దొరికావులే శంకరయ్య;- డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
 ఒక ఊరిలో శీనయ్య, శంకరయ్య అని ఇద్దరు పక్కపక్క ఇళ్ళలో వుండేటోళ్ళు. శీనయ్య చానా మంచోడు. నిజాయితీ పరుడు. కానీ శంకరయ్య అలాకాదు. పైకి అందరితో మంచిగా, తీయగా మాటలాడతా వుంటాడు గానీ పెద్ద టక్కరోడు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మోసం చేసి డబ్బు సంపాదించాలా అని కాసుకోని కూచోనుంటాడు. వాళ్ళిద్దరికీ రాజవీధిలో పెద్దపెద్ద సరుకులు అమ్మే అంగళ్ళు వుండేవి. చుట్టుపక్కల వూళ్ళలో తక్కువ ధరకు దొరికేవి తీసుకోనొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మి లాభాలు పొందుతావుంటారు.
ఒకసారి శీనయ్య కాశీకి పోయినాడు. అక్కడ చానా విలువైన బంగారు నగలు తక్కువ ధరకు అమ్ముతా వుంటే చూసి కొని తెచ్చినాడు. వాటిని అంగడిలో పెట్టి అమ్ముదామనుకున్నాడు కానీ అంతలోనే వాళ్ళకు చానా దగ్గర బంధువు ఒకరు చనిపోయినాడు. ఇంటిల్లిపాదీ తప్పనిసరిగా పోయి రావాలి. ఆకాలంలో దొంగల భయం చానా ఎక్కువగా వుండేది. దాంతో నగలన్నీ ఎక్కడ దాచిపెట్టాలో తెలీక శంకరయ్యకు ఇచ్చి తాను వచ్చే వరకు దాచి వుంచమన్నాడు.
శంకరయ్య సరే అని నగలన్నీ తీసుకున్నాడు. కానీ వాటిని దాచి పెట్టలేదు. శీనయ్య ఊరికి పోగానే తన అంగడిలో పెట్టి అమ్మసాగినాడు. ఇదంతా తెలీని శీనయ్య వారం తరువాత తిరిగి వచ్చి తన నగలు ఇవ్వమన్నాడు. కానీ శంకరయ్య అమాయకంగా గంగిగోవులా ముఖం పెట్టి ''ఏ నగలు, ఎప్పుడు ఇచ్చినావు? ఎవరికి ఇచ్చినావు? ఇచ్చినట్టు రశీదు ఏమయినా వుందా?'' అంటా అడ్డం తిరిగినాడు. ఆ మాటలకు శీనయ్య నోట మాట రాలేదు. చుట్టుపక్కల ఎవరికి చెప్పుకున్నా ''వూరికే ఇచ్చానంటే ఎలా శీనయ్యా... ఏదో ఒక ఆధారం వుండాలి గదా... అలాంటివన్నీ లేకుండా ఎలా వచ్చి అడుగుతాం'' అన్నారు. దాంతో శీనయ్యకు ఏం చేయాలో తోచక ఆ ఊరి పెద్ద దగ్గరికి పోయినాడు. ఆయన చానా తెలివైనోడు. ఎటువంటి చిక్కుముడినయినా సరే ఇట్టే విప్పేయగలడు. ఆయనకు శీనయ్య జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించినాడు.
ఆ ఊరి పెద్ద శీనయ్య చెప్పిన మాటల్లో నిజముందా లేదా అని కొందరిని విచారణకు పంపినాడు. వాళ్ళు పోయి 'శీనయ్య చానా మంచోడని, శంకరయ్య పైకి మంచిగా వుంటాడు గానీ లోన పెద్ద దురాశాపరుడనీ, అదీగాక ఇటీవలే బంగారు నగలు అంగడిలో పెట్టి చానా తక్కువ ధరకు అమ్ముతున్నాడనీ' చెప్పినారు. ఊరిపెద్ద ఆలోచనలో పన్నాడు. ఎవరూ అమ్మనంత తక్కువ ధరకు అమ్ముతా వున్నాడంటే అవి వూరికే వచ్చినేటివే అయి వుంటాయి. కొనింటే లాభం లేకుండా ఎవరూ అమ్మరు గదా అనుకోని బాగా ఆలోచించి తరువాత రోజు ఇద్దరినీ పంచాయితీకి పిలిపించినాడు.
పంచాయితీలో శంకరయ్యతో ''మీ అంగడిలో బంగారు నగలు చానా మంచివి, చానా తక్కువ ధరకు అమ్ముతా వున్నారంట గదా... అంత తక్కువ ధరకు చుట్టుపక్కల వూళ్ళలో ఎక్కడా దొరకవు. ఎక్కడినుంచి తెప్పించినారు'' అని అడిగినాడు.
ఆ మాటలకు శంకరయ్య కొంచం గూడా తడుముకోకుండా ''అయ్యా... ఇటీవలే కాశీకి పోయి వచ్చినాను. అక్కడినుండి తెచ్చినా'' అంటా అబద్ధం చెప్పినాడు.
''అలాగా... ఇంతకీ కాశీకి పోయి రావడానికి రెండు నెలలు పడుతుందా, మూడు నెలలు పడుతుందా'' అని అడిగినాడు వూరిపెద్ద.
అప్పుడు ఇప్పటిలా బస్సు, కారు, జీపు, రైలు లాంటివి లేవుగదా... ఎక్కడికైనా ఎద్దులబండి లేదా గుర్రం బండి మీదనే వెళ్ళి రావాలి గదా... దాంతో శంకరయ్య రెండా మూడా... రెండా మూడా... అని కాసేపు ఆలోచించి రెండు నెలలు పడుతుంది'' అన్నాడు.
ఆ మాటలకు వూరి పెద్ద్ద నవ్వి ''కాశీకి పోవడానికి రెండు నెలలూ కాదు, మూడు నెలలూ కాదు. దాదాపు ఆరు నెలలు పడుతుంది. నువ్వు ఎప్పుడైనా అక్కడికి పోయి వచ్చింటే గదా ఆ విషయం తెలియడానికి. నిన్ను తప్పుదోవ పట్టించి నిజం కక్కించడానికే రెండు నెలులు పడుతుందా, మూడు నెలలు పడుతుందా అని అడిగినాను. నీవెప్పుడూ పోలేదు కాబట్టి దానిలోనే జవాబు వుందనుకోని దొరికిపోయినావు. మరియాదగా నిజం వొప్పుకోని మిగిలిన బంగారం, అమ్మిన డబ్బు తెచ్చి శీనయ్య చేతిలో పెడతావా లేక రాజభటులకు అప్పగించమంటావా'' అన్నాడు కోపంగా.
ఆ దెబ్బకు అదిరిపోయిన శంకరయ్య తప్పు ఒప్పుకోని వురుక్కుంటా పోయి అన్నీ తీసుకోనొచ్చి శీనయ్య చేతిలో పెట్టినాడు.
***********
కామెంట్‌లు