బోడి రూపాయ;- డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
 ఒకూర్లో ఒక ముసల్ది వుండేది. ఆ ముసల్ది చానా పిసినారిది. సచ్చినా ఒక్క పైసాగూడా ఎవరికీ ఇచ్చేది కాదు. ఆ ముసల్దాని దగ్గర ఒక ఇనప్పెట్టె వుండేది. అందులో వంద రూపాయలు వుండేవి. ప్రతిరోజు సాయంత్రం మచ్చు పై నుండి పెట్టె కిందకు దించి డబ్బులన్నీ లెక్క బెట్టుకోని మళ్ళా జాగ్రత్తగా పైన దాచి పెట్టేది.
ఆ ముసల్దానికి ఒక కోడలుంది. ఆమె ఇదేందబ్బా మా అత్త రోజూ పెట్టె దించి ఏందో ఎంచుతా వుందని ఒకరోజు అత్త బైటకు పోగానే పెట్టె దించి చూస్తే రూపాయ బిళ్ళలు కనబడినాయి. ఓహో! ఇదా సంగతని మట్టసంగా ఒక రూపాయ బిళ్ళ తీసుకోని బొడ్లో దాచి పెట్టుకోనింది.
సాయంత్రం అత్త వచ్చి ఎప్పట్లాగే పెట్టె దించి రూపాయలన్నీ ఎంచేసరికి ఒకటి తక్కువొచ్చింది. ఆమె అదిరిపడి ఇదేందబ్బా ఒకటి తక్కువొచ్చిందని మళ్ళా ఎంచింది. ఎన్నిసార్లు ఎంచినా ఒకటి తక్కువే వచ్చింది. 
అంతే... ఆ ముసల్ది “అమ్మో... నా రూపాయ పోయిందిరో నాయనో..." అని గట్టిగా కప్పెగిరి పోయేటట్టు ఒక్కరుపు అరచి దభీమని కిందపడిపోయింది.
కాసేపటికి ముసల్దాని కొడుకు పొలం నుంచి ఇంటికి వచ్చినాడు. ఇంటిబైట కూచున్న పెండ్లాంతో "మా అమ్మ యాడుందే" అనడిగినాడు. దానికామె “లోపలుంది. చూడుపో" అనింది. వాడు లోపలికి పోయి చూస్తే ఇంగేముంది... ముసల్ది నోరు తెరచి ఆకాశంలోకి చూస్తా చచ్చిందాని లెక్క పడుంది. ఎంత కదిపినా కదల్లేదు. 
దాంతో వాడు వాళ్ళమ్మ చచ్చిపోయిందనుకోని గట్టిగా ఏడ్చడం మొదలు పెట్టినాడు. వాని పెండ్లాం మాత్రం ఏమీ పట్టిచ్చుకోకుండా హాయిగా అరుగు మీద కూచోనింది.
వాడది చూసి "ఏమే! అత్త చచ్చిపోయిందనే బాధ కొంచెం గూడా లేదు నీకు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు. కొంచం ఏడ్చే" అన్నాడు.
దానికామె "అప్పుడే ఏం ఏడ్చాల్లే. మీ బంధువులంతా వస్తారు గదా... అప్పుడు ఏడుస్తా" అనింది.
సాయంకాలనికి బంధువులంతా వచ్చినారు. అప్పుడు వాడు పెండ్లాంతో “ఏమే మన బంధువులంతా వచ్చినారు. ఇప్పుడన్నా ఏడ్చే" అన్నాడు.
దానికామె "అప్పుడే ఏం ఏడ్చాల్లే. మీ ఊరోళ్ళంతా వస్తారు గదా... అప్పుడు ఏడుస్తా" అనింది.
కాసేపటికి ఊరోళ్ళందరూ వచ్చినారు. అప్పుడు వాడు పెండ్లాంతో “ఏమే! ఊరోళ్ళంతా వచ్చినారు. ఇప్పుడన్నా ఏడ్చే" అన్నాడు.
దానికామె "అప్పుడే ఏం ఏడ్చాల్లే. శవాన్ని ఎత్తుతారు గదా... అప్పుడు ఏడుస్తా" అనింది.
కాసేపటికి ముసల్దాన్ని పాడె మీద కట్టి పైకి లేపినారు. అప్పుడు వాడు పెండ్లాంతో "ఏమే! శవాన్ని కాటికి తీసుకుపోతా వున్నారు. ఇప్పుడన్నా ఏడ్చే" అన్నాడు.
దానికామె “అప్పుడే ఏం ఏడ్చాల్లే. శవాన్ని శ్మశానం కాడ దించుతారు గదా... అప్పుడు ఏడుస్తా" అనింది.
కాసేపటికి ముసల్దాన్ని శ్మశానం కాడ దించినారు. అప్పుడు వాడు పెండ్లాంతో “ఏమే శవాన్ని శ్మశానం కాడికి గూడా తెచ్చినారు. ఇప్పుడన్నా ఏడ్చే" అన్నాడు.
దానికామె "అప్పుడే ఏం ఏడ్చాల్లే. శవాన్ని గుంతలోకి దించుతారు గదా... అప్పుడు ఏడుస్తా" అనింది.
కాసేపటికి శవాన్ని గుంతలో దించినారు. అప్పుడు వాడు పెండ్లాంతో “ఏమే! శవాన్ని గుంతలోనికి గూడా దించినారు. కనీసం ఇప్పుడన్నా ఏడ్చే" అన్నాడు.
అప్పుడామె గుంత దగ్గరికి పోయి ముసల్దాన్ని చూస్తా "ఓ అత్తా! ఇదిగో నీ రూపాయ పట్టు. ఎవరిక్కావాల నీ బోడి రూపాయ తీసుకో" అని గట్టిగా అరిచి ఆమె మీదికి విసిరికొట్టింది. అంతే... ముసల్ది "ఆ... నా రూపాయ దొరికిందా" అంటూ ఠక్కున పైకి లేచి కూచోనింది. అది చూసి అందరూ ఆమె పిసినాసితనానికి నోరెళ్లబెట్టారు.
***********
కామెంట్‌లు