప్పినాడు.
అప్పుడు ఆ జమీందారు ముని చెప్పినట్లుగానే ఆ సొమ్మంతా పేదోళ్ళకు పంచి పెట్టినాడు. జనాలను మోసం చేసి సంపాదించిన సొమ్ము తిరిగి వాళ్ళనే చేరుకునే సరికి వాళ్ళందరి రోగాలు తగ్గిపోయినాయి.
***********
కామెంట్‌లు